తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంతులేని కన్నీటి గాథకు సత్వర న్యాయమే పరిష్కారం' - హత్యాచారం

దేశంలో జరుగుతున్న హత్యాచారాలను నియంత్రించాల్సిన బాధ్యత సమాజంపైనా ఉంది. ఇలాంటి పాశవిక ఘటనలు జరిగినప్పుడు పోలీసు, న్యాయవ్యవస్థలను నిందించడం సహజమే. అయితే వీటికి పూర్తి బాధ్యత వారిదేననడం అసమంజసం. ప్రజలు తక్షణ న్యాయం కోరుకుంటున్నారు. తక్షణ న్యాయానికి, సత్వర న్యాయానికి తేడా ఉంది. మన న్యాయ వ్యవస్థలో తక్షణ న్యాయానికి చోటులేదు. ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ న్యాయాలకు పాల్పడినా అది నేరమే. తక్షణ న్యాయం ద్వారా శిక్ష విధించినంత మాత్రాన సమాజంలో నేరాలు తగ్గిపోతాయన్న భరోసా లేదు.

The society is also responsible for controlling the atrocities taking place in the country.
అంతులేని కన్నీటి గాథ, సత్వర న్యాయమే సరైన పరిష్కారం

By

Published : Dec 12, 2019, 6:17 AM IST

దేశ రాజధాని దిల్లీలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ హత్యాచార ఘటనపై యావత్‌ దేశం స్పందించిన తీరు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్‌ ‘దిశ’ ఉదంతంలోనూ అలాంటి స్పందనే వ్యక్తమైంది. నగరానికి చెందిన పశువైద్యురాలు దిశపై అత్యాచారం, సజీవ దహనం ఘటనతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ప్రజానీకం ఆగ్రహపూరిత స్పందన పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఈ నేపథ్యంలో వ్యవస్థల వైఫల్యంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. నిందితులైన నలుగురు యువకులు పోలీసు ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తక్షణ, తగిన న్యాయం జరిగిందంటూ ప్రజలనుంచి పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తాయి. పాశవిక దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం సహజమే. ఆ దుశ్చర్యలు వ్యక్తిగత ప్రవర్తనలకు ప్రతిబింబాలైనా వాటి మూలాల్లోకి వెళ్తే వ్యవస్థల వైఫల్యమనే పెనుభూతం కనిపిస్తుంది. మూలాలకు మందు వేయకుండా ఇటువంటి సమస్యలను పరిష్కరించడం అసాధ్యం.

వ్యవస్థల వైఫల్యం

క్రూర దుర్ఘటనలు, పాశవిక హత్యాచారాలు జరిగినప్పుడు పోలీసు యంత్రాంగాన్ని, శిక్షల్లో జాప్యం వల్లే నేరాలు పెచ్చరిల్లుతున్నాయని న్యాయవ్యవస్థను నిందించడం సర్వసాధారణం. ఈ రెండు వ్యవస్థలే పూర్తిగా కారణమనడం సమంజసం కాదు. చట్టాలు చేసే పాలకవర్గాలు, వాటిని అమలుచేసే యంత్రాంగాలు, అందులో భాగమైన పౌరసమాజం సైతం విఫలమైనట్లే భావించాలి. అత్యాచారం హత్యాచారంగా మారడం వెనక సామాజిక వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాధితురాలు తమను గుర్తించే అవకాశం ఉన్నందువల్ల హతమార్చేస్తే సాక్ష్యాధారాలు ఉండవనే ఉద్దేశంతో హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో నేరగాడు తప్పించుకునే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే స్పృహ లేకపోవడంతో పాశవిక చర్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపైనే కాదు... సభ్య సమాజంపైనా ఉంది.

తక్కువ సిబ్బంది

పోలీసుల నుంచి సత్వర స్పందన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉండాల్సిన పోలీసు సిబ్బంది కంటే 5.43 లక్షల మంది తక్కువగా ఉన్నారు. ఉన్న సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. పోలీసు ఉద్యోగమంటే వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటల పని అనే ఉద్దేశంతో నిరుద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా చాలా రాష్ట్రాల్లో నియామకాలు ఆశించినంతగా ఉండటం లేదు. కేసుల పరిష్కారంలో కాలహరణం గురించి న్యాయవ్యవస్థపైనా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని 25 హైకోర్టుల్లో సుమారు 43.55 లక్షల వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో 8.35 లక్షల వ్యాజ్యాలు పదేళ్లకు మించినవి. 26.76 లక్షల వ్యాజ్యాలు అయిదేళ్ల కిందటివి. వివిధ న్యాయస్థానాల్లో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యలో 37 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అత్యాచారం, హత్యాచారం వంటి ఘోరాలకు సంబంధించి సత్వర న్యాయం కష్టమైనందువల్లే క్రూర ఘటనల విచారణకు ‘ఫాస్ట్‌ట్రాక్‌’ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు.

సమాజ పాత్ర కీలకం

ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో సభ్యసమాజం పాత్రా కీలకమే. పిల్లల పెంపకంలో కన్నవారిలో మార్పు రావల్సిన అవసరముంది. పెంపకంలో తల్లిదండ్రులు చూపిస్తున్న దుర్విచక్షణ సైతం వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆడపిల్లలపై అతిగా ఆంక్షలు పెట్టడం, మగపిల్లలకు అధిక స్వేచ్ఛ ఇవ్వడం రెండూ పొరపాటే. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అమ్మాయిల కంటే అబ్బాయిల పెంపకంపైనే అధిక శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. ఆడపిల్లలను తమతో సమానంగా చూసే దృక్పథాన్ని అబ్బాయిలకు అలవరచాలి. పాఠశాల స్థాయి దాటి కౌమార దశ (టీనేజ్‌)కు వచ్చాక హార్మోన్ల ప్రభావంతో శరీరంలో జరిగే మార్పులు, వాటి పర్యవసానాలు, పరిణామాలు, దుష్ఫలితాలను గురించి తెలియజేస్తుండాలి. ఇందులో తమది గురుతర బాధ్యతగా విద్యాశాఖ గుర్తించాలి. నిర్భయ, దిశ వంటి కేసుల్లో నిందితులు ఎక్కువగా చదువును మధ్యలో వదిలేసినవారే. కనీసం పదోతరగతి చదువుకున్నవారు ఏదో ఓ రంగంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తారు. ఏడో తరగతితో చదువు మానేసినవారి పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ఏ రంగంలోనూ నిలదొక్కుకోలేరు. విచక్షణ జ్ఞానం మెరుగుపడకపోవడం వల్ల ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. పర్యవసానాలను విశ్లేషించుకునే సామర్థ్యం కొరవడుతుంది. మద్యం వంటి వ్యసనాలకు అలవాటుపడితే మరింత ప్రమాదకరంగా వీరు మారతారని మనస్తత్వ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిర్భయ, దిశ ఘటనల్లో ఈ కోవకు చెందినవారే నిందితులుగా ఉండటం గమనార్హం. ఉన్నత పాఠశాల స్థాయి వరకూ ఏ విద్యార్థీ చదువును మానేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే లింగ దుర్విచక్షణ తొలగి వారిలో వయసుకు అనుగుణమైన పరివర్తన వస్తుంది. ఇటువంటి దుర్ఘటనలు తగ్గడానికి అవకాశముంటుంది.

కార్యచరణ అవసరం

సత్వర న్యాయానికి, తక్షణ న్యాయానికి వ్యత్యాసముంది. దిశ హత్యాచారం విషయంలో ప్రజానీకం తక్షణ న్యాయానికి డిమాండ్‌ చేసింది. అందుకు తగినట్లే నిందితులకు పోలీసులు ఎన్‌కౌంటర్‌తో తీర్పు చెప్పారు. నేర శిక్షాస్మృతి ప్రకారం తక్షణ న్యాయానికి చోటు లేదు. ‘వంద మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికైనా శిక్ష పడకూడదు’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ న్యాయవ్యవస్థ పనిచేస్తోంది. నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి పై న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకోవచ్చు. మరణశిక్ష ఖరారైతే రాష్ట్రపతిని క్షమాభిక్ష అభ్యర్థించవచ్చు. ఈ అవకాశాలను సాకుగా తీసుకొని చాలా కేసుల్లో నిందితులు కాలహరణానికి పాల్పడుతున్నారు. రాజకీయ ప్రభావమున్న కేసుల్లో కనీస విచారణ, నిందితుల గుర్తింపు ఏళ్లుగా సాగడంలేదు.

పునఃసమీక్ష లేకుంటే పరిస్థితి?

2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ వసతిగృహంలో విద్యార్థిని ఆయేషా మీరా అత్యాచారం, హత్యోదంతం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితుడంటూ సత్యôబాబు అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడికి న్యాయస్థానం శిక్ష విధించింది. తొమ్మిదేళ్లపాటు శిక్ష అనుభవించిన తరవాత హైకోర్టు అతణ్ని నిర్దోషిగా ప్రకటించింది. జీవితంలో స్థిరపడాల్సిన సమయం శిక్షగా అనుభవించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తీర్పుల పునస్సమీక్ష అవకాశం లేకపోతే అతడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం. రాజకీయ ప్రమేయమున్న ఈ కేసులో ఇప్పటికీ అసలు నిందితులెవరన్నది పోలీసులుగాని, సీబీఐగాని గుర్తించలేదు. ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కేసుల్లో ఇలాగే జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోయింది.

తక్షణ న్యాయంపై ప్రజాసక్తి

ప్రజానీకంలో ఇటీవలి కాలంలో తక్షణ న్యాయంపై ఆసక్తి పెరుగుతోంది. అరబ్బు దేశాల్లో మినహా ఎక్కడా ఇటువంటి పదానికి చోటు లేదు. నిందితులను ఎన్‌కౌంటర్‌ ద్వారా హతమార్చేయడమే తక్షణ న్యాయమనుకుంటే పొరపాటే. ఇందుకు భారతీయ శిక్షాస్మృతి అంగీకరించదు. న్యాయస్థానాల తీర్పుల ద్వారానే శిక్షలు అమలుచేయాలి. ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ న్యాయాలకు పాల్పడినా అది నేరమే. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అటువంటి శిక్ష విధించినంత మాత్రాన సమాజంలో నేరాలు తగ్గిపోతాయన్న భరోసా లేదు. 2008 డిసెంబరులో వరంగల్‌లో జరిగిన ఆమ్లదాడి ఘటనలోని ముగ్గురు నిందితులు సన్నివేశ పునర్నిర్మాణం (సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌) సందర్భంగా ఎదురుకాల్పుల్లో మరణించారు. ఆ తరవాతా ఆమ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిన్నరేళ్లలో 852 ఘటనల్లో, 1,082 మందిపై ఆమ్లదాడులు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిశ హత్యాచార ఘటనలో నిందితులను హతమార్చినంత మాత్రాన అత్యాచారాలు నిలిచిపోతాయని ఎవరు చెప్పగలరు?

కేంద్రం చర్యలు

నేరన్యాయ వ్యవస్థలో సవరణలకు ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సూచనలు, సలహాల కోసం రాష్ట్రాలకు లేఖలు రాసింది. హత్యాచారం వంటి పాశవిక నేరాల్లో ఏర్పాటుచేస్తున్న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో న్యాయ విచారణ, శిక్షల అమలులో కాలహరణాన్ని కనీస స్థాయికి తగ్గించే విధంగా చట్టాల్లో సవరణలు చేయాలి. మూడు నెలల్లోనో, ఆరు నెలల్లోనో విచారణ నుంచి శిక్షల ఖరారు ప్రక్రియలన్నీ పూర్తిచేసే విధంగా నేరన్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అవసరం. న్యాయం అందించడానికి, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఇనుమడింపజేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత సవరణల దిశగా సత్వరం దృష్టి సారించాల్సి ఉంది!

నేరాల పరంపర

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికల ప్రకారం గత పదేళ్లలో 2.79 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుంటే దేశంలో సగటున రోజుకు 92 అత్యాచారాలు జరుగుతున్నాయి. న్యాయస్థానానికి చేరిన ప్రతి నాలుగు కేసుల్లో ఒక్కదాంట్లోనే నిందితులకు శిక్ష పడుతోంది. శిక్షల అమలులో కేరళ 84 శాతంతో అగ్రభాగంలో ఉండగా, 10 శాతం శిక్షలతో బిహార్‌ అట్టడుగు స్థానంలో నిలుస్తోంది. ఐపీసీ 376 ప్రకారం అత్యాచారానికి ఏడేళ్ల జైలు నుంచి జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశముంది. నిర్భయ ఘటన తరవాత చట్టంలో పలు మార్పులు తీసుకొచ్చారు. లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. అత్యాచార ఘటనలకు 14 ఏళ్ల జైలు, తీవ్రతను బట్టి మరణ శిక్ష విధిస్తున్నారు. మూకుమ్మడి అత్యాచారమైతే 20 ఏళ్ల జైలుశిక్ష నుంచి కఠిన జీవితఖైదు లేదా మరణ శిక్ష విధించే విధంగా సవరించారు. సత్వర విచారణకు ‘ఫాస్ట్‌ట్రాక్‌’ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో ప్రజలు సంతృప్తి చెందడం లేదని దిశ దుర్ఘటన అనంతరం పెల్లుబికిన ఆగ్రహావేశాలు వెల్లడిస్తున్నాయి.

-ఎం.కృష్ణారావ్ (రచయిత)

ABOUT THE AUTHOR

...view details