అధికార పత్రిక సామ్నా వేదికగా భారతీయ జనతాపార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిందిశివసేన. భాజపా పేరు ప్రస్తావించకుండానే ఆ పార్టీ చేసిన మోసాన్ని మహమ్మద్ ఘోరీ చేసిన విశ్వాస ఘాతుకంతో పోల్చింది.
మహమ్మద్ ఘోరీ
"13వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ, భారత్‌పై దండెత్తి.. హిందూరాజైన పృథ్విరాజ్ చౌహాన్‌తో పలుసార్లు యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాలలో అనేకసార్లు ఘోరీ ఓడిపోయినప్పటికీ చౌహాన్ తనను ప్రాణాలతో వదిలేశాడు. ఐతే ఓ యుద్ధంలో గెలుపొందిన ఘోరీ.. చౌహాన్‌ను చంపివేశాడు."
ఇదేరకంగా మహారాష్ట్రలో శివసేన కృతజ్ఞతలేని వ్యక్తులను అనేకసార్లు వదిలేసిందని, ఇప్పుడు వారే తమను వెన్నుపోటు పొడిచేందుకు చూస్తున్నారని పరోక్షంగా భాజపాను ఉద్దేశిస్తూ సామ్నాపత్రిక సంపాదకీయంలో ఆరోపించింది. పార్లమెంట్‌లో విపక్షాల వైపు సీట్లను కేటాయించడాన్ని సైతం శివసేన తప్పుబట్టింది. ఎన్డీఏ సమావేశం జరగక మునుపే.. తమ స్థానాలను ఎలా మారుస్తారన్న శివసేన ఈ రకమైన తొందరపాటు భవిష్యత్తులో ప్రమాదాలకు దారితీస్తుందని.. హెచ్చరించింది.
సవాల్ చేస్తే...అంతే!
దురంహకార రాజకీయాలకు ముగింపు పలికే ప్రక్రియ ప్రారంభమైందన్న శివసేన మీరు మమ్మల్ని సవాల్ చేస్తే ఏదో ఒకరోజు మిమ్మల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తామని హెచ్చరించింది. ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు శివసేన భాజపాకు మద్దతిచ్చే సమయానికి ఇప్పుడున్న నాయకులంతా చిన్నపిల్లలని ఎద్దేవా చేసింది.
ఇదీ చూడండి : శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో