కేంద్ర మంత్రివర్గాన్ని పరిమితంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అవసరాలు, కొందరు మంత్రుల పనిభారాన్ని తగ్గించాల్సి ఉండడం వంటివి దీనికి దారి తీస్తున్నాయి. వచ్చే సంవత్సరం బిహార్, ఝార్ఖండ్, దిల్లీ శాసనసభలకు ఎన్నికలున్నాయి. రాజకీయ అవసరాల దృష్ట్యా అక్కడి ప్రజాప్రతినిధులకు కేబినెట్‌లో స్థానం కల్పిస్తూ చిన్నపాటి విస్తరణ చేయవచ్చని చెబుతున్నారు. బిహార్‌లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూకి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో భాజపా అధినాయకత్వం ఉంది.
నృపేంద్ర మిశ్రకు గవర్నర్‌గా అవకాశం
జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ నెల 31 నుంచి మార్చనున్నారు. ఆ రోజు నుంచే లద్దాఖ్‌కు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దిల్లీకీ కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదో ఒక దానికి ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రను నియమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు సత్యపాల్‌మాలిక్‌ను యథావిధిగా కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. లద్దాఖ్ వాసులతో సంతోషాన్ని పంచుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 31న అక్కడికి వెళ్లాలని యోచిస్తున్నారు. అదేరోజు ‘ఏక్‌భారత్ శ్రేష్ఠ్ భారత్’ పేరుతో పటేల్ విగ్రహం వద్ద భారీ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటేల్ స్ఫూర్తితో జమ్మూ-కశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగం చేసిన అంశాన్ని చాటడానికి వీలుగా ప్రధాని అదేరోజు లద్దాఖ్‌లో పర్యటించాలని భావిస్తున్నారు.