శ్మశానం.. ఈ పేరు వింటేనే భయపడేవాళ్లు చాలా మంది. కానీ ఆ గ్రామంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రోజూ శ్మశానానికి వెళ్తారు. ఇదేంటి శ్మశానవాటికకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? నిజానికి అదొక నందనవనం. రకరకాల పువ్వులు, ఔషధ మొక్కలతో చూడటానికి రమ్య మనోహరంగా ఉండే ఓ బృందావనం.
ఆ శ్మశానం ఓ నందనవనం.. భయం లేని బృందావనం ఒడిశా కుర్దా జిల్లా దింగారా గ్రామంలో ప్రజలు ఏళ్ల నాటి భయాలను పక్కన పెట్టి ధైర్యంగా శ్మశానవాటికనే ఓ పార్కుగా తయారు చేశారు. ఎక్కడ చూసినా పచ్చదనంతో కనువిందు చేసే ఈ నందనవనం అక్కడున్న వారందరికీ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వారి బాధలు, మనోవేదనను మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా గడిపేందుకు గ్రామస్థులు ఇక్కడికి వస్తారు.
యోగా...
కొంతమంది తమకు ఖాళీ దొరికిన ప్రతిసారి ఈ శ్మశానానికి వచ్చి యోగా, ప్రాణాయామం చేస్తుంటారు. శ్మశానం అంటే ఉండే భయం, ఆందోళనలు ఇక్కడ ఎంతమాత్రం కనిపించవు.
కాలుష్య రహితం...
హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇక్కడ ఒక గొయ్యి ఏర్పాటు చేశారు. ఓ మృతదేహాన్ని కాల్చేందుకు కేవలం 50 కిలోల కట్టెలు సరిపోతాయి. వాటితో పాటు గుగ్గిలం, నెయ్యి, గంధపు చెక్క, పత్తి వంటి సామగ్రిని వాడటం వల్ల ఇక్కడ ప్రదేశం కాలుష్యరహితంగా ఉంటుంది.
అయితే చితాభస్మాన్ని పారబోయకుండా అక్కడున్న మొక్కలు, చెట్లకు ఎరువులు కింద వాడతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దెయ్యాలు, భూతాలు వంటి భయాలను పారదోలి అందరూ ఈ పార్కుకు వచ్చేలా గ్రామస్థులు దీనిని తీర్చిదిద్దారు. నిజానికి ఇక్కడున్న పరిశుభ్రత ఎక్కడా కనిపించదు. అయితే ఈ శ్మశానవాటిక ఊరి చివర ఉండటం వల్ల గ్రామస్థులు వెళ్లి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. వెళ్లే దారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సేద తీరేందుకు ఒక వసతి గృహాన్ని కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.