ఆస్ట్రేలియాలోని హట్ నదికి ఉత్తరాన ఉన్న 'హట్ లాగూన్' గురించి ఎప్పుడైనా విన్నారా?. దాన్ని పింక్ సరస్సు అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ నీరు గులాబీ రంగులో ఉంటుంది. ప్రస్తుతం అదే మాదిరిగా మహారాష్ట్ర బుల్దానాలో ఉన్న లోనార్ సరస్సులో నీళ్లు కనువిందు చేస్తున్నాయి.
పచ్చటి రంగులో కనిపించే ఈ ఉప్పునీటి సరస్సు గులాబీ రంగులోకి మారడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అటవీ శాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు నీటి నమూనాలు తీసుకొని విశ్లేషించే పనిలో ఉన్నారు. మూడు రోజుల నుంచే ఈ పరిణామం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
నీటిలో ఉండే కెరోటినాయిడ్స్ విడుదల చేసే 'సెలీనా' అనే మూలకాలు, హలో బ్యాక్టీరియా వల్ల రంగు మారి ఉంటుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల వచ్చిన నిసర్గ తుపాను ప్రభావం ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.