వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో- అంతర్జాతీయ సమీకరణలు, ఇరుపక్షాల బలాబలాలు, అమెరికా పాత్ర వంటి వివిధ అంశాలపై లఫె్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడాతో 'ఈటీవీ-భారత్' ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖి.
సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య గతంలో ఎన్నోసార్లు ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈశాన్య సరిహద్దుల వద్ద చుమార్, డోక్లాం ప్రాంతాల్లో ఇరు పక్షాలూ బాహాబాహికి దిగిన ఉదాహరణలను కొన్నేళ్ల క్రితం చూశాం. నాటితో పోలిస్తే ప్రస్తుతం తలెత్తిన వివాదం ఏ రకంగా భిన్నమైనది?
మునుపటి ఘర్షణలతో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నమైన సమస్య. చుమార్, డోక్లాంలతో పాటు 2013లో దెస్పాంగ్‌లో చెలరేగిన గొడవల వెనక స్థానిక కారణాలున్నాయి. డోక్లాంలో చైనీయులు రహదారిని నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే భారత సైన్యం సరిహద్దులు దాటి భూటాన్‌లోకి వెళ్ళి మరీ పీఎల్‌ఏ దళాలను అడ్డుకుంది. రోడ్డు నిర్మాణం ఆపాలని అభ్యర్థించింది. చుమార్‌లోనూ అదే జరిగింది. చైనీయులు కొత్త రోడ్లు వేసుకొని, భారత భూభాగంలోకి జొరబడేందుకు మార్గాలు సుగమం చేసుకోవాలనుకున్నారు... ఆ ప్రయత్నాలను మనవాళ్లు అడ్డుకొన్నారు. ఆయా సందర్భాల్లో మన డిమాండ్లేమిటో చైనాకు స్పష్టంగా వెల్లడించాం. కానీ, తాజాగా తలెత్తిన గొడవ భిన్నమైనది. ఇప్పుడు ఉద్రిక్తతలు చెలరేగిన ప్రాంతంలో చైనా, భారత్‌ల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. మౌలిక సౌకర్యాల విస్తరణ పేరిట భారత్ చేపడుతున్న కార్యకలాపాలే సమస్యకు కారణమని చైనా చెబుతున్నప్పటికీ- ఇరుపక్షాలూ వేల సంఖ్యలో సైన్యాన్ని మోహరించడం మాత్రం మునుపెన్నడూ కనివినీ ఎరుగని పరిణామం. ఇంతకీ చైనా ఏం ఆశిస్తోంది, దాని డిమాండ్లేమిటి అన్న విషయాల్లో మాత్రం ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. జరుగుతున్న పరిణామాలను భారత్ తేలిగ్గా తీసుకోరాదు.
సంక్షోభ పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఈ సమస్యను అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక సమీకరణల కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉందా?
చైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. సాంకేతిక విజ్ఞానం, వాణిజ్య రంగాల్లో అమెరికా-చైనాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే బీజింగ్ నాయకత్వమూ దూకుడు పెంచింది. హాంకాంగ్ స్వయం పాలన హక్కులను కాలరాస్తూ జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకురావడం, తైవాన్‌కు వ్యతిరేకంగా జాతీయవాద భావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం, ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచే యత్నాలు వంటివన్నీ ‘మేం బలహీనపడ్డామని భావించవద్దు సుమా’ అని ప్రపంచానికి సంకేతాలు పంపేందుకు అది చేస్తున్న ప్రయత్నాలుగానే భావించాల్సి ఉంటుంది. ఇక- ట్రంప్ మధ్యవర్తిత్వం పేరిట చేసిన వ్యాఖ్యలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఇండియా, చైనాలే ఈ సమస్యకు పరిష్కారాలు కనుక్కోవాల్సి ఉంది. భారత్ క్రమక్రమంగా అమెరికా కూటమిలో భాగస్వామిగా మారుతోందని, తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని చైనా భావిస్తోంది. హిందూ మహా సముద్రంలో భారత్‌కు అపారమైన నావికాబలం ఉంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘చతుర్భుజ’ కూటమిలో భాగస్వామిగా అమెరికాతో కలిసి భారత్ నడిస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా బలహీనపడుతుంది. చైనా వాణిజ్యంలో 80శాతం ఈ సముద్రం ద్వారానే జరుగుతోంది.
వాస్తవాధీన రేఖ వద్ద మౌలిక సౌకర్యాలు, వనరులపరంగా భారత్ బలం ఏ స్థాయిలో ఉంది?
వనరుల ప్రాతిపదికన వాస్తవాధీనరేఖ వద్ద చైనా బలంగా ఉన్న మాట నిజమే. గడచిన కొన్నేళ్లుగా రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సౌకర్యాల నిర్మాణం విషయంలో భారత్ చాలా చురుకుగా పనిచేస్తోంది. మారిన పరిస్థితుల్లో ‘ఎల్‌ఏసీ’ వద్ద భారత్ సైతం బలంగానే ఉందని చెప్పక తప్పదు. 1962నాటి యుద్ధాన్ని పక్కనపెడితే- భారత్‌పై ఆ తరవాత వివిధ సందర్భాల్లో సైనికపరమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు చైనా ప్రయత్నించింది. 1967లో నాథులా ఘటన మొదలుకొని ఇటీవలి వరకూ ఏ ఒక్క సందర్భంలోనూ దాని ప్రయత్నం విజయవంతం కాలేదు.
అంతర్జాతీయ వేదికపై చైనా ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఎందుకు కొత్త సమస్యలు సృష్టిస్తోంది?
చైనా చాలా బలమైన దేశం. కరోనా కారణంగా అంతర్జాతీయంగా దాని పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. తాను బలహీనపడలేదని నిరూపించుకొని, అంతర్జాతీయంగా పునర్‌వైభవం సాధించడంకోసం ఆ దేశం ఇప్పుడు నానా పాట్లూ పడుతోంది. రెండు బలమైన దేశాలు ఇరుగుపొరుగుగా ఉన్నప్పుడు సరిహద్దుల్లో చిన్నపాటి ఘర్షణలు తలెత్తుతూనే ఉంటాయి. దీనికి మనం అలవాటుపడాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ను చైనా పావుగా ఉపయోగించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్ వాయవ్య సరిహద్దుల్లో పాకిస్థాన్ మనతో గిల్లికజ్జాలకు దిగే అవకాశాలూ కొట్టిపారేయలేనివి. ఇరువైపులా సరిహద్దులను జాగ్రత్తగా కాచుకోవాల్సిన సందర్భమిది. అయితే సరిహద్దుల్లో చైనా వైపునుంచి ఒత్తిడి పెరిగిందని; వాయవ్య సరిహద్దులనుంచి బలగాలను అటువైపు తరలించేందుకు ప్రయత్నించరాదు. నిజానికి మనకు ఆ అవసరమూ లేదు. ఇరువైపులా సరిహద్దుల్లో అవసరమైనంత బలం, బలగం భారత్ సొంతం.