కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టుంగా అమలు అవుతోంది. హోటళ్లు, దుకాణాలు, తినుబండారాల షాపులు, అన్నీ మూతపడ్డాయి. ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయ్యారు. మొత్తం పరిసరాలన్నీ బోసిపోయాయి. కానీ.. అక్కడ మాత్రం కోలాహలంగా ఉంది. అందరూ రకరకాల పనుల్లో నిమగ్నమై సందడి వాతావరణం నెలకొంది. ఒకరు కూరగాయలు తరుగుతుంటే.. మరొకరు పెద్ద పాత్రలో అన్నం వండుతున్నారు. మరొకరు స్వీట్లు చేసేస్తున్నారు. ఆ పక్కనే ఓ పెద్దావిడ కుర్చీలో కూర్చొని పూరీలు చేస్తోంది. కాసేపటికి వండిన వంటల్ని డబ్బాల్లో సర్దుతున్నారు. దేశం మొత్తం అన్నీ రకాల కార్యకలాపాలు మూతపడగా వీరేంటి ఇలా వేడుక నిర్వహిస్తున్నారు అని అనుకుంటున్నారా!
అవునుండీ మీరు చదివింది నిజమే! రకరకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారక్కడ. కానీ అవేవి ఏ వేడుకకో తరలిస్తున్నవి కావు. లాక్డౌన్ వేళ.. అన్నార్తుల కోసం ఓ బామ్మ పడుతున్న ఆరాటం. వారణాసికి చెందిన విమలా దివన్ 82 ఏళ్ల వృద్ధురాలు. అధ్యాపకురాలిగా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారామె. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్న ఈ బామ్మ ఈ వయసులోనూ ఎంతో మంది కడుపు నింపేందుకు నేను సైతం అంటూ ముందుకొచ్చింది.
కూలీల పాలిట అన్నపూర్ణ