కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనను ఎలాంటి పరిశీలన లేకుండానే సర్వోన్నత న్యాయస్థానం ఆమోదిస్తోందంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం.. ప్రభుత్వం చేతిలో బందీ కాదని స్పష్టంచేసింది. లాక్‌డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. వలస కార్మికుల అంతర్ రాష్ట్ర ప్రయాణాలను అనుమతించే ప్రతిపాదన ఏదైనా ఉందా అన్నది వారంలోగా స్పష్టంచేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
వారిని ఇళ్లకు పంపెలా చర్యలు తీసుకోండి..
వలస కూలీల సమస్యలపై అహ్మదాబాద్ ఐఐఎం మాజీ డైరెక్టర్ జగదీప్ ఎస్ చొకర్, న్యాయవాది గౌరవ్ జైన్‌లు పిటిషన్ వేశారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాక 'నెగిటివ్'గా తేలిన వారిని స్వస్థలాలకు పంపేలా ఆదేశాలివ్వాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం వ్యక్తంచేసిన అభిప్రాయాలను ఎలాంటి పరిశీలన లేకుండానే కోర్టు కళ్లు మూసుకుని పరిశీలనలోకి తీసుకుంటోందని, వలసకూలీల ప్రాథమిక హక్కులు అమలుకు నోచుకోవడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 'వ్యవస్థపై నమ్మకం లేనప్పుడు మీ వాదనలను కోర్టు ఎందుకు ఆలకించాలి' అని ప్రశ్నించింది. 'మీకు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు. ఈ న్యాయస్థానం.. ప్రభుత్వం చేతిలో బందీ కాదు' అని స్పష్టంచేసింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసం లేదని తాను ఎప్పుడూ అనలేదని భూషణ్ వివరణ ఇచ్చారు. స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా వలస కూలీలు అంతర్ రాష్ట్ర ప్రయాణాలు చేసేందుకు కోర్టు అనుమతించాలని భూషణ్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనికి అభ్యంతరం వ్యక్తంచేశారు. మరోవైపు వలసకూలీల అంతర్రాష్ట్ర ప్రయాణాలను నిలువరించే అంశంపై మరో న్యాయవాది పెట్టుకున్న ‘ఇంటర్వెన్షన్ అప్లికేషన్’ను కోర్టు పరిష్కరించింది. ఈ అంశంపై దృష్టి సారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సుప్రీం కోర్టు సమన్వయ సంస్థ కాదని పేర్కొంది.
ఇదీ చూడండి:ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ పిటిషన్ తిరస్కరణ