ఝార్ఖండ్ రాజధాని రాంచీలో.. కిలో జీడిపప్పు ధర 600 నుంచి 900 రూపాయల వరకూ ఉంటుంది. అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అదే జీడిపప్పు 20 నుంచి 30 రూపాయలకే కిలో దొరుకుతుందంటే నమ్ముతారా? జంతారాలోని నాలా బ్లాక్లో జీడిమామిడి సాగు చేస్తారు. ఇక్కడ 50 ఎకరాల్లో ఆ తోటలుంటాయి. ఏటా పెద్దమొత్తంలో ఉత్పత్తయ్యే పచ్చి జీడిపప్పును స్థానికంగా తక్కువ ధరకే విక్రయిస్తారు.
" 49 ఎకరాల్లో జీడిమామిడి తోటలున్నాయి. 30 నుంచి 35 వేల చెట్లున్నాయి. దుబే అనే వ్యక్తి కాంట్రాక్టు తీసుకున్నాడు. మొదట్లో పచ్చి జీడిపప్పు 10 నుంచి 20 రూపాయలకు కిలో చొప్పున అమ్ముడయేది. ఇప్పుడ ధర పెరిగింది. 30 నుంచి 40 రూపాయలకు అమ్ముతున్నారు."
- రామకృష్ణ దాస్, స్థానికుడు
జీడిపప్పు సాగును ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలతో మూడేళ్ల కాంట్రాక్టు ఇస్తోంది. తక్కువ సమయం ఉండడంతో కాంట్రాక్టర్లు చెట్లకు సరైన రక్షణ కల్పించకపోవడం, జీడిపిక్కలను చెట్లపైనుంచే దొంగలు చోరీ చేయడం లాంటి కారణాల వల్ల ఉత్పత్తి దెబ్బతింటోంది.
ఏటా 50 నుంచి 60 క్వింటాళ్ల జీడిపప్పు ఉత్పత్తవుతోంది. జిల్లాలో ప్రాసెసింగ్ సదుపాయాలు లేక పోవడం వల్ల పచ్చి జీడిపప్పునే పశ్చిమబంగాకు తరలిస్తారు. దానిని కాంట్రాక్టర్లు 150 రూపాయలకి కిలో చొప్పున విక్రయిస్తారు. ప్రాసెసింగ్ తర్వాత ధర కొన్నిరెట్లు పెరుగుతుంది. ప్రభుత్వం సహకారమందిస్తే తమ జీవితాల్లో మార్పొస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
" జీడిమామిడి తోటల కాంట్రాక్టులు.. 2018 నుంచి 2020 వరకూ, మూడేళ్ల వ్యవధితో ఉన్నాయి. ఈ సారి పంట బాగానే చేతికొచ్చింది. పచ్చి జీడిపప్పు గింజలు బెంగాల్‌కు తరలిస్తాం."