తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖట్టర్​ 2.0: హరియాణాలో కొలువుదీరిన ప్రభుత్వం

హరియాణా ఎన్నికల్లో 40 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా.. జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండోసారి ముఖ్యమంత్రిగా మనోహర్​లాల్​ ఖట్టర్​ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్​ చౌతాలా ప్రమాణం చేశారు.

హరియాణాలో కొలువుదీరిన ప్రభుత్వం

By

Published : Oct 27, 2019, 2:26 PM IST

Updated : Oct 27, 2019, 3:00 PM IST

హరియాణాలో భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు మనోహర్​లాల్​ ఖట్టర్​. ఆయనతో పాటు జననాయక్​ జనతా పార్టీ అధినేత దుష్యంత్​ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్​ సత్యదేవ్​ నరన్​ ఆర్య వారి చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు క్రిష్ణ పాల్​ గుర్జార్​, ఆర్​ఎల్​ కటారియా, పంజాబ్​ గవర్నర్​ వీపీ సింగ్​ బద్నోర్​, ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్​ రావత్​, జైరాం ఠాకూర్​, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్​ బాదల్​, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్​ సింగ్​ హుడా, జేజేపీ నేత అజయ్​ చౌతాలా సహా ముఖ్యనేతలు హాజరయ్యారు.

జేజేపీ మద్దతుతో ఉత్కంఠకు తెర...

హరియాణా శాసనసభ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచింది. కాంగ్రెస్​ కూడా సరిపోయే సీట్లు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో 10 స్థానాలు కైవసం చేసుకున్న జననాయక్​ జనతా పార్టీ (జేజేపీ) కీలకంగా మారింది. ఎనిమిది మంది స్వతంత్రులు భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు తెలిసినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటులో స్పష్టత రాలేదు. ఈ సందర్భంగా జేజేపీ ఎవరికి మద్దతు ఇస్తుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘ చర్చల అనంతరం భాజపాకే జై కొట్టారు జేజేపీ అధినేత దుష్యంత్​ చౌతాలా. ఆయన మద్దతుతో ఉత్కంఠకు తెరపడింది. భాజపాకు ముఖ్యమంత్రి పదవి, జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

జేజేపీ సహా పలువురు స్వతంత్రులు భాజపాకు మద్దతు పలకటం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మనోహర్​లాల్​ ఖట్టర్​ను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. హరియాణా ముఖ్యమంత్రి పీఠాన్ని రెండోసారి అధిరోహించారు ఖట్టర్​.

ఎవరికి ఎన్ని స్థానాలు...

90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరంకాగా భాజపా 40 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ 31 స్థానాల్లో గెలుపొందగా.. జన్‌నాయక్‌ జనతా పార్టీ 10 చోట్ల, ఐఎన్‌ఎల్‌డీ ఒక స్థానంలో నెగ్గింది. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలకు 8 స్థానాలు దక్కాయి.

పార్టీ గెలిచిన స్థానాలు
భాజపా 40
కాంగ్రెస్ 31
జేజేపీ 10
ఐఎన్​ఎల్​డీ 1
ఇతరులు 8
మొత్తం 90

ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

Last Updated : Oct 27, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details