ఉరుకులు పరుగుల మానవాళి జీవన చక్ర భ్రమణానికి కరోనా మహమ్మారి ఒక్కసారిగా బ్రేకువేసింది. వందేళ్ల క్రితం నాటి స్పానిష్ ఫ్లూ తరహాలో విజృంభిస్తూ ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా అభాగ్యులకు సోకి 65వేలమందిని కబళించిన కొవిడ్- భారత్‌లో 211 జిల్లాలకు విస్తరించింది. కొవిడ్ సృష్టించగల మానవ మహా విషాదం తాలూకు భయంతో ఇండియా సహా పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించి కరోనా వ్యాప్తి నిరోధానికి తాపత్రయపడుతున్నాయి. జీవనోపాధి కంటే జీవితాలే ప్రధానమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పంథాలో సాగుతూ దేశార్థిక వ్యవస్థల్ని స్తంభింపజేశాయి. భారత్‌లాంటి దిగువ మధ్యాదాయ దేశాల్లో రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులదే మెజారిటీ. మూడు వారాల లాక్‌డౌన్ కారణంగా వస్తూత్పాదనలు, నిత్య జీవితావసరాల నిరంతర సరఫరా గొలుసు దెబ్బతినడంతో- భారతీయ సమాజంలో భిన్న వర్గాలవారు ఎదుర్కొంటున్న వేదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దాదాపు 54 కోట్ల పశు సంతతితో పరిపుష్టమైన ఇండియాలో వాటి మేతకు, పాల విక్రయాలకూ ఎదురవుతున్న ప్రతిబంధకాలు- వాటిపై ఆధారపడిన 23శాతం చిన్న రైతుల జీవితాల్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. రోజూ 18 కోట్ల 80 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగ స్థానాలకు వాటి సరఫరా సాధ్యంకాని పరిస్థితి- దేశార్థికాన్నీ ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తోంది.
కోళ్లు, మత్స్య పరిశ్రమలదీ అదే పరిస్థితి! పాలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, వంట నూనెలు, మందులు, వినియోగ వస్తువుల వంటి వాటికి కొద్ది రోజుల్లోనే కరవొచ్చే పరిస్థితి ఉందని దేశ రాజధాని దిల్లీ టోకు వర్తకుల సంఘం ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. నిత్యావసరాల సరఫరాకు ఎలాంటి ఆంక్షలూ లేవని కేంద్రమే ప్రకటించింది. అయినా కూలీల కొరత, పరిమిత సంఖ్యలో రవాణా వాహనాలు ఒక ప్రతిబంధకమైతే, కర్ఫ్యూ పాసుల జారీలో జాప్యం మరో అవాంతరమై కిరాణా కొట్లలో సరకు నిండుకొనే పరిస్థితి దాపురిస్తోందని వర్తకుల సంఘం స్పష్టీకరించింది. చూడబోతే, దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామ సీమలన్నింటి సమస్య అది. దాని సత్వర పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి!
ఆ రెండు రంగాలపై ప్రభావం...
ఇండియాలో రూ.15 లక్షల కోట్ల విలువైన రవాణా, లాజిస్టిక్స్ రంగం దేశార్థికానికి గుండెకాయలాంటిది. చిన్నాపెద్దా 53 లక్షల ట్రక్కులు, 7,400 గూడ్సు రైళ్లు, కార్గో విమానాలు అనునిత్యం వస్తూత్పాదనల రవాణా మహాయజ్ఞంలో చురుకుగా కదులుతుంటాయి. రోడ్డు రవాణాలో 60శాతం దాకా ఉత్పాదక రంగం వాటా కాగా, 10-15శాతం మౌలిక సదుపాయాలు, ఎగుమతి సంబంధమైనవి. గతనెల 24న లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ రెండు రంగాలూ పూర్తిగా మూతపడటంతో- ట్రక్కులు ఎక్కడివి అక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. నిత్యావసరాలతోపాటు సాధారణ వస్తూత్పాదనల రవాణాకూ కేంద్రం పచ్చజెండా ఊపినా, ఆ కీలక రంగంలో అలముకొన్న స్తబ్ధత చెదరనే లేదు. కర్మాగారాలు, గిడ్డంగులు మూతపడి, ముడిసరకులు తుది ఉత్పాదనల రవాణా కొరవడి ట్రక్కులకు పనిలేకపోవడం, కరోనా భయంతో డ్రైవర్లూ ముందుకు రాకపోవడంతో సరఫరా గొలుసు తెగిపోయింది.