చంద్రయాన్-2 ప్రయోగంలో ఇబ్బంది తలెత్తిందని నిరాశ చెందొద్దని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు ప్రధాని నరేంద్రమోదీ. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరింత పురోగతి సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి బెంగళూరు కేంద్రంలో ప్రసంగించారు మోదీ. మరో నవోదయం ఖాయమంటూ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
"శాస్త్రవేత్తలూ... మీరు భరతమాత విజయం కోసం పోరాడేవారు. మీ కలలను జాతికి అంకితం చేస్తారు. భరతమాత తల ఎత్తుకునేందుకు పూర్తి జీవితాన్ని అంకితం చేస్తారు. గత కొన్ని రోజులుగా మీరు నిద్ర పోలేదు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతివ్యక్తి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. భావోద్వేగాలతో సవాలు చేశారు. చివరి అంకం వరకు చేరుకున్నారు. కానీ అకస్మాత్తుగా సంకేతాలు నిలిచిపోయాక మీరు విస్మయం చెందారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీ మనస్సులు ప్రశ్నలు వేసుకోవడం సహజమే. అయినప్పటికీ ఏదో ఒకటి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాని వెనుక మీ పరిశ్రమ ఉంది.
జాబిల్లిని చేరాలన్న మన సంకల్పం మరింత బలపడింది. చివరి అంకాన్ని యావద్భారతం ఎంతో ఆసక్తిగా చూసింది. చంద్రయాన్ విజయవంతం కావాలని మనందరం కోరుకున్నాం. మనం ఈ ప్రయోగంలో చాలా దగ్గరకు చేరుకున్నాం. కానీ రాబోయే ప్రయోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి."