తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత రాజ్యాంగం ఆమోదం....నేటికి 70ఏళ్లు

ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రూపక భారత రాజ్యాంగం- కాగితాల పొత్తం కాదు, మానవాళిలో ఏడోవంతు జనావళి ప్రగతిశీల కాంక్షల పరిరక్షణ ఛత్రం. ఎలాంటి భేదభావాల్లేకుండా పౌరులందరి పట్లా సమభావానికి, సమన్యాయానికి భరోసా ఇస్తున్న సంవిధాన శాసనం! ‘ఈ తీర్మానం చట్టాల కంటే ఉన్నతమైనది... ఇదొక కృతనిశ్చయం... ఇదొక వాగ్దానం, ఇదొక భద్రత... అంతకుమించి మనమంతా అంకితం కావాల్సిన బృహత్‌ లక్ష్యం’- 1946 డిసెంబరులో రాజ్యాంగ నిర్ణయ సభలో పండిత నెహ్రూ ప్రవేశపెట్టిన భావి రాజ్యాంగ ఆశయ తీర్మాన పాఠమిది. వలస పాలన దాస్య శృంఖలాలు తెగిపడ్డ నేపథ్యంలో న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలుగా భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడంలో ఎందరెందరో దిగ్దంతులు సాగించిన మేధామథనం- అద్వితీయం, అనుపమానం.

constitution
భారత ప్రజలమైన మేము...

By

Published : Nov 26, 2019, 7:40 AM IST

స్వేచ్ఛాసమానత్వం సౌభ్రాతృత్వ భావనలను ఫ్రెంచి రాజ్యాంగం నుంచి, పంచవర్ష ప్రణాళికల కూర్పును సోవియట్‌ యూనియన్‌ నుంచి, ఆదేశిక సూత్రాల ఆలోచనను ఐర్లాండ్‌ నుంచి, సుప్రీంకోర్టు పనిపోకడల సరళిని జపాన్‌ నుంచి గ్రహించి అత్యుత్తమంగా నాటి త్యాగధనులు రూపొందించిన రాజ్యాంగానికిది డెబ్భయ్యోపడి! భారతరత్న అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకొని- రాజ్యాంగ నిర్మాతగా ఆయన సేవల్ని స్మరిస్తూ ఏటా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో రాజ్యాంగ అవతారికను ప్రతి నోటా పలికించడంతోపాటు, 70 వసంతాల మైలురాయి దృష్ట్యా ఏడాది పొడవునా కార్యక్రమాలు జరపాలనీ కేంద్ర సర్కారు నిర్దేశించింది. రాజ్యాంగం పుట్టిన రోజు సందడి సరే- ‘మన వైఫల్యాలకు రాజ్యాంగం కారణమా, రాజ్యాంగం విఫలం కావడానికి మనం కారకులమా?’ అన్న ఆత్మవిమర్శ సాగాలంటూ రాజ్యాంగ స్వర్ణోత్సవ వేళ రాష్ట్రపతిగా నారాయణన్‌ చేసిన సూచన వెలకట్టలేనిది. పౌరుల నుంచి పాలకుల దాకా ప్రతి ఒక్కరి స్థాయిలో రాజ్యాంగ విలువలకు కట్టుబాటే- నేడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నెన్నో జాడ్యాలకు విరుగుడు కాగలిగేది!

చర్యలు తీసుకోవడం తప్పనిసరి

‘సమున్నత ఆశయ ప్రకటనల్ని బట్టి కాదు, వాటి అమలుకు కచ్చితంగా ఏమేం చర్యలు తీసుకొన్నామన్న దాన్నిబట్టే మన పనితీరు నిగ్గుతేలుతుంది’- గణతంత్ర భారత భానూదయ వేళ సర్వేపల్లివారి సతార్కిక మార్గదర్శనమది. కాలమాన పరిస్థితులు, అవసరాల్నిబట్టి రాజ్యాంగానికి వందకు పైగా సవరణలు చేసుకొన్నా- పేదరికాన్ని, దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని పరిమార్చడమే ధ్యేయమన్న తొలినాటి లక్ష్యాల్ని ఏడు దశాబ్దాలైనా సాధించలేక, మానవాభివృద్ధి సూచీల్లో 130వ స్థానంలో ఇండియా ఈసురోమంటోంది. అందుకు కారణం ఏమిటన్నది ముంజేతి కంకణం. అన్ని రకాల అవినీతికీ తల్లివేరుగా రాజకీయ అవినీతి ఊరూవాడా ఊడలు దిగి విస్తరించబట్టే గంప లాభం చిల్లి తీస్తోందన్నది నిష్ఠురసత్యం. శాసన కార్యనిర్వాహక న్యాయవ్యవస్థలు రాజ్యాంగ పరిధులకు లోబడి విధివిహిత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, ప్రధానిగా ఇందిర బ్యురాక్రసీకి ప్రబోధించిన విధేయస్వామ్యం విలువల క్షయాన్ని అనుశాసించింది.

రాజ్యాంగాన్ని ముట్టకుండానే కేవలం పాలన యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగస్ఫూర్తిని కాలరాచి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమేనని 1949 నవంబరులోనే హెచ్చరించిన అంబేడ్కర్‌ దూరదృష్టి తిరుగులేనిదని ఇన్నేళ్ల చరిత్రా కళ్లకు కడుతోంది! చట్టం తన పని తాను చేసుకుపోయే వాతావరణాన్నే దెబ్బతీసిన వ్యక్తుల స్వార్థం- రాజ్యాంగ వ్యవస్థల విలువనే ఖర్చురాసేస్తోంది. చట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ల బిల్లుకు మోకాలడ్డిన రాజకీయం శాసన నిర్మాణ వ్యవస్థ ప్రతిష్ఠనే పలుచన చేస్తుంటే, హేయ నేరాలకు పాల్పడ్డవాళ్లూ బోరవిరుచుకొని తిరుగుతున్న తీరు రాజ్యాంగబద్ధ పాలననే అవహేళన చేస్తోంది. ఈ అరాచకీయ కసవును ఊడ్చిపారేస్తేనే కదా, భారత రాజ్యాంగ స్ఫూర్తి వాడవాడలా పరిఢవిల్లేది!

లక్ష్యాలే కాదు, వాటిని సాధించే మార్గాలూ సమున్నతంగా ఉండాలన్నారు మహాత్మాగాంధీ. దశాబ్దాలుగా స్వార్థమే పరమార్థమైన నేతాగణాల వివేకభ్రష్టత్వం జాతి నైతిక పతాకను అవనతం చేసి, అవినీతి అష్టపాదికి అంబారీలు కట్టి, నల్లదొరల పీడనకు సర్కారీ మొహరు వేసి దేశం మీద వదిలేసింది. ‘నేరాభియోగాలు నమోదైతే పదవీత్యాగం చెయ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా?’ అని ప్రశ్నించే మహా చాలూగాళ్ల ఒరవడి ఏటికేడు పెరుగుతుండబట్టే- ‘తన శక్తిసామర్థ్యాల మేరకు ఇండియా అభివృద్ధి సాధించగలిగిందా?’ అని లోగడ ఒక ప్రధానమంత్రే వాపోయిన దురవస్థ దాపురించింది. పేదరికంకన్నా విశృంఖలంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలే ఇండియాకు పెనుసవాళ్లు రువ్వుతున్నాయని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి.

1949 నవంబరు 25 రాజ్యాంగ సభ ముగింపు ప్రసంగంలో అంబేడ్కర్‌ చేసిన హెచ్చరికలకు నేడు మరింత ప్రాధాన్యం ఉంది. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి నిరసనోద్యమాలకు చెల్లుకొట్టాలన్న అంబేడ్కర్‌- రాజకీయాల్లో భక్తి, అంధవిధేయతలు నియంతృత్వానికే దారితీస్తాయని నాడే ప్రమాద ఘంటికలు మోగించారు. సమానత్వాన్ని దీర్ఘకాలం నిరాకరిస్తే, రాజకీయ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని స్పష్టీకరించారు. వాటికి పౌరులు, ప్రభుత్వాలు నిష్ఠగా తలొగ్గాల్సిన సమయమిది. ఆకలికి మించిన అవమానం మరొకటి లేదని, అభివృద్ధి ప్రక్రియలో పేదలూ భాగస్వాములైతేనే నిజమైన పురోగతి సాధ్యపడుతుందన్న సత్యానికి పాలకులు చెవులొగ్గాలి. ‘భారత ప్రజలమైన మేము...’ అంటూ రాసుకొన్న రాజ్యాంగానికి సిసలైన ప్రభువులు ప్రజలే. పౌరహక్కుల్ని కాచుకొంటూ, బాధ్యతల్ని నిష్ఠగా నిభాయించి అవినీతి కలుపును సమర్థంగా ఏరిపారేస్తే- రాజ్యాంగ స్ఫూర్తికి గొడుగుపట్టినట్లే!

ఇదీ చూడండి : మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

ABOUT THE AUTHOR

...view details