తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా ఆశలు రెండు గంటల్లోనే ఆవిరి! - చైనాకు రెండు గంటల్లో చెక్​ పెట్టిన భారత దళాలు

సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతుంటే.. ఆ లోపే రహస్యంగా సరిహద్దుల్లో రొడ్డేయాలన్న చైనా కట్రను భారత దళాలు భగ్నం చేశాయి. మాల్డో-రజాంగ్‌లాకు రోడ్డు వేసేందుకు సరంజామాతో బలద్దేరిన చైనా మూకకు.. అనూహ్యంగా భరత దళాలు దర్శనమిచ్చి షాకిచ్చాయి. భారత సైన్యాన్ని బెదిరించేదుకు ప్రయత్నించినా వారి పన్నాగాలేవి నెగ్గక పోవడం వల్ల తట్టబుట్ట సర్దుకుని క్యాంపులకు తిరిగి వెళ్లాయి చైనా దళాలు. కేవలం రెండు గంటల్లోనే చైనా ప్లాన్​ను తిప్పికొట్టాయి భారత దళాలు. అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ చేపట్టడం గమనార్హం.

Border Issue Between India and China
రెండుగంటల్లో చైనాకు చెక్​ పెట్టిన భారత్

By

Published : Sep 6, 2020, 1:59 PM IST

'మనోళ్లు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తున్నారుగా.. మనం ఈ లోపు రోడ్డేసేద్దాం.. అప్పుడు భారత్‌ ఎంత అరిచి గీపెట్టినా వెనక్కి తగ్గొద్దు..' ఇది ఆగస్టు 31కి ముందు చైనా దళాల ప్లాన్‌.. ఆ రోజు రాత్రి మాల్డో-రజాంగ్‌లాకు రోడ్డు వేసేందుకు అవసరమైన సరంజామాతో శిబిరం నుంచి బయల్దేరిన చైనా దళాలకు గట్టి షాక్‌ తగిలింది. మిలమిలలాడే రాకెట్‌ లాంఛర్లతో భారత దళాలు కనిపించాయి. ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా భారత్‌ బెదరకపోవడం వల్ల హెచ్చరికగా కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. గల్వాన్‌ వద్ద భారత్‌ చేసిన ప్రతిదాడి గుర్తొచ్చిందో ఏమో చైనా దళాలు కాళ్లీడ్చుకొంటూ తిరిగి తమ స్థావరానికి చేరుకున్నాయి. ఈ ఆపరేషన్‌ మొత్తాన్ని కేవలం 120 నిమిషాల్లో ముగించింది.

ఆలోచనా తీరు మారడం వల్లే...

గల్వాన్‌ ఘటనకు ముందు భారత్‌ దళాలు కొంత ఆత్మరక్షణ శైలిని అనుసరించేవి. 1962 యుద్ధం తర్వాత భారత్‌ అనుసరించే ఈ శైలిని చైనా వాడుకుంది. తరచూ మన భూభాగాలను చిన్నచిన్న ముక్కలుగా ఆక్రమించడం మొదలుపెట్టింది. గల్వాన్‌ ఘటన తర్వాత జులై 3న ప్రధాని మోదీ లద్దాక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నార్తన్‌ కమాండర్‌ వైకే జోషీ, 14 క్రాప్స్‌ జీఓసీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ దశలో ప్రధాని ‘చైనా ఏం చేసింది.. ఏం చేయబోతోందో నాకు అనవసరం.. మీరు ఏం చేశారు.. ఏం చేయబోతున్నారనే దానిపైనే నాకు ఆసక్తి’ అని తేల్చిచెప్పారు. అనంతరం మోదీ 17 క్రాప్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్మీలో మౌంటేన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ ఇదొక్కటే. చైనాతో డీల్‌ చేయడానికి దీనిని అక్కడకు తరలించారు.

మోదీ పర్యటన ఓ రకంగా భద్రతా దళాలకు స్వేచ్ఛనిచ్చింది. అప్పటి నుంచి వ్యూహం మారిపోయింది. చైనా ఆధీనంలోని భూభాగాన్ని విడిపించాలంటే.. చైనాకు కీలకమైన చోట మనం పట్టుబిగించాలని నిర్ణయించారు. చైనాకు కీలకమై ఎత్తయిన పర్వత శిఖరాలను భారత్‌ ఆధీనంలోకి తీసుకురావాలనుకున్నారు. దీనికి ఆర్మీచీఫ్‌ ముకుంద్‌ నరవాణేకు గతంలో చైనాను డీల్‌ చేసిన అనుభవం ఉంది. అది భారత్‌ వ్యూహాలకు బాగా ఉపయోగపడింది. మన దళాలు నిశ్శబ్ధంగా ఓ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇది కేవలం అత్యున్నత స్థాయిలో వారికి మాత్రమే తెలుసు. ఆ ఆపరేషన్‌లో పాల్గొనే దళాలకు కూడా ఏం చేయబోతున్నారో తెలియదు. మెల్లగా ఎల్‌ఏసీ వెంట భారత్‌ అదనపు బలగాలను తరలించడం మొదలుపెట్టింది. మరోపక్క భారత నావికాదళం మలక్కా జలసంధికి వెళ్లే మార్గాల్లో గస్తీని ముమ్మరం చేసింది. అప్పటికే ఉన్న మౌంటేన్‌ స్ట్రైక్‌ డివిజన్‌కు అదనంగా మరింత పర్వయోధులను రంగంలోకి దించింది. వీరందరినీ ఆపరేషన్‌కు సిద్ధం చేసే బాధ్యతను జీఓసీ 17 క్రాప్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సవ్‌నీత్‌ సింగ్‌కు అప్పజెప్పారు. వీరే కాదు.. వివిధ విభాగాలకు చెందిన దళాలు భారీగా లద్దాక్‌ చేరడం మొదలైంది.

విఫలమైన కాలయాపన

చర్చలతో కాలయాపన చేయాలని చైనా వ్యూహం పన్నింది. పాంగాంగ్‌ వద్ద ఫింగర్‌ 4, 5ను చైనా వీడే విషయమై చాలా రౌండ్లపాటు చర్చలు జరిగినా అవి విఫలం అవుతూ వచ్చాయి. అనుకున్నట్లే జరుగుతుండటం వల్ల చైనా మితిమీరిన ఆత్మవిశ్వాసంలోకి వచ్చింది. కొవిడ్‌, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న భారత్‌కు ఈ దళాల మోహరింపు తలకు మించిన భారంగా మారి.. ఇక చేతులు ఎత్తేస్తుందని భావించింది. ఒక్క తూటా కాల్చకుండానే విజయం సాధించొచ్చని అంచనా వేసుకొంది. కానీ, దీనికి భిన్నంగా.. భారత్‌ కూడా చైనానే బేరానికి వచ్చేట్లు చేయాలని నిర్ణయించింది. అందుకే ఈ సారి సరస్సుకు దక్షిణ ఒడ్డున ఎత్తైన శిఖరాలను లక్ష్యంగా చేసుకొంది.

ఆగస్టులో వేగంగా మార్పులు..

ఆగస్టు నాటికి మౌంటేన్ డిజిన్‌ జవాన్లు అక్కడి పరిస్థితులకు అలవాటుపడిపోయారు. దీనితోపాటు చైనా కదలికలపై నిఘాపెట్టారు.. వస్తున్న సమాచారం ఆధారంగా ప్రణాళికల్లో మార్పులు చేసుకున్నారు. ఆగస్టు 24న ఒక ప్లాన్‌ అమలు చేయడానికి అత్యున్నత నాయకత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. అదే సమయంలో భారత్‌ దేనికైనా సిద్ధంగా ఉందని.. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. మరోపక్క క్షేత్రస్థాయిలోని కంపెనీ కమాండర్లు, ప్లాటూన్‌ కమాండర్లు తామ ప్లాన్‌ అమలుకు అవసరమైన మార్గాలను గుర్తించి..వాటికి సమీపంలోనే మోహరించారు. కీలక బ్లాక్‌ టాప్‌, హెల్మెట్‌ టాప్‌ శిఖరాల స్వాధీనాన్ని కేవలం 120 నిమిషాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పదాతి దళాన్ని చైనా వాయుసేన విమానాలు అడ్డుకొంటే ఎదుర్కొనేందుకు ఇగ్లా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను సిద్ధం చేశారు. కొన్ని దళాలు పర్వత పదాల హైమొబిలిటీ వాహనాలను సిద్ధంగా ఉంచాయి.

రెండు గంటల్లోనే..

ఉన్నతాధికారుల నుంచి అమలుకు ఆదేశాలు వెలువడగానే స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ దళాలు 120 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కీలకమైన శిఖరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం దాదాపు 2,000 మందితో కూడిన డిజిన్‌ ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. వీరి వద్ద ఫ్రాన్స్‌ తయారు చేసిన మిలన్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌, కార్ల గుస్తోవ్‌ రాకెట్‌ లాంఛర్లు ఉన్నాయి. ఇవి చైనా వాహనాలను తునాతునకలు చేయగలవు.

అదే సమయంలో మాల్దోలోని స్థావరం నుంచి బయల్దేరిన చైనా దళాలు మార్గం మధ్యలో భారత దళాలను చూసి ఖంగుతిన్నాయి. అయినా ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడం వల్ల భారత్‌ వైపు నుంచి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీనితో చైనా దళాల భ్రమలు పటాపంచలై వాస్తవంలోకి వచ్చాయి. వాస్తవానికి డ్రాగన్‌ బలగాలు మాల్డో నుంచి రజంగ్‌ లా వరకు రహదారిని నిర్మించి తమ పట్టు పెంచుకోవాలనుకున్నాయి. ఇది పూర్తిఅయితే స్పంగూర్‌ వద్ద డ్రాగన్‌ పట్టు పెరిగిపోతుంది. కానీ, భారత దళాలు పూర్తిస్థాయి ఆయుధాలతో అక్కడ దర్శనమివ్వడం వల్ల తిరిగి మాల్డో స్థావరానికి వెళ్లిపోయాయి. ఫలితంగా దాదాపు యాభైఏళ్ల తర్వాత చైనా నేర్పిన విద్యను భారత దళాలు దానికే రుచి చూపించాయి. ఇప్పుడు చర్చల టేబుల్‌ వద్ద భారత్‌ కూడా బలంగా బేరం చేసే అవకాశం దక్కింది.

ఇదీ చూడండి:శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details