కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తాపత్రికల నిరంతర సరఫరా అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంగళవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. పత్రికలు, టీవీ ఛానళ్ల రోజువారీ విధులకు ఇబ్బందులు కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందులో నిర్దేశించింది.
"ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారికి ముఖ్యమైన సందేశాలివ్వడానికి, తాజా పరిస్థితులను ప్రజల ముందు పెట్టడానికి పత్రికలు, టీవీ ఛానళ్ల నెట్‌వర్క్ నిరంతరాయంగా పనిచేయడం అత్యవసరం. తప్పుడు, నిరాధార వార్తలను పరిహరించి అత్యుత్తమ విధానాలను ప్రోత్సహించడంలో ఈ ప్రసార సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తున్న వీటి రోజువారీ విధులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమాచార, ప్రసార సాధనాలతో ముడిపడిన అన్ని వ్యవస్థలకూ ప్రభుత్వపరంగా తగిన సహకారం అందించాలి"