తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ భారత అధికారులను తీవ్రంగా హింసించిన పాక్​! - పాక్​లో భారత హైకమిషన్

భారత్​ హైకమిషన్​ అధికారులను అరెస్టు చేసిన పాకిస్థాన్​ తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్​ చేసినట్లు ఒప్పుకుని, హైకమిషన్​లో ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తిస్తారో వెల్లడించాలని ఒత్తిడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 14 గంటలపాటు రాడ్లు, కర్రలతో కొడుతూ పిడి గుద్దులు కురిపించారని వెల్లడించారు.

india pak
భారత్ పాక్

By

Published : Jun 16, 2020, 2:14 PM IST

పాకిస్థాన్​ అదుపులోకి తీసుకున్న భారత హైకమిషన్​ అధికారులను తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించాలని వారిద్దరినీ ఒత్తిడి చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

పాక్​లోని భారత హైకమిషన్​లో డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరిని ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న 16 మంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైకమిషన్​ సమీపంలోని పెట్రోల్​ స్టేషన్​ వద్ద జరిగింది. చేతులకు బేడీలు వేసి కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

"హైకమిషన్​ అధికారులను యాక్సిడెంట్​ చేసినట్లు అంగీకరించాలంటూ అపహరించినవారు ఒత్తిడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరించారు. హై కమిషన్‌లోని ఇంటెలిజెన్స్ అధికారులు బయటి నుంచి తమ కార్లలో ప్రజలను హైకమిషన్​కు తీసుకురావాలని బలవంతం చేస్తున్నట్లు అంగీకరించాలని హింసించారు."

-అధికార వర్గాలు

మురికి నీరు తాగించి..

ఇలా 14 గంటల పాటు వీరిద్దరిని హింసించినట్లు తెలుస్తోంది. రాడ్లు, కర్రలతో కొట్టారని సమాచారం. పిడిగుద్దులు కురిపిస్తూ మురికినీరు తాగించి విచారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

"హైకమిషన్​లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి పాత్ర ఏంటో చెప్పాలని డ్రైవర్లను అడిగారు. విచారణ సమయంలో మిగతా హైకమిషన్​ అధికారులతోనూ ఇదే రకంగా వ్యవహరిస్తామని పదేపదే బెదిరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం పంపారు. అక్కడ టెటనస్​ ఇన్​జెక్షన్​ ఇచ్చినట్లు చెప్పారు. 21 గంటల తర్వాత సోమవారం భారత హైకమిషన్​కు తిరిగి అప్పగించారు."

- అధికార వర్గాలు

అయితే వాళ్లు నడవగలుగుతున్నా వారి ముఖాలు, మెడ, తొడలు, వీపు భాగంలో తీవ్రంగా కొట్టినట్లు గుర్తులు ఉన్నాయని సమాచారం. అయితే ప్రాణాంతకమైన గాయాలేమీ కాలేదని తెలుస్తోంది.

భారత్​ హెచ్చరికతో..

అరెస్టయిన ఇద్దరు అధికారులను కారుతో సహా భారత హైకమిషన్​​ కార్యాలయంలో తక్షణమే అప్పగించాలని పాక్ దౌత్య అధికారికి భారత్​ తేల్చి చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అరెస్టయిన ఇద్దరు భారత అధికారులను విచారించవద్దని, వాళ్లను హింసించడానికి వీల్లేదని పాక్​ దౌత్య అధికారికి జారీ చేసిన డీమార్చిలో పేర్కొంది భారత్​. వారి భద్రతకు పాక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అప్పటి నుంచి..

భారత్​లోని పాక్ హైకమిషన్​​ కార్యాలయంలో ఇద్దరు అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని వారిని బహిష్కరించింది భారత్​. సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారని చర్యలకు ఉపక్రమించింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇస్లామాబాద్​లోని భారత హైకమిషన్ కార్యాలయంలోని అధికారులను వేధిస్తున్నాయి పాక్ సంస్థలు. భారత సీనియర్​ దౌత్య వేత్త గౌరవ్​ అహ్లువాలియా కారును ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్​ఐ సభ్యులు వెంబడించిన కొద్దిరోజుల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

ఇదీ చూడండి:పాక్​కు భారత్​ వార్నింగ్- ఇద్దరు అధికారులు విడుదల

ABOUT THE AUTHOR

...view details