ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ, ఆహార ఉత్పత్తిదారుల్లో ఒకటిగా మనదేశం నిలుస్తున్నా, ఆహార శుద్ధి రంగం నుంచి అదనపు విలువ జోడించే విషయంలో మాత్రం ఎక్కడో అడుగున ఉంటోంది. ఈ రంగం మనదేశంలో ఎక్కువగా అసంఘటితంగా, అవ్యవస్థీకృతంగానే కొనసాగుతోంది.
అదనపు లాభాలు
ఆహార శుద్ధి ప్రక్రియను రెండు స్థాయులుగా విభజించి చెప్పుకోవచ్చు. బియ్యం, చక్కెర, వంటనూనె, పిండి మిల్లులు వంటివి ప్రాథమిక ఆహార శుద్ధికి ఉదాహరణలు. పండ్లు, కూరగాయలు, పాడి, బేకరీ, చాక్లెట్లు, ఇతర పదార్థాలు రెండో రకంలోకి వస్తాయి. దేశంలో ఆహార శుద్ధి ఎక్కువగా ప్రాథమిక స్థాయిలోనే జరుగుతోంది. ఇందులో అదనపు విలువ తక్కువే. రెండోరకంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రైతుల ఆదాయాల్ని ఇనుమడింపజేయడానికి ఆహార ఉత్పత్తులకు జోడింపు ద్వారా విలువ పెంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, తృణ ధాన్యాల పంటలతో పోలిస్తే పండ్లు, కూరగాయలు వంటివాటికి అదనపు విలువ అధికం. ఆహార శుద్ధి ప్రక్రియ, అదనపు ఉత్పత్తిని సమర్థంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. వృద్ధి కోణంలోనే కాకుండా, ఆహార వృథా నివారణలోనూ ఇది ప్రయోజనకారిగా పని చేస్తుంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 40 శాతం ఉత్పత్తి వృథాగా పోతోంది. ఏటా పంటకోత తరవాత తలెత్తే నష్టం రూ.90 వేలకోట్ల దాకా ఉంటున్నట్లు నీతిఆయోగ్ స్పష్టం చేసింది. పంట దిగుబడిని పొలం గట్టువద్దే సరైన రీతిలో వేరు చేయగలిగితే, వృథాను తగ్గించగలగడమే కాకుండా, రైతులకు మెరుగైన ధరా దక్కేలా చేయొచ్చు.
ఆహార శుద్ధి పరిశ్రమ వృద్ధి కోసం మెగాఫుడ్ పార్క్ పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పన, రైతుల ఆదాయం పెంపు, వృథాను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు లక్ష్యంతో రైతులు, శుద్ధిచేసేవారు, చిల్లర వర్తకులను ఒకేచోటుకు చేర్చి వ్యవసాయ ఉత్పత్తులు, విపణుల మధ్య అనుసంధానత కోసం ఓ యంత్రాంగాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది క్లస్టర్ పద్ధతి తరహాలో పని చేస్తుంది. ఈ పార్కులు సకల సౌకర్యాలతో కూడిన వ్యవసాయ/ ఉద్యాన జోన్ల కోసం సుస్థిర పంపిణీ వరస (సప్లయ్ చైన్)తో కూడిన ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తోడ్పడతాయి. మెగాఫుడ్ పార్కులో సేకరణ కేంద్రాలు, ప్రాథమిక, కేంద్రస్థాయి శుద్ధి కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా పారిశ్రామికవేత్తల కోసం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన స్థలాలు... వంటి మౌలిక సౌకర్యాలన్నీ ఉంటాయి. మెగాఫుడ్ పార్క్ పథకం అమలును ప్రత్యేక సంస్థ ఏర్పాటు ద్వారా చేపడతారు. ఇందులో ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, వ్యవస్థీకృత చిల్లర వర్తకులు, ఆహార శుద్ధిచేసేవారు, సేవలు అందజేసేవారు, ఉత్పత్తిదారులు, రైతు సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పథకం ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో అమలవుతుంది. ప్రతి ఫుడ్‌పార్కులో 30 నుంచి 35 దాకా ఆహార శుద్ధి పరిశ్రమలు ఉంటాయి. వీటికి రూ.250 కోట్ల దాకా పెట్టుబడి అవసరమవుతుంది. రూ.450 నుంచి రూ.500 కోట్లమేర వార్షిక టర్నోవరుతో, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో ఏకమొత్తం మూలధనంగా ప్రాజెక్టు వ్యయంలో భూమి వ్యయం మినహాయించి 50 శాతం మంజూరు చేస్తారు. పథకాన్ని 2008లో ప్రారంభించినా, 2014 వరకు కేవలం రెండు మెగా ఫుడ్ పార్కులే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 42 మెగాఫుడ్ పార్కులకు నిధులు అందజేయగా, 17 అమలులోకి వచ్చాయి. శీతల గిడ్డంగులు, రవాణా వ్యవస్థ, విలువ జోడింపు, సంరక్షణ మౌలిక వసతుల పథకాన్నీ కేంద్ర ఆహారశుద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. ఇందులో సమగ్ర శీతల గిడ్డంగుల వ్యవస్థకు సంబంధించిన వసతుల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తుంది. దీనివల్ల పంటకోత నష్టాల్ని అడ్డుకోవచ్చు. ఇందులో ప్రతి ప్రాజెక్టుకు గరిష్ఠంగా రూ.10 కోట్లమేర ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా అందిస్తారు. ఆహార శుద్ధి రంగానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 500 శీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుటి వరకు ప్రభుత్వం మొత్తం 299 సమీకృత శీతల సదుపాయాలు, గిడ్డంగుల ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో 91 ప్రాజెక్టుల పని పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌కు 21 ప్రాజెక్టులు మంజూరవగా, నాలుగు అమలులోకి వచ్చాయి. మరో పద్నాలుగింటి పనులు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణలో సైతం తొమ్మిది ప్రాజెక్టులు మంజూరవగా, నాలుగు పూర్తయ్యాయి. మరో అయిదు నిర్మాణంలో ఉన్నాయి. ఆహార శుద్ధి ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచేందుకు మౌలిక సదుపాయాల నిర్మాణం అవసరం. ఇలాంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తగినన్ని నైపుణ్యాలూ కావాల్సిందే. రైతులకు అవసరమైన అనుసంధానతల్ని కల్పించడమూ కీలకమే. ఈ విషయంలో ఒప్పంద వ్యవసాయం మంచి సాధనంగా చెప్పవచ్చు. నమూనా ఒప్పంద వ్యవసాయ చట్టం (2018) ప్రకారం దిగుబడి పరిమాణాన్ని, నాణ్యత, సరఫరా చేసే ఆహారోత్పతుల ధరల్ని ఒప్పందంలో స్పష్టంగా వివరించాలి. దీనివల్ల ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులకు రక్షణ లభిస్తుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) అంచనా ప్రకారం, 2022 నాటికి దేశంలో ఆహార శుద్ధి పరిశ్రమ కోసం 1.78 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించాల్సి ఉంది. ఆహార శుద్ధి రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించడంలో భాగంగా మరిన్ని మెగాఫుడ్ పార్కుల ఏర్పాటుకు భారత ప్రభుత్వం నేరుగా 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐల)కు అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆమోదించే మార్గంలోనూ వందశాతం ఎఫ్‌డీఐని అనుమతించింది. దేశంలో ఉత్పత్తయ్యే ఆహార ఉత్పత్తుల విషయంలో ఇ-కామర్స్ రంగానికీ ఇది వర్తిస్తుంది. 2024 నాటికి ఆహార శుద్ధి పరిశ్రమ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందని, 90 లక్షల మందికి ఉద్యోగితను కల్పిస్తుందని ఒక అంచనా.