తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో చేజారుతున్న జలసిరులు - importance of storing rain water

ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా దేశవ్యాప్తంగా భీకర వర్షాలు కురిశాయి. కుండపోత వానలు సాధారణ జనజీవనాన్ని, రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేశాయి. ఎన్నోచోట్ల రహదారులు నిండు చెరువుల్ని తలపించాయి. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో రికార్డు స్థాయిలో వానలు కురిశాయి. మరి ఇంతటి జలసిరులను మన ప్రభుత్వాలు ఒడిసిపట్టగలిగాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది..!

దేశంలో చేజారుతున్న జలసిరులు

By

Published : Oct 5, 2019, 2:53 PM IST

Updated : Oct 5, 2019, 5:01 PM IST

జలగండమేదో దాపురించినట్లు, వందలాది ఏనుగులు తొండాలతో దిమ్మరించినట్లు వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భీకర వర్షాలు సాధారణ జనజీవనాన్ని, రవాణా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎన్నోచోట్ల రహదార్లు నిండు చెరువుల్ని తలపిస్తూ, భారీ వృక్షాలు నేలకూలి... ప్రకృతి విధ్వంసం కళ్లకు కడుతోంది. యూపీలో కుండపోత వానల ధాటికి వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోనూ ప్రాణనష్టం నమోదైంది. అటు మధ్యప్రదేశ్‌లో, ఇటు హైదరాబాదులో సుమారు వందేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో వానలు కురిశాయి.

ముంబయి నగరంలో ఆరు దశాబ్దాల రికార్డు బద్దలయింది. పాతికేళ్లుగా కనీవినీ ఎరుగనంత వర్షపాతం దేశరాజధాని దిల్లీని ముంచెత్తింది. ఇప్పటికీ బిహార్‌ రాజధాని పట్నాతోపాటు మరో డజను జిల్లాలు జలఖడ్గ ప్రహారాలకు గడగడలాడుతుండగా- ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక వంటివి ఆగని వర్షధారలో తడిసి ముద్దవుతున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అని జనం నివ్వెరపోయేంతగా ఇళ్లను రోడ్లను మౌలిక వ్యవస్థల్ని ముంచేస్తున్న ఇంతటి వర్షరాశి కడకు ఏమైపోతోంది? ప్రపంచంలోనే అత్యల్పంగా కేవలం ఎనిమిది శాతం వాననీటినే ఒడిసిపట్టగలుగుతున్న దేశం మనది.

అపార జలాల్ని చేజార్చుకుంటున్న పర్యవసానంగా, ఎకాయెకి 60 కోట్ల జనావళి తీవ్ర నీటి ఎద్దడికి గురవుతోంది. అయినా సత్వర దిద్దుబాటు చర్యలు చురుగ్గా పట్టాలకు ఎక్కడంలేదు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోగడ వ్యాఖ్యానించినట్లు- ‘దేశంలో నీటికి కొరతలేదు... ఆ అమూల్య వనరును సద్వినియోగపరచుకోవడంలో లోటుపాట్లవల్లే తీరని అవస్థలు చుట్టుముడుతున్నాయి’!

నాలుగు నెలల క్రితం చెన్నై మహానగరం దుర్భర నీటి కటకటతో అలమటిస్తుండగా- ముంబయి, నాసిక్‌లను కుంభవృష్టి అతలాకుతలం చేసింది. అటువంటి దృశ్యాలు తరచూ పునరావృతమవుతున్నాయి. దేశంలో ఏటా కొన్ని ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతుండగా, ఇంకొన్నిచోట్ల ఆనవాయితీగా కరవు కాటకాలు తాండవిస్తున్నాయి. రకరకాల వాతావరణ జోన్లు కలిగిన భారత్‌లో 68 శాతం సేద్యయోగ్య భూమికి కరవు ముప్పు, అయిదు కోట్ల హెక్టార్ల విస్తీర్ణానికి వరద ముంపు ప్రమాదం పక్కలో బల్లెంలా నిరంతరం పొంచి ఉంటున్నాయి.

ఈ చక్రభ్రమణాన్ని ఛేదించడం ఎలాగన్నదానిపై ప్రభుత్వాలు లోతుగా దృష్టి సారించాల్సి ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో ఏడాదికి సగటున తలసరి నీటిలభ్యత 5,177 ఘనపు మీటర్లు. 2011లో 1,545 ఘ.మీ.కు కుంగిన ఆ పరిమాణం, 2021నాటికి 1,341 ఘ.మీ.కు పడిపోనుందన్నది కేంద్ర జల మంత్రిత్వశాఖ అంచనా.

గొంతెండిన చెన్నై ఒక్కటే కాదు- దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ సహా దేశంలోని 21 ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాదికి భూగర్భ జలమట్టాలు పూర్తిగా అడుగంటనున్నాయన్న భవిష్యద్దర్శనం- వేగంగా కమ్ముకొస్తున్న జలసంక్షోభానికి ప్రబల సూచిక. పల్లెల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రుతుపవనాలు గాడితప్పి సకాలంలో వర్షాలు కురవక, స్వల్ప వ్యవధిలో వర్ష బీభత్సం జోరెత్తి, పడిన వానలు అక్కరకు రాక సేద్యానికి భూగర్భ జలాలే దిక్కవుతున్నాయి.

వేగంగా హరాయించుకుపోతున్న భూగర్భ జలాల్ని తిరిగి భర్తీ చేసేందుకు- నీటి వృథాను అరికట్టి, వర్షరాశిని ఒడుపుగా పదిలపరచడమే ఉత్తమ మార్గం. దేశంలో ఏటా కురిసే సుమారు నాలుగు వేల ఘనపు కిలోమీటర్ల వాన నీటిలో సాధ్యమైనంత భద్రపరచగలిగితే- భిన్నసమస్యలకు పరిష్కారాలు లభించి జాతికి జలభాగ్యం ఒనగూడుతుంది.

శతాబ్దాలుగా వాయవ్య చైనాలో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వర్ష జలసంరక్షణ విధానానికి రమారమి పాతికేళ్ల క్రితం గన్సూ ప్రావిన్స్‌లో ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యంతో కొత్త ఒరవడి దిద్దారు. క్రమేణా తక్కిన ప్రాంతాలకూ విస్తరించిన వాననీటి పొదుపు అక్కడ ఇతోధిక పంట దిగుబడుల విప్లవానికి ఊపిరులూదింది. భూగర్భ జలమట్టాలు క్షీణించకుండా చూసుకుంటూ, వినియోగంలో పొదుపు పాటించి వృథాను నివారించడం- ఆస్ట్రేలియా, యూకే, దక్షిణాఫ్రికా తదితరాల్లో ‘జాతీయ అజెండాగా అమలుకు నోచుకుంటోంది.

తెలంగాణలో నమోదయ్యే సగటు వర్షపాతం (720 మి.మీ.)కన్నా తక్కువ వాననీటితోనే ప్రజావసరాలన్నీ తీరుస్తున్న ఆస్ట్రేలియా- పకడ్బందీ ప్రణాళిక రచనకు తనదైన భాష్యం చెబుతోంది. భవనాల ఉపరితలాలపై కురిసిన వర్ష జలాల సంరక్షణలో జర్మనీ కొత్తపుంతలు తొక్కుతుండగా, ఆకాశం నుంచి పడే ప్రతి నీటిబొట్టు నుంచీ గరిష్ఠ ప్రయోజనం పొందేలా సింగపూర్‌ నాలుగంచెల జలశుద్ధి, సరఫరా వ్యవస్థల్ని తీర్చిదిద్దింది. సింగపూర్‌ విస్తీర్ణం 721 చదరపు కిలోమీటర్లతో పోలిస్తే, 32 లక్షల చ.కి.మీ.కు పైగా భౌగోళిక వైశాల్యం కలిగిన ఇండియా మరిన్ని అద్భుతాల్ని ఆవిష్కరించగల వీలుంది.

దేశంలోని 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో భూగర్భ జలాల్ని సంరక్షించేందుకంటూ కేంద్రం ఇటీవల ‘జల్‌ శక్తి అభియాన్‌’ ప్రకటించి స్థానిక సంస్థలకు మార్గదర్శకాల్ని క్రోడీకరించింది. ముఖ్యమంత్రి జల్‌స్వాభిమాన్‌ అభియాన్‌ (రాజస్థాన్‌), జల్‌యుక్త్‌ శివార్‌ అభియాన్‌ (మహారాష్ట్ర), నీరు-చెట్టు (ఏపీ), మిషన్‌ కాకతీయ (తెలంగాణ), సుజలాం సుఫలాం యోజన (గుజరాత్‌)ల పేరిట వ్యక్తమవుతున్న జలచేతన ‘జాతీయ సంస్కృతి’గా స్థిరపడాలి.

దేశంలో తాగు, సాగునీటి అవసరాల్ని సమర్థంగా తీర్చేలా, జలనాణ్యతను పెంపొందించేలా వ్యవస్థల్ని బలోపేతం చేసే దార్శనికతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగేసినప్పుడే- జాతికి నీటిగండాల ముప్పు తప్పి జలసిరుల సౌభాగ్యం సాక్షాత్కరించగలిగేది!

ఇదీ చూడండి:నవరాత్రి స్పెషల్​: సూరత్​లో మోదీ డాన్స్​

Last Updated : Oct 5, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details