అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత పర్యటనను విజయవంతంగా ముగించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రోడ్డు షో సందర్భంగా, అలాగే మోతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రజలు అమెరికా అధ్యక్షుడికి ఉత్తేజకర రీతిలో, భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు అభివందనాలు తెలిపేందుకు ప్రజలు పెద్దయెత్తున తరలివచ్చారు. ఒక అమెరికా అధ్యక్షుడికి మనదేశంలో భారీస్థాయిలో స్వాగతం లభించడం ఇదే తొలిసారి కాదు. 1959లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ తన భారత పర్యటన సందర్భంగా, దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో లక్షల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అందుకని, మోతేరా కార్యక్రమం గతంలో జరిగిన భారీ స్వాగతాలకు కొనసాగింపు వంటిదే. అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ అమెరికా హ్యూస్టన్‌లో నిర్వహించిన భారీ సభ, 2017లో నాటి జపాన్ ప్రధాని షింజో అబె భారత్‌లో పర్యటించినప్పుడు అహ్మదాబాద్‌లో చేపట్టిన భారీ రోడ్డు షో కూడా ఈ తరహా కార్యక్రమాలే.
ఒప్పందాల్లో సంక్లిష్టత
భారత్ విషయానికొస్తే, అమెరికాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వస్తూత్పత్తులు, సేవల వాణిజ్య సరళిని పరిశీలిస్తే, 2018లో భారత్-అమెరికా వాణిజ్యం 142.6 బిలియన్ డాలర్ల మేర జరిగింది. అదే చైనాతో గత కొన్నేళ్లుగా సగటున భారత్ సుమారు 50 బిలియన్ డాలర్ల మేర సరకుల వాణిజ్య లోటును కలిగి ఉండగా, అమెరికాతో సుస్థిర వాణిజ్య మిగులు పొందుతోంది. మనం అమెరికాతో వాణిజ్య సంబంధాల్ని మెరుగుపరచుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నామనే ప్రశ్నకు... వాషింగ్టన్, బీజింగ్‌లతో ఇండియా వాణిజ్యాన్ని సరిపోల్చడం ద్వారా సమాధానం లభిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఖరారు చేసుకోవడానికి ఇండియా-అమెరికాలు తీవ్రస్థాయిలో సంప్రతింపులు జరుపుతున్నాయి.
ఇటీవల ట్రంప్ పర్యటన సందర్భంగా సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఇది త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు జరుపుతున్న దేశాల మధ్య భిన్న తరహా ఆర్థిక వ్యవస్థలు ఉంటే, చాలా సందర్భాల్లో సంప్రతింపుల ద్వారా వాణిజ్య ఒప్పందాలు విజయవంతమవుతుంటాయి. భారత్, అమెరికాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒక వాణిజ్య ఒప్పందం ఖరారులో ఆలస్యానికి అనేక కారణాలు ఉండొచ్చు. ట్రంప్ న్యూయార్క్ నేపథ్యం నుంచి వచ్చినా, అతని రాజకీయ పలుకుబడి గ్రామీణ అమెరికాలోనే ఉంది. ఫలితంగా, ట్రంప్ ఇతర దేశాల నుంచి వ్యవసాయ రంగానికి భారీ రాయితీలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వ్యవసాయ, పాడి రంగాల్లో రాయితీలు కల్పించడం భారత్ వంటి దేశాలకు ఇబ్బందికర పరిణామమే.
అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దుదాం...
ట్రంప్ సంప్రతింపుల శైలి కూడా కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతోంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాభవం క్షీణించడంపై చింతిస్తున్న భారీ వర్గం ఆ దేశంలో ఉంది. అమెరికా సమాజంలో నెలకొన్న ఇలాంటి ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే ‘అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దుదాం’ అనే నినాదాన్ని ట్రంప్ తలకెత్తుకున్నారు. తన దేశంలో పరిష్కరించుకోవాల్సిన పలు సమస్యలు ట్రంప్ ముంగిట ఉన్నాయి. తాను అమెరికాకు అనుకూలంగా ఒప్పందాల్ని సాధించుకొచ్చానని చెప్పుకోవాల్సిన అవసరం ఈ ఎన్నికల ఏడాదిలో ట్రంప్‌కు చాలా ఉంది. ఇది వాణిజ్య ఒప్పందాల సంప్రతింపుల్లో సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడానికి కారణమవుతోంది. అమెరికా, భారత్‌ల మధ్య విశ్వాసం బలపడుతుండటంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థను భారత్‌కు బదిలీ చేసేందుకు అగ్రరాజ్యం ముందుకొస్తోంది.
60 శాతం వాటా రష్యా నుంచే...
సమగ్ర వైమానిక రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్)ను, సముద్రంలో రక్షణ అందించే డ్రోన్లను భారత్‌కు సమకూర్చడంలో సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా, ఎంహెచ్-60ఆర్ నావిక్, ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను భారత్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. భారత రక్షణ అవసరాలను తీర్చే విషయంలో అమెరికా అమ్మకాలు పెరుగుతున్నా, ఇప్పటికీ భారత రక్షణ కొనుగోళ్లలో 60 శాతం దాకా వాటా రష్యా నుంచే ఉంది. రాబోయే సంవత్సరాల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలక ఉత్పత్తులనైనా దేశీయంగా తయారు చేసుకోవడం భారత్ లక్ష్యం కావాలి. ఇరుదేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, వాణిజ్య, సమాచార మార్పిడికి వీలు కల్పించే ‘స్వేచ్ఛాయుత, విశ్వసనీయ, సురక్షిత అంతర్జాలం’ భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న అనుబంధంలో ఒక ఆసక్తికర కోణం. మన దేశంలో 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్ నిర్వహించుకోవడానికి చైనా హువావై కంపెనీకి ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, భారత్‌లో 5జీ సేవల నిర్వహణ విషయంలో చైనా కంపెనీలు తుది అనుమతులు పొందుతాయా అనేది వేచిచూడాల్సిన విషయం. అమెరికా అధ్యక్షుడితో పారిశ్రామిక వేత్తల సమావేశంలో రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 5జీ ట్రయల్స్ కోసం చైనా ఉపకరణాలేవీ ఉపయోగించని ఒకే ఒక్క నెట్‌వర్క్ రిలయన్స్ జియో అని పేర్కొనగా, ట్రంప్ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరం.
బ్లూడాట్ నెట్‌వర్క్...