సైన్యాధికారులు కానీ, జవాన్లు కానీ, అందరం రాజ్యాంగబద్ధులమై నడచుకొంటామని ప్రతిన బూనాం. మనల్ని నిరంతరం ముందుకు నడిపించేది, మన కార్యాచరణను మలిచేదీ ఆ ప్రతిజ్ఞేనని మరువకూడదు. రాజ్యాంగ పీఠిక ప్రబోధించిన కీలక విలువలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల పరిరక్షణకు పోరాడటమే మన కర్తవ్యం. దాన్నే సదా నిర్వహిస్తున్నాం’ అని జనవరి 15న సైనిక దినోత్సవంనాడు సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవానే ఉద్ఘాటించారు. సైన్యంపై నానాటికీ రాజకీయాల ప్రభావం పడుతుందని విమర్శలు వస్తున్న వేళ సైన్యాధిపతి రాజ్యాంగ నిబద్ధత గురించి మాట్లాడటం ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకొన్నది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి త్రివిధ సాయుధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని ప్రతిపక్షాలు, కొందరు మాజీ సైన్యాధికారులు విమర్శించిన నేపథ్యంలో జనరల్ నరవానే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సైన్యంకన్నా జాతీయతా భావన పునాదిగా ఏర్పడిన రాజ్య వ్యవస్థే మిన్న. సాయుధ దళాలకు మార్గదర్శకమైన మౌలిక విలువల్లో ఇది ముఖ్యమైనది. తన దేశం, తన జాతి మనుగడ, శ్రేయస్సు కోసమే సైన్యం ఉంది తప్ప సైన్యం కోసం దేశం లేదు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా జాతి ఆశలు, ఆశయాలు, అభిమతాలు రాజకీయ నాయకత్వం ద్వారానే వ్యక్తమవుతాయి కాబట్టి, రాజకీయ నాయకత్వ దృక్పథానికి అనుగుణంగా సైన్యం నడచుకోకతప్పదు. ‘రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనాల కోసం వివిధ విధానాలు చేపడుతుంది. యుద్ధం కూడా ఆ విధానాల్లో భాగమే. యుద్ధం చేయాలని రాజకీయ విధాన నిర్ణయం జరిగినప్పుడు సైన్యం ఆ పని చేయకతప్పదు. కాబట్టి సైన్యం ముందు రాజకీయ దృక్పథం తలొంచే ప్రసక్తి లేదు’ అని జర్మన్ సేనాని, సైనిక వ్యూహకర్త కార్ల్ ఫాన్ క్లౌస్ విట్స్ తన ‘ఆన్ వార్’ గ్రంథంలో ఉల్లేఖించారు.
రాజకీయాలకు అతీతంగా
అలాగని రాజకీయుల మాటలకు డూడూ బసవన్నల్లా తలలూపడం సైన్యం పని కాదు. ‘పోరాటం చేయడమే సైనికుల వృత్తి, విధి. వారి రాజకీయ విశ్వాసాలు, భావజాలాలకు ఇక్కడ స్థానం లేదు’ అని ‘ది ప్రొఫెషనల్ సోల్జర్’ గ్రంథంలో మోరిస్ జారోవిట్స్ అనే సిద్ధాంతకర్త ఉద్ఘాటించారు. సైన్యం వృత్తినిబద్ధతతో యుద్ధం చేసినప్పుడు రాజకీయంగా విస్తృత ప్రభావం కనిపిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ పోరు లక్ష్యాలను సాధించడం సైన్యం కర్తవ్యం. అదే దాని వృత్తి ధర్మం. ఈ ధర్మాన్ని అంకిత భావంతో నెరవేర్చాలి. సైన్యం ఆ పని చేయడానికి రాజకీయాలు అడ్డు రాకూడదు. వాటికి అతీతంగా సైన్యం తన విధులను నిర్వహించాలని, దాని వల్ల దాని పోరు సామర్థ్యమూ ఇనుమడిస్తుందని ఆయన వివరించారు. అనేకమంది నిపుణులు సైతం రాజకీయాలకు అతీతంగా కర్తవ్యాలను నిర్వహించే సేన- కదన రంగంలో తన సత్తాను చాటుకోగలుగుతుందని సూత్రీకరించారు. సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచితే, దాని వృత్తినైపుణ్యం, నిబద్ధతలు ప్రకాశిస్తాయి. వృత్తిధర్మ పాలన తప్ప మరో ఆలోచన లేని సైన్యం సహజంగానే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తుంది.
అనవసరంగా జోక్యం చేసుకోకూడదు