ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో నేడు తీర్పు వెలువరించనుంది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఉన్నావ్ బాధితురాలి తండ్రి హత్య కేసులో నేడే తీర్పు - The verdict on the murder of the father of the victim
దేశంలో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించిన మరో కేసులో నేడు తీర్పు వెలువరించనుంది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. బాధితురాలి తండ్రి హత్య కేసుపై నేడు తీర్పు ఇవ్వనుంది.

ఇప్పటికే ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న సెంగార్.. బాధితురాలి తండ్రి హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో పోలీస్ కస్టడిలో బాధితురాలి తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయన మృతి వెనుక సెంగార్ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. 55 మంది సాక్షులను కోర్టు ఎదుట హాజరుపరిచింది. అత్యాచార బాధితురాలి మామ, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేసి న్యాయస్థానానికి సమర్పించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.