తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే! - indian Railways news

భారతీయ రైల్వే ముఖచిత్రం కొన్నేళ్లుగా దిగులు పుట్టిస్తోంది. ఆరున్నర దశాబ్దాల్లో రైల్వే మౌలిక వసతుల్లో వృద్ధి కేవలం 30 శాతమే. తన వంతుగా కేంద్రం, గాడి తప్పిన రైల్వేను కుదుటపరచి సామర్థ్యం ఇనుమడింపజేసేందుకంటూ 2030 సంవత్సరం నాటికల్లా రూ.50లక్షల కోట్ల వ్యయీకరణపై ప్రణాళికలు అల్లుతోంది. అంత భూరి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చందం కారాదన్న ముందుచూపుతోనే  కావచ్చు... రైల్వే బోర్డు పునర్‌వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది.

Railway Board
బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!

By

Published : Dec 26, 2019, 6:38 AM IST

Updated : Dec 26, 2019, 7:29 AM IST

జాతి ప్రగతికి జీవనాడిగా భాసించాల్సిన భారతీయ రైల్వే ముఖచిత్రం కొన్నేళ్లుగా దిగులు పుట్టిస్తోంది. ఆరున్నర దశాబ్దాల్లో రైల్వే మౌలిక వసతుల్లో వృద్ధి కేవలం 30శాతమేనన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవలి విశ్లేషణ, విస్తరణలో మందగతికి అద్దం పట్టింది. వంద రూపాయలు ఆర్జించడానికి రైల్వేలు ఇంచుమించు అంతా ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహక నిష్పత్తి (ఓఆర్‌)ని మదింపు వేసిన కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక ఈ మధ్యే గట్టిగా తలంటేసింది.

పునర్​వ్యవస్థీకరణకు పచ్చజెండా

తన వంతుగా కేంద్రం, గాడి తప్పిన రైల్వేను కుదుటపరచి సామర్థ్యం ఇనుమడింపజేసేందుకంటూ 2030 సంవత్సరం నాటికల్లా రూ.50లక్షల కోట్ల వ్యయీకరణపై ప్రణాళికలు అల్లుతోంది. అంత భూరి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చందం కారాదన్న ముందుచూపుతోనే కావచ్చు, రైల్వే బోర్డు పునర్‌వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ నెల(డిసెంబరు) మొదటివారంలో దేశ రాజధాని వేదికగా ‘పరివర్తన్‌ సంగోష్ఠి’ పేరిట రెండు రోజులపాటు విస్తృత మేధామథనం అందుకు తగిన పూర్వరంగం ఏర్పరచింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన దరిమిలా, ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగిన ఎనిమిది రకాల అఖిల భారత సేవల స్థానాన్ని ఒకేఒక్క ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ క్యాడర్‌ భర్తీ చేయనుంది.

లెక్కకు మిక్కిలి డిపార్ట్‌మెంట్ల బాదరబందీ ఇక కనుమరుగై రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్‌), వైద్య సేవా విభాగం మాత్రమే మిగులుతాయి. అనేక క్యాడర్లు, విభాగాల మూలాన వాటి మధ్య సమన్వయం కొరవడి రైళ్ల నిర్వహణలో ఇబ్బందులెన్నో తలెత్తుతున్న దురవస్థను అధిగమించడానికే కేంద్రం ఈ మార్పులకు ఓటేసిందన్నది అధికారిక వివరణ. వాస్తవానికి ప్రకాశ్‌ టాండన్‌ కమిటీ(1994), రాకేశ్‌ మోహన్‌ కమిటీ(2001), శామ్‌ పిట్రోడా కమిటీ(2012), బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీ(2015) వంటివి నిర్ణాయక పరివర్తనను లక్షించి చేసిన సిఫార్సులు ఇన్నేళ్లూ మన్నన దక్కక దస్త్రాలకే పరిమితమయ్యాయి. కష్టనష్టాలే పట్టాలుగా సాగుతున్న రైల్వే ప్రస్థాన గతి రీతుల్ని సరికొత్త పునర్‌ వ్యవస్థీకరణ ఏ మేరకు ప్రక్షాళిస్తుందో చూడాలి.

సొంత పెత్తనాలకు చెల్లుకొట్టేందుకు..

రవాణా, సివిల్‌, మెకానికల్‌, ఎలెక్ట్రికల్‌, టెలికాం తదితర సేవా విభాగాలపై అజమాయిషీ చేస్తూ బోర్డులో అష్ట దిగ్గజాలు చక్రం తిప్పే వ్యవస్థ రైల్వేలో 1905నుంచీ కొనసాగుతూనే ఉందన్నది నమ్మశక్యం కాని నిజం. ఎవరి సామ్రాజ్యం వారిదిగా చలాయించుకునే విడ్డూర పోకడలు వేళ్లూనుకున్నాయనడానికి- ఎలెక్ట్రికల్‌, మెకానికల్‌ శ్రేణుల మధ్య సమశ్రుతి కుదరక ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ (ట్రెయిన్‌ 18) ప్రారంభం తీవ్ర జాప్యం కావడమే దృష్టాంతం. భారత రైల్వేలో మేర మీరిన సొంత పెత్తనాలకు చెల్లుకొట్టడమే ధ్యేయమంటూ బోర్డును సగానికి కుదించడం సాహసోపేతమైన నిర్ణయం. ఇక మీదట సీఈఓ (ప్రధాన కార్యనిర్వహణాధికారి)గా వ్యవహరించే బోర్డు ఛైర్మన్‌ కింద మానవ వనరుల విభాగాన్ని పర్యవేక్షించే డైరెక్టర్‌ జనరల్‌ నేరుగా పని చేయాల్సి ఉంటుంది.

విస్తరణ, మౌలిక వసతులు, రవాణా, ఆర్థిక వ్యవహారాల్ని నలుగురు బోర్డు సభ్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. కార్పొరేట్‌ సంస్థల తరహాలో భిన్నాంశాల్లో అనుభవం, ప్రావీణ్యం కలిగిన వ్యక్తుల్ని పరిమిత కాల సభ్యులుగా నియమించే యోచన; సీనియారిటీ కన్నా పనితనానికే పదోన్నతుల్లో గుర్తింపు దక్కుతుందన్న స్పష్టీకరణ- కేంద్రం గుణాత్మక మార్పును ఆశిస్తున్నదనడానికి ప్రబల సంకేతాలు. ఏడాది కాలంలో ఒక కొలిక్కి రానుందంటున్న ఈ యావత్తు కసరత్తు ఎనిమిది వేలకుపైగా గ్రూప్‌ ఏ సేవాధికారులపై ఏ మేరకు ప్రభావం కనబరుస్తుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. అనుకున్నవన్నీ యథాతథంగా కార్యాచరణకు నోచుకున్నట్లయితే- నిర్ణయాల్లో వేగం పెరుగుతుందని, ఎవరికి వారే యమునా తీరే సంస్కృతి రూపుమాసిపోతుందన్న అంచనాలు కొత్త ఆశల్ని మోసులెత్తిస్తున్నాయి.

అలసత్వానికి నిలువెత్తు ఆనవాళ్లు..

రాజకీయ చెరలో చిక్కి రైల్వేల ప్రాథమ్యాలు దారి తప్పి, వ్యవస్థ కార్యకుశలత కొల్లబోయి, రాయితీలు దుర్వినియోగమై, ప్రయాణ భద్రతా ఎండమావి అయిన దుస్థితి దేశ ప్రజలందరికీ తెలుసు. 1950-2016 సంవత్సరాల మధ్య ప్రయాణికుల సంఖ్యలో 1344 శాతం, సరకు రవాణాలో 1642 శాతం మేర వృద్ధి నమోదైనా నెట్‌వర్క్‌ విస్తృతి 25 శాతమైనా లేకుండాపోయిందన్న సందీప్‌ బందోపాధ్యాయ కమిటీ గణాంకాలు- దశాబ్దాల తరబడి పాలక శ్రేణుల్లో పేరుకుపోయిన దారుణ అలసత్వానికి నిలువెత్తు ఆనవాళ్లు. భారతావని అనుసంధానంలో రైల్వేల కీలకపాత్ర దృష్ట్యా పరివర్తన, ప్రక్షాళన, సంస్కరణలు అత్యావశ్యకమన్న మోదీ ప్రభుత్వం 2023నాటికి వాటి సంపూర్ణ విద్యుదీకరణ తథ్యమంటోంది. 2020 ఏప్రిల్‌ నుంచీ నూతన సంకేత (సిగ్నలింగ్‌)వ్యవస్థతో మార్పును కళ్లకు కడతామంటోంది!

అమెరికా, చైనా, రష్యాల తరవాత ఇండియాదే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. వేగంలో రికార్డులు బద్దలు కొడుతూ, సాంకేతిక ప్రజ్ఞతో అత్యధునాతన సదుపాయాలు అందిస్తూ అవి అబ్బురపరుస్తుండగా- ఇక్కడ వివిధ ప్రాజెక్టులు ఏళ్లూపూళ్లూ దేకుతున్న మందభాగ్యం జాతిని అప్రతిష్ఠపాలు చేస్తోంది. సౌకర్యవంతమైన డిజైన్లు, పటిష్ఠ కంట్రోల్‌ కమాండ్‌ వ్యవస్థల ఆవిష్కరణలో భారత్‌ ఇప్పటికీ చాలా వెనకబడి ఉంది. శాస్త్రీయ ప్రణాళిక, సమర్థ కార్యాచరణలనే జంట పట్టాలపై ప్రగతి శకటాన్ని ఉరకలెత్తిస్తామని మోదీ ప్రభుత్వం దేశపౌరులకు గతంలో మాటిచ్చింది. వృత్తిపర సామర్థ్యంతో భారతీయ రైల్వేను తేజరిల్లజేయడంలో ప్రభుత్వం కృతకృత్యమైతే దేశానికది మేలు మలుపవుతుంది. పారదర్శకత, జవాబుదారీతనాలకు చిరునామాగా రైల్వేల నిర్వహణ సుసాధ్యమయ్యే వాతావరణ పరికల్పనలో సరికొత్త పునర్‌వ్యవస్థీకరణ మైలురాయి కావాలి!

ఇదీ చూడండి: దశాబ్ది సవాల్​: భూగోళం మండే ఇంధనం మనకొద్దు

Last Updated : Dec 26, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details