అత్యుత్తమ నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగిన వృత్తి నిపుణుల్ని, పరిశోధకులను ప్రపంచానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాల్లో కొందరు ఆచార్యుల తీరు కలవరపరుస్తోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్థానంలో ఉంటూ.. విద్యార్థులు, పరిశోధకుల్ని ఏదో ఒక రూపంలో వేధిస్తున్న బాధాకర ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తూ, చివరికి జైలు పాలయ్యే దుస్థితినీ కొందరు కొనితెచ్చుకుంటున్నారు. గడచిన పది రోజుల వ్యవధిలో ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఏకంగా ముగ్గురు ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇరువురు ఆచార్యులను నాలుగు రోజులపాటు రోజూ ఠాణాకు పిలిపించి ‘కౌన్సెలింగ్’ నిర్వహించి ఆఖరుకు ‘బైండోవర్’ చేసి, భవిష్యత్తులో మళ్లీ వేధింపులకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలేయగా, మరో ఆచార్యుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు. బాధిత మహిళలు వేధింపులు భరించలేక ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఫిర్యాదు చేయడంతో ముగ్గురి బండారం బయటపడింది.
నిత్యం ఎదుర్కొంటున్నవే..
ఇది కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయానికే పరిమితమైన సమస్య కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వర్సిటీల్లోనూ కొందరు యువతులు, పరిశోధకులు నిత్యం ఎదుర్కొంటున్నవే. కొందరు డబ్బుల కోసం వేధిస్తోంటే మరికొందరు లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి వేధింపులకు పాల్పడుతున్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉండే వైద్య కళాశాలల్లోనూ కొందరు యువతులు తమ బాధలను పంటి బిగువున భరిస్తుండగా మరికొందరు ఆత్మహత్యలకూ ఒడిగడుతున్నారు.
వృత్తిపరమైన నైతిక నియమావళి..
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆచార్యుల ప్రవర్తన ఎలా ఉండాలన్న అంశంపై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) 1988లోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకోసం యూజీసీ ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేసి అఖిల భారత విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యులు, అధ్యాపక సంఘాల సమాఖ్య ప్రతినిధులతో విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం వృత్తిపరమైన నైతిక నియమావళిని రూపొందించింది. విధుల్లోకి ప్రవేశించే ప్రతి ఆచార్యుడు, అధ్యాపకుడు ఆ నియమావళిని ఔపోసన పట్టాల్సి ఉండగా వాటిని పాటించాలన్న స్పృహే చాలామందిలో కొరవడుతోంది. కొందరికైతే అలాంటి నియమావళి ఉన్నట్లు కూడా తెలియడం లేదు. ఫలితంగా ఆచార్యులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. సమాజ విశాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నైతిక నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి సంబంధించిన నిబంధనలు లేకపోవడంతో నియమావళి ఎందుకూ కొరగాకుండా పోతోంది. ఆదర్శనీయ స్థానంలో ఉండాల్సిన ఆచార్యులు వక్రమార్గంలో ప్రయాణిస్తే వారిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు రాజకీయాలకు, వర్గ విభేదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.