కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది ఉపయోగించే ఎన్95 మాస్కులను వైరస్ రహితంగా చేయడానికి దిల్లీ ఐఐటీకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ 'చక్ర్ జికోవ్' పేరుతో ఓక పరికరాన్ని రూపొందించింది. వంటింట్లో వాడే ఓవెన్లా ఉండే ఈ పరికరంలో ఒక ట్రేలో మాస్కులను ఉంచి తలుపు మూయగానే అవసరమైనంత ఓజోన్ వాయువు ఉత్పత్తై ఎన్95 మాస్కులను 99.99 శాతం శుభ్రం చేస్తుంది. దీని పనితీరును పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించి ధ్రువీకరించింది.
గంటన్నరలో 50 మాస్కులు..
ఒకసారి లోపల మాస్క్లన్నీ శుభ్రం అయిన వెంటనే ఓజోన్ దానంతట పూర్తిగా తగ్గిపోయే ఏర్పాట్లు చేశారు. 90 నిమిషాల్లో ఒకేసారి 50 మాస్కులు శుభ్రం చేసేలా దీన్ని రూపొందించారు. ఓజోన్ వాయువు బయటకు లీక్ కాకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు రూపకర్తలు పేర్కొన్నారు. అతినీల లోహిత కిరణాల కంటే ఈ విధానం ద్వారా మాస్కులు పూర్తిగా శుభ్రం అవుతాయని తెలిపారు.