కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. విపక్షాల నుంచే కాకుండా పలు భాగస్వామ్య పార్టీలూ కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ రైతు విభాగం భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమేనని ఆరోపించింది. అయితే.. పార్లమెంట్లో బిల్లులు ఆమోదం పొందిన సమయంలో కిసాన్ సంఘ్ స్వాగతించినప్పటికీ.. పలు సూచనలు, డిమాండ్లను కేంద్రం ముందు ఉంచినట్లు పేర్కొంది.
ఈ అశంపై ఈటీవీ భారత్తో కీలక విషయాలు పంచుకున్నారు భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా.
" మూడు వ్యవసాయ చట్టాల్లో వ్యాపారులకే మేలు జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, రైతులకు మేలు జరగాలంటే చట్టాల్లో మార్పులు చేయాలి. లేని పక్షంలో రైతులు, వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోతారు. అలాగే నూతన చట్టాలు రైతులు తమ పంటలను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి. రైతులు తమ సొంత ఉత్పత్తుల వ్యాపారులుగా మారేందుకు అధికారం ఇస్తున్నాయి. "
- మోహిని మోహన్ మిశ్రా, కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి
ఒకే దేశం- ఒకే మార్కెట్ విధానం, మండీల్లో పన్ను రద్దు వంటి నిర్ణయాలను స్వాగతించింది కిసాన్ సంఘ్. పంట ఉత్పత్తుల చెల్లింపులపై భద్రత కల్పించాలని సూచన చేసినట్లు చెప్పారు మిశ్రా. దాని ద్వారా రైతులకు బ్యాంకు గ్యారంటీ లభిస్తుందన్నారు.