భారత స్వాతంత్ర్య వేడుకలు ఈసారి భిన్న వాతావరణంలో జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పరిమిత సంఖ్య అతిథులు హాజరవుతున్నారు. శుభ్రత, భౌతిక దూరానికి ప్రాధాన్యమిస్తూ రక్షణ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓ వైపు కరోనా విజృంభణ, మరోవైపు సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మోదీ ప్రసంగంపైనే అందరి దృష్టి..
ప్రధాని నరేంద్రమోదీ వరుసగా ఏడోసారి ఎర్రకోటపై జెండావిష్కరణ చేస్తున్నారు. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రతిసారి ప్రభుత్వం తీసుకునే సంచలన నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చారు మోదీ. ప్రస్తుత ప్రసంగంలో గతేడాది ప్రభుత్వ విజయాలు, ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు తీసుకునే నిర్ణయాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
మోదీ ప్రసంగంలో ప్రధానంగా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. అదేవిధంగా మోదీ 2.0 ప్రభుత్వంలో తీసుకొచ్చిన విస్తృతమైన ఆర్థిక సంస్కరణ గురించి ప్రసంగించే అవకాశం ఉంది.
వ్యాక్సిన్‌పై ప్రకటన!
భారత్ బయోటెక్ తయారు చేసిన 'కొవాగ్జిన్' టీకాను ఆగస్టు 15న విడుదల చేయాలని ఐసీఎంఆర్ గతంలో భావించింది. దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ వ్యాక్సిన్‌పై మోదీ కీలక ప్రకటిస్తారని అందరూ ఆశిస్తున్నారు.
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు తెరలేపింది మోదీ ప్రభుత్వం. ఆయుధాలు, రక్షణ పరికరాల ఉత్పత్తికి స్వదేశీ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకు సంబంధించి మోదీ ప్రసంగంలో మరిన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి చర్యలపైనా మోదీ ప్రస్తావిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
స్వయం సమృద్ధి..
'ఆత్మ నిర్భర్ భారత్' సాధన ప్రణాళికను ఎర్రకోట వేదికగా ఆవిష్కరిస్తారని ఇప్పటికే వెల్లడించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ మేరకు ఆత్మనిర్భర్ భారత్ సహా ఆరోగ్య భారత్ లక్ష్యంగా మోదీ కీలక ప్రకటన ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.