కర్ణాటక కొప్పాల్ మండలం లెబ్గేరీ గ్రామంలోని శ్రీ మారుతేశ్వర స్వామి ఆలయంలో కార్తీకోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మారుతేశ్వరుని కొలుచుకుంటారు ఇక్కడి ప్రజలు.
అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. మొక్కులు చెల్లించుకునే విధానమే కాస్త విభిన్నం. కోరిన కోర్కెలు నెరవేరితే ముళ్ల పొదలపై దూకి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీకోత్సవాలలో ముళ్ల పొదలపై దూకే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయం ముందు వీధిలో పెద్ద ఎత్తున ముళ్ల పొదలను ఏర్పాటు చేసి.. డప్పు వాయిద్యాల మధ్య ఉత్సాహంగా ముళ్లపై దూకుతారు. శరీరంలో ముళ్లు గుచ్చుకుని రక్తాలు కారుతున్నా లెక్క చేయరు. ఈ ఉత్సవాలను చూసేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.