తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: అమెరికా నుంచి వచ్చే 7 విమానాల్లో ఏముంటాయ్? - అమెరికా నుంచి వచ్చే 7 విమానాల్లో ఏముంటాయ్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈనెల 24న భారత్​కు రానున్నారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో భారీ రోడ్​ షోలో పాల్గొని, మోటేరా స్టేడియం ప్రారంభించనున్నారు​. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన కోసం అగ్రరాజ్యానికి చెందిన భద్రతా విమానం ఇప్పటికే అహ్మదాబాద్​ చేరుకుంది. ఈ నేపథ్యంలో.. అగ్రరాజ్యం అధినేత విదేశీ పర్యటనలో తీసుకునే ముందస్తు జాగ్రత్తలు ఏమిటి? అందించే భద్రత ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ముందు నుంచి దీనిపై కసరత్తు చేస్తారు? ఇలాంటి ప్రత్యేకమైన కొన్ని అంశాలు మీకోసం.

United State
అమెరికా నుంచి వచ్చే 7 విమానాల్లో ఏముంటాయ్?

By

Published : Feb 19, 2020, 4:42 PM IST

Updated : Mar 1, 2020, 8:42 PM IST

డొనాల్డ్ ట్రంప్... అగ్రరాజ్యానికి అధినేత. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరు. అమెరికా అధ్యక్షుడిగా పేరు, ప్రతిష్ఠలు ఏ స్థాయిలో ఉంటాయో... ముప్పూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అలాంటి నేతకు భద్రత కల్పించడం ఎలా? అమెరికా అధికార యంత్రాంగం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది? విదేశీ పర్యటనల సమయంలో ఏం చేస్తుంది?

24/7 సీక్రెట్ ఏజెంట్స్​

అమెరికా అధ్యక్షుడి భద్రతలో ఏడాది పొడవునా 24/7 సీక్రెట్​ సర్వీస్ ఏజెన్సీ పని చేస్తుంటుంది. చీమ చిటుక్కుమన్నా దానిని పసిగట్టేంతగా నిఘా పెడుతుంది. ఎంతలా అంటే.. అధ్యక్షుడు​ శౌచాలయానికి వెళ్లినా.. ఆ పరిసరాలపై నిఘా వేస్తుంది ఈ సంస్థ.

మూడు నెలల ముందే..

అమెరికా అధ్యక్షుడు విదేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే.. ఆ పర్యటనపై మూడు నెలల ముందే కసరత్తు ప్రారంభిస్తుంది సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ. భద్రతాపరమైన అంశాలపై స్థానిక ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుంది. అధ్యక్షుడు విమానాశ్రయానికి చేరుకున్న తరుణంలో అక్కడి పరిసరాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. అనంతరం రోడ్డుపైనా ట్రాఫిక్​ లేకుండా చర్యలు తీసుకుంటారు. విమానాశ్రయం నుంచి కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్లే మార్గంలో జాగిలాలతో తనిఖీ చేస్తారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమ అధీనంలోకి తీసుకుంటారు.

7 విమానాలు..

పర్యటన ప్రదేశానికి అధ్యక్షుడు చేరుకునే సమయానికి కొద్ది రోజుల ముందే వివిధ రకాల వస్తువులు, సామగ్రితో కూడిన 7 విమానాలు గమ్యస్థానానికి చేరుకుంటాయి. అందులో ఓ హెలికాఫ్టర్​, ప్రత్యేకమైన కారు, సమాచార వ్యవస్థతో పాటు అధికారులు, శ్వేతసౌధం సిబ్బంది ఉంటారు. అధ్యక్షుడి వాహనశ్రేణి వెళ్లే మార్గాన్ని లైవ్​ రికార్డింగ్​ చేసే ఏర్పాట్లు చేస్తారు.

ఆహారం విషయంలోనూ..

అధ్యక్షుడికి అందించే ఆహారం విషయంలోని తగు జాగ్రత్తలు తీసుకుంటారు భద్రతా సిబ్బంది. ఆహార పదార్థాలను సీక్రెట్ ఏజెంట్లు పరీక్షిస్తారు. వంటలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా నియమించిన వంటవారు, సిబ్బంది విదేశీ పర్యటనలకు అధ్యక్షుడి వెంటే వస్తారు.

బస చేసే ప్రాంతంలో..

విదేశీ పర్యటనలో అధ్యక్షుడు బస చేసే ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. అంతా బాగానే ఉందని అనుకుంటూనే అధ్యక్షుడు ఉండేందుకు అనుమతిస్తారు. అక్కడ అందించే అన్ని రకాల సేవలనూ ముందుగానే పరిశీలిస్తారు. ఆ భవనంలో ఎలివేటర్లు, ఆరోగ్యపరమైన సౌకర్యాల వంటివి తప్పకుండా ఉండాలి. లిఫ్ట్​లు, ఇతర యంత్రాలకు మరమ్మతులు చేసే సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ ఏదైనా హోటల్​లో బస చేసినట్లయితే అక్కడ పనిచేసే సిబ్బంది వివరాలను తెలుసుకుంటారు. నేర చరిత్ర ఉన్నవారిని విధుల నుంచి తప్పిస్తారు.

అధ్యక్షుడు ఉండే గదిలో పలు రకాల భద్రత పరికరాలను ముందుగానే ఏర్పాటు చేస్తారు. కిటికీలకు బుల్లెట్​ ప్రూఫ్​ ప్లాస్టిక్​ అద్దాలను బిగిస్తారు. అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా వలయాన్ని దాటి వెళ్లకూడదు. ఏదైనా దాడి జరిగితే వారిని ఎదుర్కోవటంపై సీక్రెట్​ ఏజెంట్లకు ముందుగానే శిక్షణ ఇస్తారు. స్థానిక నేరచరితుల్ని, గొడవలు సృష్టించేవారిని, అనుమానాస్పద వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచిస్తారు.

అందుబాటులో రక్తం..

అధ్యక్షుడి రక్త నమూనాకు సరిపడే రక్తాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్​ ఎప్పుడూ తమతో తీసుకువస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి చికిత్స అందించాల్సి వచ్చినప్పుడు 10 నిమిషాల్లోనే తగిన ఏర్పాట్లు చేస్తారు.

ప్రత్యేక కోడ్​..

అధ్యక్షుడు, ఆయనతో పాటు ఉంటే వ్యక్తుల గురించి మాట్లాడుకునేందుకు ఓ ప్రత్యేక కోడ్​ను రూపొందించుకుంటారు సీక్రెట్ ఏజెంట్లు. ఉదాహరణకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను మొఘల్​ అని, ఆయన భార్య మెలానియాను మూస్​ అని పిలుస్తారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: ఎగిరే శ్వేతసౌధం ఆ​ విమానం

Last Updated : Mar 1, 2020, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details