తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నార్తులకు ఆలంబనగా ప్రజా పంపిణీ వ్యవస్థ - సంపాదకీయం

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పేదరికం. ఇటీవల ఒకే దేశం ఒకే రేషన్​ కార్డు పథకాన్ని వచ్చే జూన్​ నుంచి ఇరవై రాష్ట్రాల్లో అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పథకాల వల్ల ఆకలి బాధలు ఎంతవరకు తీరతాయో.. పేదరిక నిర్మూలన ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకుందాం.

THE SCHEMES WILL HELP TO ERADUCATE POVERTY IN INDIA
అన్నార్థులకు ఆలంబనగా.. పథకాలు ఫలించేనా?

By

Published : Mar 6, 2020, 7:11 AM IST

ఏ భారతీయుడూ ఖాళీ కడుపుతో నిద్రించే దుస్థితి ఏర్పడకుండా కాచుకోవడమే స్వాతంత్య్రం పరమార్థమనేవారు బాపూజీ. దశలవారీగా రూపురేఖలు మారి, 1997నుంచి దేశవ్యాప్తంగా దారిద్య్ర రేఖ దిగువన కుములుతున్నవారికి సరసమైన ధరలకు ఆహార సరఫరాలు అందించడానికి లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ పట్టాలకు ఎక్కింది. 2013నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం, రమారమి 80కోట్ల మంది పౌరులకు తిండిగింజల సరఫరాను ఉద్దేశిస్తోంది. పొట్ట చేతపట్టుకుని వేరే రాష్ట్రాలకు తరలుతున్న కోట్లమంది రేషన్‌ సరకులు పొందడంలో ఎదుర్కొంటున్న సాధక బాధకాలు- పథకం మౌలిక స్ఫూర్తికి, జాతిపిత అభిలాషకు తూట్లు పొడుస్తున్నాయి. ఈ దురవస్థను చెదరగొట్టడానికి తలపెట్టిందే- ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ పథకం. అది వచ్చే జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇరవై రాష్ట్రాల్లో అమలు కానుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ చెబుతున్నారు!

ఇతర రాష్ట్రాల్లో రేషన్​ సౌకర్యం

ఒక రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రంలో రేషన్‌ సరకులు తీసుకునే సౌలభ్యం (పోర్టబిలిటీ) నిరుడు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ, మహారాష్ట్ర- గుజరాత్‌లలో మొదలైంది. క్రమంగా హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా, త్రిపుర సహా 12 రాష్ట్రాలకు విస్తరించింది. పశ్చిమ్‌ బంగ తాను కలిసిరానంటుండగా- యూపీ, బిహార్‌ వంటివి జత కలిస్తే రేషన్‌ కార్డు పోర్టబిలిటీ పరిధి కచ్చితంగా పెరుగుతుందని కేంద్ర అమాత్యులు దిలాసా వ్యక్తీకరిస్తున్నారు. అది అక్షరాలా నిజమైతే, ఉన్న ఊరు వదిలి నగరాలకు వలసబాట పట్టిన అసంఖ్యాకులకు గొప్ప తీపికబురవుతుంది. రకరకాల కారణాలతో, పేదల నోటి దగ్గరి కూడును దుర్మార్గంగా తన్నుకుపోయే పెడ ధోరణులకు నెలవైన దేశంలో, వలస జీవులు సహా అవసరార్థులందరికీ రేషన్‌ సరకులు సక్రమంగా సమకూర్చడమే- అసలైన సంక్షేమ చర్యగా వన్నెలీనుతుంది!

పోషకాహార లేమితో ఇక్కట్లు

నూట పదిహేడు దేశాల స్థితిగతుల్ని మదింపువేసి క్రోడీకరించిన అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్‌ 102వ స్థానాన తల వేలాడేసింది. దేశీయంగా పెచ్చరిల్లుతున్న పోషకాహార లోపాలు- భూరి వ్యయంతో చేపట్టామంటున్న ‘ప్రతిష్ఠాత్మక’ పథకాలను సత్వరం ప్రక్షాళించాల్సిన ఆవశ్యకతను కళ్లకు కడుతున్నాయి. 2005-15 సంవత్సరాల మధ్య సుమారు 27 కోట్లమంది భారతీయులు పేదరికం కోరలనుంచి బయటపడ్డారంటున్నా- 130 కోట్లకు పైబడిన దేశ జనాభాలో 28శాతం బీదరికంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ గణాంక విశ్లేషణ చాటుతోంది. విస్తృతావసరాలకు తగ్గట్లు దేశంలోని సుమారు అయిదు లక్షల 39వేల చౌక ధరల దుకాణాల్ని ఎంతవరకు పరిపుష్టీకరించారు? అధికారిక సమాచారం ప్రకారమే, మొన్న జనవరి నాటికి 88.9శాతం రేషన్‌ దుకాణాల యాంత్రీకరణ (ఆటొమేషన్‌) పూర్తయింది. మూడింట రెండొంతుల కేంద్రాల్లో ఆధార్‌ ధ్రువీకరణ ఇంకా జరగాల్సి ఉంది. ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానం సజావుగా పూర్తికాక, వేలి గుర్తులు సరిపోలక, ఇతరత్రా కారణాలతో పదిశాతం దాకా సహేతుక లబ్ధిదారులకు సరఫరాలు నిరాకరించిన ఉదంతాలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. జూన్‌ 2020 గడువులోగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక సాంకేతికాంశాలపరంగా ముందడుగు అసాధ్యమన్న సూచనల దృష్ట్యా ‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు’ పథకాన్ని ఆదరాబాదరా విస్తృతీకరిస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు రేషన్‌ నిరాకరించిన ఉదంతాలు పునరావృతం కాకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రజాప్రభుత్వాలు ఏ దశలోనూ విస్మరించకూడదు.

నాలుగేళ్లక్రితం, ఆధార్‌ చట్టబద్ధం కాకమునుపే- ఆ కార్డు లేదన్న కారణంగా ఏ ఒక్కరికీ ఎటువంటి లబ్ధినీ నిరాకరించరాదని సర్వోన్నత న్యాయస్థానం ముందుచూపుతో నిర్దేశించింది. ఆ మధ్య, ఆధార్‌ కార్డు తీసుకురాలేదంటూ నిండు గర్భిణిని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది వెలుపలికి నెట్టేయగా, వార్డు బయటే ఆమె ప్రసవించిన గురుగ్రామ్‌ ఘటన యావద్దేశాన్నీ నిశ్చేష్టపరచింది. ఆధార్‌ కార్డు చేతిలో లేదని వైద్యులు చికిత్స చేయ నిరాకరించేసరికి హరియాణాలో ఓ అమర జవాను భార్య ప్రాణాలే కోల్పోయింది. రేషన్‌ లబ్ధిదారులకూ ఆధార్‌ తప్పనిసరి చేయడం మూలాన కార్డు లేక తిండిగింజలు తెచ్చుకోలేక ఒడిశా, ఝార్ఖండ్‌ వంటిచోట్ల కొంతమంది అభాగ్యుల ఆకలిచావులూ నమోదయ్యాయి.

ఏపీలాంటివి ఒక్కో సంక్షేమ పథకానికీ ఒక్కో కార్డు కేటాయిస్తుండగా, సామాజిక భద్రత ప్రయోజనాల్ని చేరువ చేసేందుకంటూ అయిదేళ్ల క్రితం గుజరాత్‌ ‘యు-విన్‌’ పేరిట ప్రత్యేక కార్డునొకదాన్ని ప్రవేశపెట్టింది. నిరక్షరాస్యులు, నిరుపేదలు, వలసజీవులు కోట్ల సంఖ్యలో ఉన్న దేశంలో ఇలా లెక్కకు మిక్కిలి కార్డులు, అనుసంధాన సమస్యలతో కడకు మొండిచెయ్యి చూపడం- అన్నార్తుల పాలిట క్రూర పరిహాసం కాక మరేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలన్నింటికీ ఒక వ్యక్తికి ఒకే గుర్తింపును వర్తింపజేసేలా విధాన క్షాళన తక్షణావసరం. ఏ సాకుతోనైనా రాయితీలను, సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరాకరించిన పక్షంలో ఆయా నిర్ణయాలకు సంబంధిత అధికార సిబ్బందే పూర్తిగా జవాబుదారీ అయ్యేలా విధి విధానాల్ని సాకల్యంగా ప్రక్షాళించాలి. లీకేజీలకు, అవినీతి బాగోతాలకు పెట్టింది పేరైన ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖచిత్రం మారాలంటే- శీఘ్రగతిన డిజిటలీకరణ, గిరాకీ ఉన్న చోటుకు యుద్ధ ప్రాతిపదికన సరకుల తరలింపు, నిల్వ సదుపాయాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత కీలకం. ఒక్క ముక్కలో, పాలక గణాల దృఢ సంకల్ప దీక్షే ‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు’ పథక సాఫల్యానికి ప్రాణప్రదం!

ABOUT THE AUTHOR

...view details