చదివింది ఏడో తరగతే. అయితేనేం... ఎంటెక్ విద్యార్థులకు ప్రయోగ పాఠాలు చెప్పే నైపుణ్యాలు తన సొంతం. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోయే అందరికీ.. పద్మాకర్ జీవితం ఆదర్శం. గాల్లో ఎగరాలన్న కల సాకారం చేసుకునేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే నిర్మించేందుకు పూనుకున్న శాస్త్రవేత్త ఆయన. పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించాలన్న సామాజిక బాధ్యతతో పెట్రో, డీజిల్ రహిత వాహనాల సృష్టికర్తగా నిలిచిన పర్యావరణ సైనికుడు ఈ పద్మాకర్.
పద్మాకర్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. పుట్టుకతోనే ఓ చర్మవ్యాధి బారిన పడిన పద్మాకర్... తోటి విద్యార్థులు గేలి చేయడంతో ఏడో తరగతితోనే చదువుకు దూరమయ్యాడు. క్రమంగా మెకానిక్ పాఠాలు స్వయంగా నేర్చుకున్నాడు. మోటార్ బైక్ అయినా, హెలికాప్టర్ అయినా... ఏ యంత్రం మొరాయించినా ఆయన చేయి పడితే స్టార్ట్ అవ్వాల్సిందే. అంతలా నైపుణ్యం సంపాదించాడు. చిన్న మెకానిక్‌గా ప్రస్థానం ప్రారంభించి, నేరుగా వాహనదారుల ఇంటికే వెళ్లి సేవలు అందించేవాడు.
"17 సంవత్సరాలు తిరుపతిలోని గ్యారేజీలో పనిచేశాను. తర్వాత కాకినాడ వచ్చేశాను. వైజాగ్ వచ్చి 25 సంవత్సరాలైంది. దాదాపు 18 ఏళ్లు షిప్స్ మీద పనిచేశాను. 1200 షిప్స్‌తో పనిచేశాను. మొట్టమొదటి పరిశోధనగా బ్యాటరీ బైక్ తయారుచేశాను. అది చేసి, 13 సంవత్సరాలైంది."
-పద్మాకర్, శాస్త్రవేత్త.
వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు తనవంతు బాధ్యతగా... బ్యాటరీతో నడిచే కారును రూపొందించాడు పద్మాకర్. అప్పటినుంచీ బ్యాటరీ, సౌరశక్తితో నడిచే 600 వాహనాలు తయారు చేశాడు. తెలుగురాష్ట్రాల్లోని వందలాది ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ప్రయోగ పాఠాల కోసం ఆ వాహనాలు ఉపయోగపడుతున్నాయి.
"గాల్లో 20 అడుగుల ఎత్తు వరకూ అనుమతి ఉంది. అతి త్వరలో ఎగరాలని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని, ఎగరాలన్న కోరిక నాకుంది. విశాఖపట్నానికి పేరు తేవాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పాలన్న చిరకాల వాంఛ ఉంది నాకు."
-పద్మాకర్, శాస్త్రవేత్త.
విశాఖపట్నంలో భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు మొరాయిస్తే పద్మాకర్ మరమ్మతులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ హెలికాప్టర్‌ను తయారుచేసి, విశాఖ వీధుల్లో తిప్పడమే జీవితాశయమని చెప్తున్నాడు ఈ పెద్దాయన. తన ఆవిష్కరణల కోసం పద్మాకర్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశాడు.