పశ్చిమ్ బంగాలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం కాకరేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్య ఆరోపణ ప్రత్యారోపణలు, మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ ఫిరాయింపులు, నేతలపై దాడులు, 'జై శ్రీరామ్' నినాదాలతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎంఐఎం నుంచి పలువురు నేతలు టీఎంసీలోకి, తృణమూల్ నుంచి సుమారు 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ భాజపాలోకి వలస వెళ్లారు. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ పోటీ ప్రధానంగా టీఎంసీ, భాజపా మధ్యే కనబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్, బిహార్ ఎన్నికల్లో జోరు చూపించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు బంగాల్పై కన్నేశారు. బంగాల్లో 30శాతానికి పైగా జనాభాతో 100కు పైగా అసెంబ్లీ స్థానాలను శాసించే ముస్లింలు ఓవైసీకి పట్టం కడతారా? ముస్లిం ఓటు బ్యాంకుతో శాసన పోరు త్రిముఖంగా మారనుందా? లేక మమతను ముంచి భాజపా గెలుపునకు ఓవైసీ పరోక్షంగా దోహదం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త పార్టీతో దోస్తీ!
పశ్చిమ్ బంగా రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో44 స్థానాలు, బిహార్ అసెంబ్లీఎన్నికల్లో 5 స్థానాలు గెలిచి జోరుమీదున్నారు. అదే ఊపును బంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగించాలనుకుంటున్నారు. ఆ దిశగా ఇటీవల ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) పార్టీ పెట్టిన మత ప్రభోధకుడు అబ్బాస్ సిద్దికీతో ఓవైసీ జతకడతారని నిపుణులు భావిస్తున్నారు .
ఐఎస్ఎఫ్ ప్రభావం..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఎస్ఎఫ్ను స్థాపించారు ఫుర్‌ఫురా షరీఫ్ అహలే సున్నతుల్ జమాత్ వ్యవస్థాపకుడు పిర్జాదా అబ్బాస్ సిద్దికీ. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దినాజ్‌పుర్, మాల్డా, ముర్షీదాబాద్‌లలో సిద్దికీని అనుసరించేవారి సంఖ్య భారీగానే ఉంది. ఆయన లేవనెత్తే అంశాలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం చేసే ప్రయత్నం వల్ల యువతలో మంచి ఆదరణ ఉంది. అయితే మతం కారణంగా లభించిన అభిమానం ఓట్ల రూపంలోకి మారుతుందా అనేది ప్రశ్నార్థకం.
బిహార్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిహార్‌లో ఎంఐఎం రాత్రికి రాత్రే గెలవలేదు. 2015 నుంచి పార్టీ నేత అఖ్తారుల్ ఇమాన్ నేతృత్వంలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి కారణంగా విజయం దక్కింది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత కారణంగా జేడీయూపై జనాల్లో వ్యతిరేకత నెలకొంది. పైగా అసలు భాజపా గెలిచే అవకాశం లేని స్థానాల్లోనే ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 20 స్థానాల్లో దక్కిన ఓట్లు.. ఏ ఒక్క చోటా భాజపా గెలుపునకు దోహదపడలేదు. అయితే ఎంఐఎం కారణంగానే ఆర్జేడీ ఓడిందనే అభిప్రాయం మైనారిటీల్లో నెలకొంది.
పైగా కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ కారణంగా ఇప్పటికే భాజపాపై ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బంగాల్లో ఎంఐఎం ఎంట్రీతో ఓట్లు చీలి భాజపా అధికారంలోకి వస్తుందనే భయం మైనారిటీల్లో లేకపోలేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.