కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ... దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ విమాన సర్వీసులు?
కరోనా సంక్షోభం, లాక్డౌన్ల వల్ల మార్చి 25 నుంచి దేశంలో విమాన సర్వీసులు నిలిపివేశారు. అయితే ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా.. దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంకా నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే త్వరలో వాటిని కూడా అనుమతించే అవకాశమున్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు
- విమానాలు లేదా నౌకల ద్వారా దేశానికి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
- 7 రోజులు తమ సొంత ఖర్చుతో క్వారంటైన్‌లో ఉండాలి. తరువాత ఇంట్లో 7 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
- కొన్ని ప్రత్యేక కారణాలతో చేరుకున్న వారు తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
- ఆరోగ్య సేతు యాప్‌ను తప్పక డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు ఇవ్వాలి.
- టికెట్లు మంజూరు చేసే ఏజెన్సీలు ప్రయాణికులకు టికెట్‌తో పాటు చేయదగినవి, చేయకూడని పనుల జాబితా ముద్రించి ఇవ్వాలి.
- విమానం లేదా ఓడల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ తర్వాత.. రోగ లక్షణాలు లేని ప్రయాణికులకు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది.
- రోడ్డు మార్గాన దేశంలోకి ప్రవేశించే ప్రయాణికులు అన్ని నిబంధనలు అనుసరించాల్సిందే. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే సరిహద్దు ద్వారా భారత దేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తారు.
- విమానంలో, ఓడలో వచ్చే వారు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం నింపాలి. దాని ప్రతిని విమానాశ్రయం, ఓడరేవుల్లో ఉన్న ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.
- విమానంలో, ఓడలో ఉన్నప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
- దేశానికి చేరుకున్న తర్వాత కూడా.. విమానాశ్రయం, ఓడరేవులు, ఇన్‌యార్డ్ పోర్ట్‌ల వద్ద ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తప్పకుండా చేయాలి.
- స్క్రీనింగ్ సమయంలో రోగలక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే వేరుచేసి ఆసుపత్రికి తరలించాలి.
- మిగిలిన ప్రయాణికులను స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత పాలనాధికారులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలి.
- విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా.. కనీసం 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.
- ఐసీఎంఆర్ ప్రోటోకాల్ ప్రకారం అందరికీ వైద్య పరీక్షలు చేయాలి.
- మిగిలిన 7 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. స్థానిక ప్రభుత్వాలు పర్యవేక్షణ చేయాలి.
- సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న కాలంలోనైనా, ఆ తరువాత అయినా.. ఏవైనా రోగ లక్షణాలు ఉంటే.. వారు జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్‌కు 1075 తెలియజేయాలి.
ఇదీ చూడండి:ప్రయాణాలు చేయాలా? ఈ రూల్స్ పాటించాల్సిందే...