కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అక్కడే నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, సెలవుల్లేకుండా రాత్రింబవళ్లు పనిచేసిన సిబ్బందికి కాస్త విశ్రాంతి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 2000 మంది (20 కంపెనీలు) కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) తమ రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.
"మా రాష్ట్ర పోలీసులు లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో భాగంగా రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఇప్పుడు రంజాన్ పర్వదినం సమీపిస్తోంది. దీంతో శాంతి భద్రతలను సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్‌డౌన్‌లో విధులు నిర్వహించిన ఇక్కడి పోలీసులకు కొంత విశ్రాంతి అవసరం. అందుకే 20 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరాం"