చట్టాల్లో చిన్నచిన్న దోషాలుంటే సవరణ చేయొచ్చు. కానీ, వాటి ఉద్దేశమే తప్పు అయినప్పుడు రద్దు చేయటమే ఏకైక పరిష్కారం. లక్షల మంది రైతుల 'చలో దిల్లీ' పోరాటం ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతుంది’ అని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల విశ్వాసం వ్యక్తం చేశారు. '70 కోట్ల మంది రైతులు కష్టపడి పనిచేసి దేశానికి ఆహారం అందించే దేశభక్తులే తప్ప ఎవరికీ ఏజెంట్లు కారు. వారికి రాజకీయ పార్టీల, విదేశాల మద్దతు అవసరం లేదు. వారిపై అలాంటి ఆరోపణలు చేయటం దారుణమైన నేరమ'ని ఆవేదన వ్యక్తం చేశారు. 'హిందూ, ముస్లిం, సిక్కులు అంతా కలిసి ఉద్యమించటంతో వారి పోరుకు లౌకికతత్వం వచ్చింది. అందుకే పాలకుల్లో భయం పట్టుకుంది' అని తెలిపారు. పశ్చిమబెంగాల్ నుంచి సీపీఎం తరఫున 8సార్లు లోక్‌సభకు ఎన్నికైన సీనియర్ పార్లమెంటేరియన్ హన్నన్. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన 44 మంది రైతు ప్రతినిధుల్లో ఆయన ఒకరు. దిల్లీ సరిహద్దుల్లో 16 రోజులుగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన.. కేంద్రంతో చర్చలు విఫలం..నేపథ్యంలో ఉద్యమ భవిష్యత్తుపై ఆయన 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
చట్టాల వెనుక ఏ దురుద్దేశాలున్నాయి?
ఇవి వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించిన చట్టాలే తప్ప వ్యవసాయానికి సంబంధించినవి కాదు. అయినప్పటికీ అదే పేరుతో కేంద్ర వ్యవసాయ శాఖ చట్టాలు తీసుకొచ్చింది. రైతును చిన్న వ్యాపారిగా మార్చేసి వారి ఎదుట భారీ వ్యాపార సామ్రాజ్యవేత్తలైన అదానీ, అంబానీలను నిలబెట్టింది. అత్యంత బలహీనులైన రైతులను అతిపెద్ద భాగస్వామితో ఒప్పందం చేసుకొనే పరిస్థితి కల్పించింది. వారితో వ్యవహారంలో రైతు ఎన్నడూ గెలిచే పరిస్థితి ఉండదు.
వ్యవసాయ చట్టాలు ఆర్డినెన్స్‌ల రూపంలో 6 నెలల క్రితమే వచ్చాయి. అప్పుడే ఇంత పెద్ద ఆందోళన ఎందుకు చేయలేదు?
ఆర్డినెన్సులు రైతుల పాలిట మృత్యుఘంటికలని మేం మొదటి రోజు నుంచీ ఆందోళన చేస్తూనే ఉన్నాం. కానీ మీరే చూడలేదు. ప్రభుత్వం, మీడియా కలిసికట్టుగా రైతు ఉద్యమాన్ని తక్కువ చేసిచూపే ప్రయత్నం జరిగిందన్నది నా ఆరోపణ. పంజాబ్‌కే పరిమితమైన స్థానిక ఉద్యమమని, ఎక్కువ కాలం నిలవదని కూడా ప్రచారం చేశారు. ఆర్డినెన్స్‌లు జారీ చేసిన రోజున అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు వేల ప్రాంతాల్లో వాటి ప్రతుల దహనం జరిగింది. అప్పటి నుంచి పోరాటాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రైతు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాల వెనకున్న దురుద్దేశాల గురించి చెబుతూ వచ్చాం.
రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులకు తగినట్లుగా చట్టాలు సవరించుకోవచ్చని కేంద్రం చెబుతోంది కదా?
వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పుడు కేంద్రం చట్టాలెందుకు చేసింది? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలకు సవరణలు చేసుకొనే స్వేచ్ఛ ఉన్నప్పుడు కేంద్రం చట్టాలు చేయాల్సిన పనేంటి? ఆర్థికంగా శక్తిమంతులైన అదానీ, అంబానీలకు చెందిన వ్యాపార సంస్థలను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే ప్రధాన ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి సమయంలో హడావుడిగా ఆర్డినెన్స్‌లను, చట్టాలను తీసుకొచ్చింది. అదానీ, అంబానీల ఒత్తిడీ దీని వెనుక ఉంది.
చట్టాలు రద్దుచేయాలన్న ఏకైక డిమాండ్‌తో తొలి నుంచీ నినదిస్తూ వస్తున్న మీరు మధ్యేమార్గ పరిష్కారం కోరుకోనప్పుడు కేంద్రంతో చర్చలకు ఎందుకు వెళ్లారు?
చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం ప్రజాస్వామ్య ప్రధాన లక్షణం. చట్టాల్లోని లోపాలను ప్రభుత్వానికి చెప్పి రద్దుచేయించాలన్న ఉద్దేశంతో చర్చలకు సిద్ధమయ్యాం. రైతులతో కానీ, రైతు సంఘాలతో కానీ ఒక్కదఫా కూడా చర్చలు జరపకుండానే కేంద్రం ఈ చట్టాలు తీసుకొచ్చింది. ఎవరి సంక్షేమం కోసం చట్టాలు చేశామని చెబుతున్నారో వారికేం కావాలో అడగకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. కార్పొరేట్ సంస్థల నిర్దేశం మేరకు బ్యూరోక్రాట్లు బిల్లులు రూపొందించారు. ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. మేం ప్రభుత్వం మాదిరి చర్చలకు దూరంగా ఉండాలనుకోలేదు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలనే అమలుచేస్తున్నాం. కొత్తగా చేసిందేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది కదా?
2011లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి మిగతా ముఖ్యమంత్రులు చెప్పిన విషయాలను ప్రచారం చేస్తున్నారు. చట్టాల్లో చిన్నచిన్న దోషాలుంటే సవరణ చేయొచ్చు. కానీ ఉద్దేశమే తప్పు అయినప్పుడు వాటిని కొనసాగించడానికి వీల్లేదు. స్వల్ప సవరణలు అందుకు సరిపోవు. కొత్తచట్టాలు తీసుకురావాలంటున్నాం. ఇప్పటికే అదానీ, అంబానీలు రాష్ట్రాల్లో భూములుకొని గోదాములు నిర్మించడం మొదలుపెట్టారు.
ప్రైవేటు గోదాముల్లో ధాన్యాన్ని నిల్వచేసి విక్రయిస్తే తప్పేంటి?
చెప్పడానికి ఈ మాటలు బాగానే ఉంటాయి. ఆ పని ప్రభుత్వమే ఎందుకు చేయదు. రూ.25వేల కోట్ల వ్యయంతో సెంట్రల్ విస్టా నిర్మించడానికి బదులు గోదాములు ఎందుకు నిర్మించడంలేదు. కార్పొరేట్ సంస్థలకు రూ.6 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దుచేసే ప్రభుత్వం రూ.లక్ష కోట్లను ధాన్యం నిల్వలకు ఖర్చు చేయలేదా? రైతుల సమస్యలనూ ప్రత్యేక కోణంలో చూడాలి. బలహీనులకు ప్రభుత్వ అండ అవసరం. అది చేయకుండా వారిని మార్కెట్ శక్తులకు ఆహారంగా విసిరేస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో కార్పొరేట్ శక్తులు బలంగా ఉన్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత అవి మరింత బలోపేతమయ్యాయి.