ఫలానా కాలనీలో ఎవరికో కరోనా సోకిందట. ఈ మాట వింటుంటే ఊరంతా అలజడి. ఆ పక్కకు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు మాత్రం అదేపనిగా అక్కడికి వెళ్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కరోనా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు. వైరస్‌ను కట్టడి చేయడమే ధ్యేయంగా సర్వే నిర్వహిస్తున్నారు.
కరోనా బాధితులను రక్షించే పనిలో వైద్యులున్నారు. లాక్‌డౌన్ పక్కాగా అమలును పోలీసులు బాధ్యతగా తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు.. బాధితులను పక్కాగా గుర్తించే క్రతువులో ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు భాగమవుతున్నారు. బృందాలుగా విడిపోయి.. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమవుతున్నారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో వీధి వీధి కలియ తిరుగుతున్నారు. వీరిని స్వాగతించే మాట అటుంచితే.. ఎందుకొచ్చారంటూ వింతగా చూస్తున్న వాళ్లు ఎదురవుతున్నారు.
‘మీకు వివరాలు చెప్పాల్సిన పనిలేద’ని ముఖం మీదే తలుపులేసిన ఉదంతాలూ ఉన్నాయి. ‘మీ వల్లే వైరస్ సోకేలా ఉంద’ని శాపనార్థాలు పెట్టిన సందర్భాలూ ఎదురవుతున్నాయి. అయినా, వృత్తి ధర్మం, దేశాన్ని ఆదుకోవాలనే తపనతో అన్నిటినీ భరిస్తున్నారు. తమకు అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తూ ఔరా! అనిపించుకుంటున్నారు. మమ్మల్ని అర్థం చేసుకోండని కోరుతున్నారు.
ఆగే ప్రసక్తే లేదు
‘‘మేం సంగారెడ్డి పట్టణంలో ఉంటాం. ఇక్కడ పాజిటివ్ కేసు నమోదయిన ప్రాంతంలో రోజూ 100 ఇళ్లు తిరగాలి. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంటే మా కాలనీలో వాళ్లు దూరంగా ఉండమని చెబుతున్నారు. మేం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో మిగతావాళ్లు నన్నో దోషిలా చూస్తున్నారు. ‘అనవసరంగా డ్యూటీకి వెళ్తున్నావు. నీ వల్ల మా అందరికీ ఇబ్బందొచ్చేలా ఉంద’ని ముఖం మీదే అనేస్తున్నారు. అపార్ట్‌మెంట్ కిందే కాళ్లు, చేతులు కడుక్కొని, చెప్పులు చేతుల్లో పట్టుకొని.. మెట్లెక్కి పైకి వెళ్తున్నా. మీ ఇంటి ఛాయల్లోకి రానని వారందరికీ చెప్పా. ఇలాంటివి ఎన్ని ఎదురైనా.. ఈ ఆపత్కాలంలో దేశానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నా. కరోనా రక్కసిని కట్టడి చేసే వరకూ విధుల్లో నుంచి తప్పుకొనే ప్రసక్తే లేదు.’’
- దుర్గా రాణి, ఏఎన్‌ఎమ్, సంగారెడ్డి