ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ! కష్టాలకోర్చి కిరాణా దుకాణంలోకి వెళ్లిన ఆ దొంగకు నిరాశే మిగిలింది. ఆశపడి వస్తే షాపు యజమాని రూపాయి మిగల్చకుండా పట్టుకెళ్లి పోయాడని కలత చెందాడు. ఎంతో కష్టపడి ప్లాన్ చేసిన దొంగతనం విఫలం చెంది... నీకు ఇది న్యాయమా అంటూ ఆక్రోశించాడు. ఇదే నీకు తగిన శిక్ష అంటూ దుకాణంలో విధ్వంసం సృష్టించి, షాపు యజమానికి ఉత్తరం రాశాడు.
తమిళనాడు కడలూరు జిల్లా నైవేలీలో జరిగింది ఈ సంఘటన. షాపు యజమాని జయరాజ్ రోజువారీగానే దుకాణం కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే షాపు తెరచి చూసి షాక్ అయ్యాడు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిర్ఘాంతపోయిన అతగాడు కాసేపటికి తేరుకుని దుకాణంలోకి దొంగలు పడ్డారని గ్రహించాడు. దొంగిలించిన వస్తువులను గుర్తించేందుకు పరిశీలిస్తున్న సమయంలో తన గల్లా పెట్టె దగ్గర బిల్లు కాగితంపై రాసిన ఓ ఉత్తరం దొరికింది.
దొంగ రాయునది ఏమనగా..
కౌంటర్ వద్ద దొరికిన ఆ కాగితాన్ని చదివాక దొంగే ఆ లేఖ రాశాడని జయరాజ్‌కు అర్థమైంది.
"నేను నా ప్రాణాలను పణంగా పెట్టి నీ షాపులో దొంగతనం చేయడానికి వచ్చాను. ఒక్క రూపాయి వదలకుండా గల్లా పెట్టె ఖాళీ చేసుకెళ్లడం నీకు న్యాయమేనా? కౌంటర్లో కొంతైనా డబ్బు వదలకుండా నువ్వు నన్ను మోసం చేశావు. అందుకే నీకు ఈ శిక్ష!"
- దొంగ రాసిన లేఖ
దొంగ లేఖతో ఖంగుతిన్న జయరాజ్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రేజీ దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
ఇదీ చూడండి:ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...