తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీ అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?' ఇకపై తప్పని సరి

ఈ ఏడాది జరగనున్న ఎన్​పీఆర్​లో ఏడు కొత్త ప్రశ్నలను జత చేసింది జనాభా లెక్కల విభాగం. పుట్టిన తేదీ, కుటుంబ యజమాని, తల్లిదండ్రుల వివరాలు సహా మొత్తం 23 ప్రశ్నలకు కుటుంబం వివరాలన్నీ నమోదు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్​- సెప్టెంబరు మధ్య ఈ జనగణన జరగనుంది.

this year on wards in npr there has 23 questions including another 7questions.. said npr
'మీ అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?' ఇకపై తప్పని సరి

By

Published : Feb 27, 2020, 6:47 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

'మీ అమ్మ, నాన్నల పేర్లేమిటి.. ఎక్కడ పుట్టారు.. వారిద్దరి పుట్టిన తేదీలు ఏమిటి.. అనే ప్రశ్నలకు ప్రతి భారతీయ పౌరుడు సమాధానాలు చెప్పాలి. వీటితో సహా మొత్తం 23 ప్రశ్నలకు కుటుంబం వివరాలన్నీ ‘జాతీయ జనాభా పట్టిక'(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్‌)లో పక్కాగా నమోదు చేయాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ప్రతి రాష్ట్రంలో 45 రోజుల పాటు జనగణన మొదటి దశ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నుంచి జూన్‌లోగా పాఠశాలలకు సెలవులుంటాయని, ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని, ఆలోగా ఇది పూర్తిచేయాలనే యోచన ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించే తేదీలను బట్టి 45 రోజుల పాటు ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రతి కట్టడం, కుటుంబం వివరాలు నమోదు చేస్తారు. కట్టడానికి 33 ప్రశ్నలతో ఒక దరఖాస్తు, ఇది కాకుండా అదనంగా ప్రతి కుటుంబానికి 23 ప్రశ్నలతో మరో దరఖాస్తు ఉంటుంది.

కట్టడాల వివరాల సేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. ఎన్‌పీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏమీ స్పష్టం చేయలేదు. దీనికి సంబంధించి సేకరించాల్సిన సమాచారాన్ని జాతీయ జనాభా లెక్కల విభాగం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఏయే ప్రశ్నలుంటాయి? ఎన్ని ఉంటాయి? ప్రజలేం చెప్పాలి? ఎలా చెప్పాలి అనే సమాచారం ‘ఈనాడు’కు అందింది.

ముఖ్యాంశాలు...

* జనగణనలో భాగంగా దేశంలో ఎన్‌పీఆర్‌ను తొలిసారి 2010-11లో నమోదు చేశారు. 2015లో తాజా సమాచారాన్ని రికార్డు చేశారు. ఇప్పుడు గణకులు ఇంటింటికి వెళ్లి మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో గతంలో నమోదు చేసిన సమాచారం చెక్‌ చేస్తారు. అదనపు సమాచారంతో నింపుతారు. ప్రజలు కావాలని తప్పుడు సమాచారం చెప్పినా ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే గణకులకు తెలిసిపోతుంది. ఇంతకుముందు ఉన్నవి తప్పా లేక ఇప్పుడు చెప్పేవి తప్పా అని ప్రశ్నించే అవకాశం ఉంది.

* 2010లో మొత్తం 16 ప్రశ్నలు అడిగారు. ఈసారి 23 ప్రశ్నలకు కుటుంబ యజమాని నుంచి సమాధానాలు సేకరిస్తారు.

* 2015 నుంచి కొత్తగా పెళ్లి చేసుకుని లేదా వేరు కాపురాలు పెట్టిన ఇళ్లలో నివసించే కుటుంబాలకు మాత్రమే కొత్త ఎన్‌పీఆర్‌ దరఖాస్తు నింపుతారు. తక్కిన కుటుంబాలకు పాత ఎన్‌పీఆర్‌లనే పరిశీలించి అదనపు సమాచారంతో నింపుతారు.

* జనగణనలో రెండో దశ కింద 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. ప్రతి ఒక్కరిని కనీసం 20 నుంచి 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటినింకా నిర్ణయించలేదు. ఇప్పుడు అడిగే 23 ప్రశ్నల్లో ఆరింటిని.. రెండో దశలో వ్యక్తిగత వివరాల నమోదు సమయంలో మళ్లీ అడుగుతారు. అవే ఆరు ప్రశ్నలుంటాయి కాబట్టి ఇప్పుడు ఎన్‌పీఆర్‌ సందర్భంగా వాస్తవ సమాచారం చెప్పారా లేదా అనేది తిరిగి రెండో దశ సమాచారం ఇచ్చే సమయంలో తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.

ఒకదానికొకటి అనుసంధానం...

ప్రతి కుటుంబానికి కేటాయించిన ఎన్‌పీఆర్‌లో అడిగే 23 ప్రశ్నల్లో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఉదాహరణకు ఆధార్‌ సంఖ్య సరిగ్గా చెప్పాలి. ఒకవేళ అది తప్పుగా చెబితే దాని ఆధారంగా తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌ కనెక్షన్‌ ఇలాంటివన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో తప్పని తేలతాయి. అన్నీ సరిగా చెబితే ఏ సమస్యా ఉండదు.

2010, 2015, తిరిగి ఇప్పుడు ఎన్‌పీఆర్‌లో అడిగే 16 ప్రశ్నలివే...

* కుటుంబంలో ప్రతి సభ్యుడి పేరేమిటి?

* కుటుంబ యజమానితో ఉన్న బంధం ఏమిటి?

* లింగం(పురుషులా, స్త్రీ లేక ట్రాన్స్‌జెండరా?)

* ప్రతి కుటుంబ సభ్యుడి పుట్టిన తేదీ

* వివాహమైందా? కాలేదా?

* కుటుంబ యజమాని జీవిత భాగస్వామి పేరేమిటి?

* కుటుంబ యజమాని ఎక్కడ పుట్టారు?

* విద్యార్హత ఏమిటి?

* వృత్తి ఏమిటి? ఏం పనిచేస్తున్నారు?

* ప్రస్తుత చిరునామా ఏమిటి?

* ప్రస్తుత చిరునామాలో ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు?

* శాశ్వత చిరునామా ఏమిటి?

* ఆధార్‌ సంఖ్య ఎంత?

* జాతీయత ఏమిటి?

* తల్లి పేరేమిటి?

* తండ్రి పేరేమిటి?

2020-21 ఎన్‌పీఆర్‌లో కొత్తగా చేర్చిన 7 ప్రశ్నలివే

* కుటుంబ యజమాని ఓటరు కార్డు సంఖ్య ఏమిటి?

* గతంలో ఎక్కడ నివసించేవారు?

* డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంఖ్య ఏమిటి?

* భారత పాసుపోర్టు ఉంటే దాని సంఖ్య ఏమిటి?

* సెల్‌ఫోన్‌ నెంబరు ఏమిటి?

* కుటుంబ యజమాని తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారు? వారి పుట్టినతేదీ?

* కుటుంబంలో ప్రతి ఒక్కరి మాతృభాష ఏమిటి?

పత్రాలు ఇవ్వనవసరం లేదు

* గణకులకు ప్రజలు ఏ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనవసరం లేదు. ఎవరైనా గణకులు పత్రాలు అడిగితే వారి పైఅధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ముఖ్య పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారు.

* జనాభా లెక్కల సేకరణ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ సరైన సమాధానం చెప్పాలి. ఒకవేళ తెలియదు అని చెబితే అదే రాస్తారు.

Last Updated : Mar 2, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details