కొవిడ్-19ను నియంత్రించేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్నాయని గుర్తించిన ఔషధాలను ఇక్కడే తయారు చేయడంతో పాటు, వైరస్ శరీరంలోకి చేరినా నిరోధించే వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించామన్నారు. ఇందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగశాలలు పరిశోధనలు చేస్తున్నాయని, అందులో ఐఐసీటీ ఒకటని చెప్పారు. కొవిడ్-19 పరీక్షలు, ప్రస్తుతమున్న సవాళ్లు, ఔషధాల తయారీ పురోగతిపై ఆయన రాజ్యసభ టీవీతో మాట్లాడారు.
రివర్స్ ఇంజినీరింగ్‌లో...
కొవిడ్-19 కారక కరోనా వైరస్ వచ్చి నాలుగు నెలలు దాటింది. ఇంతత్వరగా మందులు, వ్యాక్సిన్లు కనుగొనడం కష్టసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయని గుర్తించిన ఔషధాల్లో కొన్నింటిని రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో ఐఐసీటీలో తయారుచేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త ఔషధం తయారుచేస్తే, దానికి పేటెంట్ ఉన్నప్పటికీ.. వారు చేసిన విధానం(ప్రాసెస్)లో కాకుండా మనం మార్చి వేరే విధానంలో చౌక ధరలో దాన్ని తయారు చేస్తున్నాం. జనరిక్ మందుల తయారీ రివర్స్ ఇంజినీరింగే. ప్రపంచంలో ఎక్కడ ఔషధం కనుగొన్నా, వ్యాక్సిన్ తయారు చేసినా భారత్‌లో ఉత్పత్తి కావాల్సిందే. భారత్‌లో వేర్వేరు దేశాల ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఉత్పత్తి ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉండటం మనకు కలిసొచ్చే అవకాశం.