దిల్లీ ఓటింగ్ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం? దిల్లీ ఎన్నికల తుది ఓటింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి అనధికారిక జాప్యం జరగలేదని స్పష్టం చేశారు హస్తిన ప్రధాన ఎన్నికల అధికారి రణ్బీర్ సింగ్. ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్లీ ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించారు.
ఓటింగ్ శాతం ప్రకటనపై ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపణలను ఖండించారు. సమాచారం పరిశీలనలో రిటర్నింగ్ అధికారులు నిమిగ్నమయ్యారని.. ఓటింగ్ శాతం ప్రకటించటంలో ఎలాంటి అనధికారిక జాప్యం జరగలేదని స్పష్టం చేశారు.
" పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగిన క్రమంలో రిటర్నింగ్ అధికారులు రాత్రంతా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గం వారిగా పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసిన అనంతరం పరిశీలన పూర్తయింది. డేటాను నిక్షిప్తం చేసే క్రమంలో కచ్చితత్వం చాలా ముఖ్యం కావున ఎక్కువ సమయం పట్టింది. "
- రణ్బీర్ సింగ్, దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి.
బాబర్పుర్ నియోజకవర్గంలో ఓ అధికారి ఎన్నికల కేంద్రానికి ఈవీఎంను చేతిలో పట్టుకుని తీసుకువెళ్లడంపై సమాధానమిచ్చారు సింగ్. పోలింగ్ కేంద్రం కొంచెం దూరంగా ఉండటం వల్ల అక్కడి వరకు చేతిలో పట్టుకుని తీసుకెళ్లారని తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు.
ఆప్ విమర్శలు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 8వ తేదీన జరిగాయి. అయితే వెంటనే తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించకపోవటంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సిగ్ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. బ్యాలెట్ వ్యవస్థ ఉన్నప్పటి మాదిరిగా ఈసీలో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. ట్విట్టర్ వేదికగా ఈసీపై విమర్శలు గుప్పించారు. ఓటింగ్ పూర్తయి గంటలు గడిచినా తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించకపోవటం ఆశ్చర్యానికి గురి చేసిందని.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.