బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆ కూటమికి విజయం వరించినా.. నితీశ్ రెండేళ్లకే ఎన్డీయే పంచన చేరడం వల్ల ప్రతిపక్షానికి చేరింది. తాజా ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ.. ఫలితాలొచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఫలితంగా కూటమికి నేతృత్వం వహిస్తున్న ఆర్జేడీకి మళ్లీ నిరాశ ఎదురైంది. చిన్న వయసులోనే సీఎం పీఠం అధిరోహించాలన్న తేజస్వి కల చెదిరింది.
'జంగిల్‌రాజ్' మరక
బిహార్‌లోని లాలూ-రబ్రీదేవి పాలనను జంగిల్ రాజ్‌గా పిలుస్తుంటారు. కిడ్నాప్‌లు, యువతుల అపహరణ పెద్ద ఎత్తున జరగడంతో వారి పాలనా కాలానికి ఆ ముద్ర పడిపోయింది. ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ జంగిల్ రాజ్ ఎక్కడొస్తోందనని ప్రజలు భయపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ కూడా తేజస్విని ‘జంగిల్ రాజ్‌కు యువరాజ్’ అని సంబోధించారు. ఈ పరిస్థితుల్లో గతంలో పోలిస్తే ఆ పార్టీకి (80) సీట్లు పెరగకపోగా.. స్వల్పంగా తగ్గడం గమనార్హం.
కాంగ్రెస్ పట్ల ఉదారత
ఒకప్పుడు బిహార్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 27 స్థానాలు సాధించినప్పటికీ ఈ సారి ఎన్నికల పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి ఆర్జేడీ 70 స్థానాలు కేటాయించింది. 144 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది. ఫలితాలొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకే పరిమితమైంది. గతం కంటే 7 స్థానాలు కోల్పోయి కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది.