మన పూర్వీకులు ఒకప్పుడుబలమైన ఆహారం తీసుకున్నారు.. పోషకాలున్న కూరగాయలు తిన్నారని మనకు తెలుసు. కానీ వాణిజ్య పంటలపై మోజుతో.. ఆ సంప్రదాయ పంటలు, మొక్కల సాగు మానేశాం. ఫలితంగా.. ఎన్నో అరుదైన మొక్కలు మాయమయ్యాయి. కనీసం, విత్తనాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నిజాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంది మహారాష్ట్రకు చెందిన శ్రుతి. అందుకే, దేశం నలుమూలల మిగిలున్న 250 అరుదైన జాతి విత్తనాలును సేకరించి.. వాటిని వృద్ధి చేస్తోంది.
మట్టితో చెలిమి...
బీడ్ జిల్లా విప్రా నగర్‌కు చెందిన శ్రుతి బీఎస్సీ పూర్తి చేసింది. తండ్రి ఏళ్లుగా కొరియర్ వ్యాపారం చేస్తున్నారు. శ్రుతి కుటుంబానికి ఎకరం భూమి కూడా లేదు. కానీ, మట్టితో చెలిమి చేసింది శ్రుతి. స్వతహాగా వ్యవసాయాన్ని ఒంటబట్టించుకుంది. సాగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చే దేశంలో అంతరించిపోతున్న పంటల గురించి తెలుసుకుని కలత చెందింది.
ఆలస్యం చేయకుండా దేశం నలుమూలల నుంచి అరుదైన, ఈ తరం వారు అసలు పేర్లు కూడా వినని ఎన్నో రకాల విత్తనాలను తెప్పించుకుంది. తనకు ఆ గింజలు పంపిన వారికి ఏడాదిలోగా.. అంతకు రెండింతల విత్తనాలు తిరిగి పంపాలని సంకల్పించింది. సొంత నేల లేకున్నా.. ప్లాస్టిక్ గంపల్లో మట్టి పోసి, విత్తనాలను సాగు చేసింది. లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు దేశవ్యాపంగా దాదాపు 18 వేల మంది రైతులకు ఈ విత్తనాలను పోస్ట్‌లో పంపింది శ్రుతి.