శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆయోధ్య రామమందిరం భూమిపూజ అంశంలో అన్నింటికన్నా ఎక్కువగా వినిపిస్తోంది ఈ పేరే. మందిరానికి సంబంధించి అన్ని బాధ్యతలు చూసుకుంటోంది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏర్పాటైన ఈ ట్రస్టు... ఆలయ నిర్మాణానికి సంకల్పించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. సాధ్యమైనంత వేగంగా.. సుందరంగా రూపుదిద్దుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అయోధ్యలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఈ ట్రస్టు.. రామమందిరానికి సంబంధించి అన్న అంశాలకు జవాబుదారీ.
లోక్‌సభలో మోదీ ప్రకటన..
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినా స్వతంత్రంగా నడిచే ఈ ట్రస్టు.. కేవలం ఆయోధ్య రామమందిరం కోసమే ఏర్పడింది. ఏళ్లుగా తేలని అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రక తీర్పు తర్వాత రూపు దిద్దుకుంది. 15 మంది సభ్యులతో ఏర్పాటైంది. ఈ ట్రస్టును లోక్‌సభ వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రస్టు విధివిధానాలు రూపొందించారు. ప్రముఖ న్యాయవాది పరాశరన్ నేతృత్వంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేశారు. దిల్లీలోని పరాశరన్ నివాసమే ట్రస్టు కార్యాలయమని నాడు కేంద్రం ప్రకటించింది.
వీరి ఆధ్వర్యంలోనే..
ఇక అప్పటి నుంచి ఈ ట్రస్టు ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో అన్నీ తానై వ్యవహరిస్తోంది. 15 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ ట్రస్టు.. ప్రస్తుతం మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షుడిగా ఆయన నేతృత్వంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఈ ట్రస్టుకు కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ మహరాజ్ వ్యవహరిస్తుండగా.. శ్రీ చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పరాశరన్ సీనియర్ న్యాయవాదిగా ఉండగా.. ఐఏఎస్ నృపేంద్ర మిశ్రా శాశ్వాత సభ్యులుగా ఉన్నారు.
వీరితో పాటు స్వామి వాసుదేవానంద్ సరస్వతిజీ మహరాజ్, స్వామి విశ్వప్రసన్నతీర్థజీ మహరాజ్, ప్రేమానంద్ గిరిజీ మహరాజ్, విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా, హోమియోపతి వైద్యులు అనిల్ మిశ్రా, కామేశ్వర చౌపల్, మహంత్ దేవేంద్రదాస్ సభ్యులుగా ఉన్నారు. కేంద్రం నుంచి హోం శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వం తరపున ఆదనపు ముఖ్యకార్యదర్శి అవనీష్ అవస్థీలతో పాటు స్థానిక పాలనాధికారి అంజూ ఝా ఉన్నారు. రామమందిరం నిర్మాణానికి సంబంధించిన అన్న కార్యకలాపాలు వీరి ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.
పరాశరన్ పాత్ర కీలకం..
ఈ ట్రస్ట్‌కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు న్యాయవాది పరాశరన్. 92 ఏళ్ల ఆయన ఆయోధ్య కేసులో కీలకంగా ఉన్నారు. ఏళ్లుగా నలుగుతున్న చారిత్రక అయోధ్య కేసు పరిష్కారానికి ఈయన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు జరిగిన విచారణలో ప్రతిరోజు ఈయన పాల్గొన్నారు. రామ్ లల్లా విరాజ్మన్‌కు తీర్పు అనుకూలంగా రావటంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు.