డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఒక దేశ నాయకుడు చేయకూడని పనులన్నీ చేశారు. మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాలనే తేడా లేకుండా అందరితో వ్యాపార లడాయి పెట్టుకున్నారు. స్వదేశంలో సంపన్నులకు, కంపెనీలకు భారీగా పన్ను రేట్లు తగ్గించారు. దీనివల్ల వారు కొత్త పెట్టుబడులు పెట్టి- విరివిగా వ్యాపారాలు, పరిశ్రమలను ప్రారంభించి అమెరికన్లకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తారని ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ విధానాలు మట్టికరవక తప్పదన్న ఉదారవాద ఆర్థికవేత్తల సూత్రీకరణలు బోల్తాకొట్టాయి. నేడు అమెరికా పరిస్థితి దివ్యంగా ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. నిరుద్యోగ రేటు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 3.5 శాతానికి పడిపోయింది. దీన్ని పూర్తి ఉద్యోగితగా పరిగణిస్తారు. అందుకే నేడు దివ్యాంగులకు, నేర చరితులకు సైతం ఏదో ఒక ఉద్యోగం దొరుకుతోంది. దీనంతటి వల్ల 2020 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు పుష్కలమనే అంచనాలు ఊపందుకున్నాయి.
సంపన్నులపైన, కంపెనీలపైన పన్నులు తగ్గిస్తే ఉపాధి వ్యాపారాలు జోరందుకుని ప్రగతి ఫలాలు అట్టడుగు శ్రేణి ప్రజలకు చేరతాయనే వాదన ట్రంప్ విధానాలకు పునాది. మరి వాస్తవంలో అలా జరిగిందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ కార్పొరేట్ పన్నులు తగ్గించడం వల్ల కంపెనీల చేతిలో లక్షన్నర కోట్ల డాలర్ల సొమ్ము మిగిలిందని, అందులో కేవలం 20 శాతాన్ని కొత్త పెట్టుబడులు, నూతన ఉద్యోగాల సృష్టికి వెచ్చిస్తున్నారని ఒక అధ్యయనం సూచించింది. మిగులు నగదులో 50 శాతానికి పైనే వాటాదారులకు చేరుతోందని అన్ని అధ్యయనాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. పన్ను కోత వల్ల మిగిలిన నగదును కంపెనీలఉన్నతాధికారులే కైంకర్యం చేస్తూ కింది స్థాయి ఉద్యోగులకు బఠాణీలు విదిలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మిగులు నిధుల్లో సాధారణ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు రూపంలో ముట్టినది ఆరు శాతమేనని ఒక అధ్యయనం సూచిస్తే, గరిష్ఠంగా 20 శాతం అందిందని మరొకటి గణించింది. అసలు 1978 నుంచి 2018 వరకు నలభై ఏళ్లలో కంపెనీల ప్రధాన కార్యనిర్వహణాధికారుల (సీఈఓల) జీతభత్యాలు 940 శాతం పైకి ఎగబాకగా, సాధారణ ఉద్యోగుల జీతాలు 12 శాతమే పెరిగాయని మరో అధ్యయనం తేల్చింది. మరోవైపు జీడీపీలో ప్రభుత్వ విత్త లోటు 144 శాతానికి చేరనుంది. అమెరికాలో అంతకుముందు రొనాల్డ్ రీగన్, బ్రిటన్‌లో మార్గరెట్ థాచర్ చేపట్టిన విధానాల ఒరవడిలోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నడుస్తున్నారు. రీగన్, థాచర్‌ల మాదిరిగా ట్రంప్ విధానాలూ విపత్కరమని ఆర్థికవేత్తలు వాదిస్తున్నా, అవి ఎన్నికల్లో లబ్ధికి దారితీస్తాయని రాజకీయవాదులు భావిస్తున్నారు.
ప్రగతి ఫలాల మాటేమిటి?
భారత ప్రభుత్వమూ రాజకీయ, ఆర్థిక అనివార్యతల వల్ల కార్పొరేట్ పన్ను కోతల బాట పట్టింది. గతేడాది కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్త పరిశ్రమలకైతే పన్నును 15 శాతానికి పరిమితం చేసింది. పన్ను తగ్గింపు వల్ల భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలను పెంచుతాయని ఆశిస్తోంది. ఇక్కడ అమెరికా, ఐరోపా దేశాలకు, భారత్‌కు మధ్య ముఖ్యమైన తేడాను గమనించాలి. పాశ్చాత్య సంపన్నులు, కంపెనీలు తమ సంపదను స్వదేశంలోనే పెట్టుబడి పెట్టి మాతృభూమి అభ్యున్నతికి పాటుపడతాయి. భారత్‌లో జరుగుతోంది అందుకు ఎంతో భిన్నం. ఇక్కడి సంపదలో అత్యధికం నల్లధనంగా మారుతోందే తప్ప- అట్టడుగు జనాన్ని ఉద్ధరించడం లేదు. నేడు భారత జనాభాలో అపర కుబేరులు కేవలం ఒక శాతమే అయినా, దేశ సంపదలో 73 శాతాన్ని వారే చేజిక్కించుకున్నారని ‘ఆక్స్ ఫామ్’ సంస్థ లెక్కగట్టింది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న 20 సంస్థల అంతర్జాతీయ మహా సమాఖ్యే- ‘ఆక్స్‌ఫామ్’. 2018లో భారత జనాభాలో పేద వర్గానికి చెందిన 67 కోట్లమంది సంపద కేవలం ఒక్క శాతం పెరిగింది. 2006-15 మధ్యకాలంలో ఒక్క శాతం అతి సంపన్నుల సంపద దాదాపు 21 లక్షల కోట్ల రూపాయల మేరకు పెరిగిందని, అది 2017 కేంద్ర బడ్జెట్ వ్యయానికి సమానమని ‘ఆక్స్‌ఫామ్’ తెలిపింది. 2006-2015 మధ్యకాలంలో సాధారణ కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు ఏటా రెండు శాతం చొప్పున పెరిగితే, కుబేరుల ఆదాయం అంతకు ఆరు రెట్లు అధికమైంది. ప్రపంచమంతటా ధనిక, పేదల మధ్య ఆదాయ అసమానతలను తొలగించాలంటే కంపెనీలు తమ వాటాదారులకు డివిడెండ్ల రూపంలో, షేర్ల తిరిగి కొనుగోలు రూపంలో చెల్లింపులు తగ్గించి సాధారణ సిబ్బందికి జీతభత్యాలు పెంచాలని ‘ఆక్స్‌ఫామ్’ సిఫార్సు చేసింది. కంపెనీల ఉన్నతాధికారులకు, సగటు ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసం 20 శాతంకన్నా ఎక్కువ ఉండకూడదని సూచించింది.
అమెరికాలో అతి సంపన్నులు ‘వెంచర్’ పెట్టుబడిదారులుగా మారి అంకుర సంస్థలకు నిధులు అందిస్తారు. ఆ అంకుర సంస్థల్లో కేవలం అయిదు శాతం విజయవంతమైనా, ఆర్థిక వ్యవస్థపై గొప్ప ప్రభావం చూపుతాయి. ఫేస్‌బుక్, ఉబర్ తదితర జగద్విఖ్యాత సంస్థలు వెంచర్ పెట్టుబడుల మూలంగా ఆవిర్భవించినవే. ఇంకా ఉద్యోగులకు వేతనాల్లో భాగంగా కంపెనీ షేర్లు ఇచ్చే పద్ధతి అమెరికాలో ఉంది. భారతదేశంలో ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు, అంకుర సంస్థలు తప్ప ఈ పద్ధతిని అనుసరించే భారీ కంపెనీలు అరుదే. ఇటీవల రతన్ టాటా తదితరులు అంకురాల్లో వెంచర్ పెట్టుబడులు పెట్టడం స్వాగతించాల్సిన అంశం. టాటా కాకుండా ఇతర అతి సంపన్నులు వెంచర్ పెట్టుబడులు పెట్టాలంటే చట్టపరంగా చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ అపర కుబేరులు లెక్కల్లో చూపే సంపదకన్నా చూపని ఆదాయమే చాలా చాలా ఎక్కువ. వారి గుప్తధనం ప్రధానంగా రాజకీయ విరాళాలకు, స్థిరాస్తి, సినిమా వ్యాపారాలకు మళ్లుతోందే తప్ప, పదిమందికి ఉపాధి చూపే సంఘటిత రంగ పరిశ్రమలుగా మారడం లేదు. పైగా కంపెనీలు, కుబేరులు లెక్కల్లో చూపని గుప్తధనంలో 90 నుంచి 97 శాతం స్వదేశంలోనే ఉందని 2014లో మూడు ప్రభుత్వ ఆర్థిక సంస్థల రహస్య నివేదిక వెల్లడించింది. ఈ గుప్త ధనస్వాముల ఆటకట్టించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసినా, దాని వల్ల విరుద్ధ ఫలితాలే వచ్చాయి. సూక్ష్మ పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు అంతటా ఉపాధి నష్టం సంభవించింది. జనం చేతిలో పైసలు ఆడక వస్తుసేవలకు గిరాకీ పడిపోయింది. వారి ఆదాయాలు అధికమైతే తప్ప గిరాకీ పెరగదు, గిరాకీ ఏర్పడితే తప్ప కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు అవతరించవు. ఈ రెండు లక్ష్యాలు సాధించడానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది కార్పొరేట్ పన్నులను తగ్గించారు. దాని ప్రభావం ఇంకా అనుభవంలోకి రావలసి ఉంది.