తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సింధు జలాల ఒప్పందం' గురించి తెలుసుకోవాల్సినవి - indus water treary news

భారత్​, పాకిస్థాన్​ సంబంధాల్లో సింధు నదీ జలాల ఒప్పందానికి చాలా ప్రాధాన్యం ఉంది. సరిగ్గా 60 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో భారత్​, పాక్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1960 సెప్టెంబర్​ 19న అప్పటి భారత ప్రధాని జవహార్​ లాల్​ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయ్యూబ్ ఖాన్​.. ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

Indus Waters Treaty
సింధు జలాల ఒప్పందం

By

Published : Sep 19, 2020, 6:43 AM IST

భారత్​, పాకిస్థాన్​ మధ్య​ సింధు నదీ జలాల ఒప్పందం జరిగి 60 ఏళ్లు పూర్తయింది. రెండు దేశాల నడుమ జరిగిన ఈ చారిత్రక ఒప్పందానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. 1960 సెప్టెంబర్​ 19న ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహార్ లాల్​ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్​ సంతకం చేశారు. దీనికి ప్రపంచ బ్యాంకు నేతృత్వం వహించింది.

అసలేంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం? రెండు దేశాల మధ్య సమస్యలు వస్తే ఎలా పరిష్కరిస్తారు? ఇరు దేశాల మధ్య నదుల విభజన ఎలా జరిగింది? ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో ఒప్పందంపై ప్రభావం పడితే ఎలా? ఈ విషయాలు మీకోసం..

ప్రపంచ బ్యాంకు చొరవతో..

సింధు నదీ జలాల వివాదానికి ఈ ఒప్పందంతో ముగింపు పలికాయి భారత్​, పాకిస్థాన్. పొరుగు దేశం అభ్యర్థన మేరకు తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో పంపకాలు జరిగాయి. ఈ చర్చలకు ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు యూజీన్ బ్లాక్ అధ్యక్షత వహించారు.

సింధు నదికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్​ ఉపనదులు. ఇందులో దిగువన ఉన్న జీలం, చినాబ్​, సింధు జలాలను పాకిస్థాన్​కు కేటాయించారు. ఎగువ నదులైన రావి, బియాస్, సట్లెజ్​ను భారత్ అధీనంలో ఉంచారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులను మినహాయిస్తే.. ఎగువ నదులపై భారత్​ ఎలాంటి నిల్వ లేదా నీటిపారుదల వ్యవస్థలను నిర్మించేందుకు వీలులేదని ఈ ఒప్పందం చెబుతుంది.

కమిషన్​ ఏర్పాటు..

రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు 'సింధు శాశ్వత కమిషన్​'ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాలను ఈ కమిషన్​ రూపొందిస్తుంది. ఇరు దేశాల కమిషనర్లు ఏటా రెండు సార్లు భేటీ అవుతారు. నదులపై కొనసాగుతున్న ప్రాజెక్టులను పర్యటించి తనిఖీ నిర్వహిస్తారు.

ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు పాత్ర పరిమితంగా ఉంటుంది. విధానపరమైన బాధ్యతలనే నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఏవైనా విభేదాలు తలెత్తిన సమయంలో ఇరు వర్గాలు కోరినప్పుడే ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంటుంది.

భారత్​ లాభమెంత?

రవి, బియాస్, సట్లెజ్ నదుల్లో భారత్​ వాటా 3.3 కోట్ల ఎకరాల అడుగుల (ఎంఐఎఫ్)కు పెంచుతుంది. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే 95 శాతం నీటిని ఉపయోగించే అవకాశం ఉంది. మిగతా 5 శాతం పాకిస్థాన్​కు వదిలేస్తారు.

ఈ ఒప్పందం భారత్​పై కొన్ని ఆంక్షలను విధించింది. పాకిస్థాన్‌కు కేటాయించిన నదులపై ప్రాజెక్టులు నిర్మించడానికి అనుమతి లేదు. విద్యుత్​ ఉత్పత్తికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ నీటి పారుదల ప్రాజెక్టులపై పరిమితులు పెట్టారు. భారత విదేశాంగ శాఖ వాదన ప్రకారం.. ఎగువ నదుల నీటిని కాలువలు, గృహ, వ్యవసాయం, జల విద్యుత్​ ఉత్పత్తికి వినియోగించవచ్చు.

పాక్​కు జీవనాధారం..

సింధు, చీనాబ్, జీలం నదులు పాకిస్థాన్​కు జీవనాధారం. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే పాక్ పూర్తిగా ఆధారపడుతోంది. ఒకవేళ భారత్​ ఈ నదుల ప్రవాహాన్ని నిలిపేస్తే పాక్​కు ఇబ్బందులు తప్పవు. చీనాబ్​, జీలం నదులు భారత్​లో ఉద్భవించగా, చైనాలో పుట్టిన సింధు.. మన దేశం గుండా పాకిస్థాన్​లోకి ప్రవహిస్తుంది.

ఉరీ ఉగ్రదాడి తర్వాత..

2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత వాటర్ కమిషన్​ చర్చలను భారత్ రద్దు చేసింది. నిరుపయోగ జలాలను వినియోగం కోసం ఎగువ నదులపై జలవిద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్​లోని ఉజ్, షాపుర్​-కాందీ, పంజాబ్​లోని సట్లెజ్​-బియాస్​ నదుల అనుసంధానం ఇందులో కీలకమైనవి.

విభేదాలు..

జీలం, చీనాబ్​ నదులపై భారత్ నిర్మిస్తున్న కిషన్​గంగా (330 మెగావాట్లు), రాటిల్ (850 మెగావాట్ల) జలవిద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పాక్​ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల డిజైన్​ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

1984:జీలం నదిపై తుల్​బుల్​, ఉల్లూర్​ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ 1984లో ప్రతిపాదన చేసింది. దేశంలో అతిపెద్ద మంచి నీటి సరస్సు ఉల్లూర్​ ముఖద్వారంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది సింధునదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని పాక్ ఆరోపిస్తోంది. నది ప్రవాహాన్ని నియంత్రించేందుకే ఈ ప్రాజెక్టులు చేపడుతోందని వాదిస్తోంది. ఇవి నది ప్రవాహ మార్గాన్ని మార్చేందుకు మాత్రమేనని భారత్ చెబుతోంది.

2006: ఈ రెండు ప్రాజెక్టులపై భారత్, పాక్ చర్చలు 2006లో జరిపాయి. ఉల్లూర్ సహజమైన నీటి వనరు అని భారత్ స్పష్టం చేసింది. తుల్​బుల్​లో ఎలాంటి నిల్వ సామర్థ్యం లేదని తెలిపింది.

2020:సింధు జలాల సమస్యలపై అట్టారీ సరిహద్దులో సమావేశం నిర్వహించాలని 2020 మార్చిలో పాక్ ప్రతిపాదించింది. దృశ్యమాధ్యమం ద్వారా భేటీ నిర్వహించాలని భారత్ సూచించగా.. భౌతిక సమావేశాన్నే ఏర్పాటు చేయాలని పాక్ పట్టుబట్టింది. పాక్ చేసిన ప్రతిపాదనను 2020 ఆగస్టులో భారత్ తిరస్కరించింది.

రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టు డిజైన్​ అంగీకారానికి మధ్యవర్తిత్వానికి పాక్ అనుకూలత వ్యక్తం చేసింది. అయితే, తటస్థ పార్టీని నియమించాలని భారత్​ సూచించింది.

ఇదీ చూడండి:'అటల్​ టన్నెల్'​ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ABOUT THE AUTHOR

...view details