తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి కరోనా మోత... దేశంలో పెరిగిన కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తాజాగా ఈ కేసుల సంఖ్య 606కి చేరింది. ఒక్కరోజులో కొత్తగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీనితో ఈ వైరస్​ను నియంత్రించేందుకు, రోగులకు ఉపశమనం కలిగించేందుకు సైనిక ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.

corona cases in india
భారత్​లో 613కి చేరిన కరోనా కేసుల సంఖ్య

By

Published : Mar 26, 2020, 5:23 AM IST

దేశంలో కరోనా (కొవిడ్‌-19) కేసుల ఉద్ధృతి ఒక్కసారి పెరిగిపోయింది. మంగళవారం వరకు 523 మంది ఈ వైరస్‌ బారిన పడగా బుధవారం సాయంత్రానికి అది ఒక్కసారిగా 606కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 10 మంది మరణించారు. ఒకేసారి ఇన్ని పాజిటివ్‌ కేసులు రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆసుపత్రుల్లో అదనపు పడకల్ని సిద్ధం చేయించాలని నిర్ణయించి, తక్షణం ఆ ఏర్పాట్లు ప్రారంభించింది. సైనిక, కేంద్ర పారామిలిటరీ బలగాల ఆసుపత్రులకు చెందిన 1890 పడకలను కరోనా బాధితుల కోసం అత్యవసరంగా కేటాయించింది. హైదరాబాద్‌, బెంగళూరు సహా వేర్వేరు ప్రాంతాల్లో 32 ఆసుపత్రుల్లో ఈ పడకలు ఉన్నాయి.

హెల్ప్​లైన్ ఏర్పాటుచేయాలి..

ప్రధాని పిలుపునిచ్చిన మేరకు దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్‌ బుధవారం నుంచి ప్రారంభమయింది. నిత్యావసరాల కోసం ప్రజలు పలుచోట్ల బారులు తీరారు. ఈ నేపథ్యంలో వస్తువుల లభ్యతను నిర్ధరించడానికి కంట్రోల్​ రూమ్, హెల్ప్​లైన్​ నంబర్​ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ... రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

అంకెల సవరణ

దేశంలో ఇంతవరకు 10 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినా దిల్లీలో ఒక వృద్ధుడి కన్నుమూతకు కరోనా కారణం కాదని తేలాక ఆ మేరకు అంకెను సవరించింది. మహారాష్ట్రలో మూడో వ్యక్తి మరణించినట్లు ముంబయి నగరపాలక సంస్థ చేసిన ప్రకటననూ కేంద్రం పరిగణనలో తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులోని మదురైలో ఒకరు (54 ఏళ్ల పురుషుడు), మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒకరు (65 ఏళ్ల మహిళ) బుధవారం కరోనాతో చనిపోగా మొత్తం మృతుల సంఖ్య మళ్లీ పదికి చేరింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నవరాత్రి ఉత్సవాలకు పలువురు భక్తులు నేరుగా హాజరుకాకుండా తమ పేర్లను ఫోన్ల ద్వారా పూజారులకు చెప్పి, పూజలు చేయించుకున్నారు.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 122కి చేరుకుంది. వీరిలో ఇప్పటికి ఇద్దరు కోలుకున్నారని ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 932 మంది ఆస్పత్రుల్లో, 14,502 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు.

కేరళ

కేరళలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 112కి చేరింది.

గోవా

గోవాలో మొదటిసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యక్తులు యూఎస్​ఏ, స్పెయిన్​, ఆస్ట్రేలియాల నుంచి ఇటీవలే దేశానికి వచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

తమిళనాడు

తమిళనాడులో కొత్తగా 3 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీనితో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 28కి చేరింది.

గుజరాత్​

గుజరాత్​లో కరోనా మరణాల సంఖ్య 2కి చేరింది. బుధవారం మరణించిన 85 ఏళ్ల మహిళ ఇటీవలే సౌదీ అరేబియా నుంచి భారత్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు 39కి చేరాయి.

కర్ణాటక

రాష్ట్రంలో నిన్న 75 ఏళ్ల మహిళ చనిపోయినట్లు వచ్చిన వార్తలు వచ్చాయి. అయితే ఆమె కరోనాతో మరణించిందో లేదో తెలిపే టెస్ట్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 51 కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మరణించారు. కాగా మరో ముగ్గురు డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ తెలిపింది.

మధ్యప్రదేశ్​

మధ్యప్రదేశ్​లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన 65 ఏళ్ల మహిళ కరోనాతో మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 15... కొవిడ్​ 19 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కరోనా: జీ20 సదస్సుపైనే అందరి దృష్టి

ABOUT THE AUTHOR

...view details