ఆరోగ్య బీమా సదుపాయం లేని కారణంగా పేదలు తమ కష్టార్జితంలో ప్రధాన భాగాన్ని వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావడం, లేదా అప్పుల బారిన పడటం వంటి సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ‘ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎమ్‌జేఏవై)’ అమలు చేసి దీని కింద ఇప్పటివరకు సుమారు 72 లక్షల రోగులకు రూ.9,600 కోట్లకు పైగా విలువైన చికిత్సల్ని అందించింది ప్రభుత్వం.
ఈ పథకం ఏమిటి?
పథకాన్ని ప్రారంభించిన తరవాత కొద్దికాలంలోనే భారీ సంఖ్యలో చికిత్సల్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయ విజయంగానే భావించాలి. రోగుల సంఖ్య, పెట్టిన ఖర్చు వంటి గణాంకాలు ఏమి చెబుతున్నప్పటికీ, ఈ విషయంలో చేయాల్సిందేమిటో గ్రహించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నిరుడు సెప్టెంబర్ 25 నుంచి ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్ (ఆయుష్మాన్ భారత్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకాన్ని జాతీయ ఆరోగ్య రక్షణ మిషన్ (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎం) లేదా మోదీ కేర్‌గానూ పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పేరొందింది. ఏటా ప్రతి కుటుంబానికి అయిదు లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా కవరేజీ అందిస్తుంది. ఇందులో ప్రత్యేక, సాధారణ, ఇతరత్రా వైద్య, శస్త్రచికిత్స సంబంధిత సేవలూ అందుతాయి. లబ్ధిదారుల అర్హతల కోసం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ)పై ఆధార పడతారు. పథకానికి సంబంధించి పెద్ద సంఖ్యలో సవాళ్లు వరస కడుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
సవాళ్లివే
ఏబీ-పీఎమ్‌జేఏవై పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాలు- అవినీతి. ఈ విషయంలో పలు ఆస్పత్రులకు నోటీసులు సైతం జారీ అయినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఏడాది కాలంలో సుమారు 1,200 ఆస్పత్రులు తప్పుడు కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. వీటిలో 376 ఆస్పత్రులపై దర్యాప్తు ముగిసింది. ఆరు ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్)లు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రులపై రూ.1.5 కోట్ల మేర జరిమానాల్ని విధించారు. 97 ఆస్పత్రుల్ని పథకం జాబితా నుంచి తొలగించారు. ఈ అంకెలన్నీ ప్రైవేట్ ఆస్పత్రుల ప్రమేయమున్న అవినీతి అంశాల్ని ఎత్తిచూపుతున్నాయి. పథకం అమలులో కఠిన నియంత్రణలు, పర్యవేక్షక యంత్రాంగం ఉండాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి.
రెండో సమస్య
పథకంలో రెండో సమస్య ప్రైవేట్ ఆస్పత్రుల పనితీరుకు సంబంధించినది. ఒకవైపు, మార్కెట్ రేట్లతో పోలిస్తే వివిధ రకాల చికిత్సలకు నిర్ణయించిన ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటూ చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న సౌకర్యాలు హీనస్థాయిలో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు ఈ పథకంలో చేరిన సుమారు 71 శాతం ఆస్పత్రుల్లో 25 కన్నా తక్కువ పడకలే ఉన్నాయి. సాధారణ వైద్యసేవలనే అందిస్తున్నట్లు తేలింది. ఈ తరహా సమస్యలకు తమిళనాడు మెరుగైన పరిష్కారాన్ని గుర్తించింది. బలమైన ప్రభుత్వరంగ ప్రజారోగ్య వ్యవస్థకు ఆ రాష్ట్రం గుర్తింపు పొందింది.
ప్రభుత్వరంగ ఆరోగ్య వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంటే, వివిధ రకాల వైద్యసేవల ధరల విషయంలో ప్రైవేట్ రంగంతో బేరసారాలు ఆడేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల ప్రైవేట్ రంగం ప్రభుత్వ వైద్య వ్యవస్థతో పోటీపడి చవక ధరల్లోనే మెరుగైన సేవల్ని అందిస్తుంది. సామాన్యులు లబ్ధి పొందుతారు. ఇలాంటి ప్రయోజనాలన్నింటికీ తోడుగా, సమర్థమైన, బలమైన ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంటే, భారీ సంఖ్యలో రోగులు ఆకర్షితులవుతారు. ఫలితంగా ప్రైవేట్ ఆస్పత్రులకు పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన అవసరం లేకుండా, సదరు రోగులే నిధుల్లో ప్రధాన భాగాన్ని సమకూరుస్తారు. దీనివల్ల ప్రభుత్వ రంగం, లాభాల్ని ఆశించే ప్రైవేట్ రంగం మధ్య సమతౌల్య సాధన సాధ్యమవుతుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు సాధికారత కల్పించడం, సంస్థాగతమైన విధివిధానాలతో అండదండలు అందించడం మూడో సవాలు.
ఈ-కార్డ్స్
లబ్ధిదారులకు ఈ-కార్డ్స్ రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రశంసనీయం. అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు ‘ఫీడ్‌బ్యాక్’ వ్యవస్థనూ ప్రారంభించారు. నాలుగో సవాలు- సంస్థాపరమైన ఏర్పాట్ల లేమి. పథకానికి భారీస్థాయిలో సంస్థాపరమైన ఏర్పాట్లు అవసరం. ఉదాహరణకు ఈ పథకం అమలు ప్రణాళిక ప్రకారం 1.20 లక్షల సామాజిక ఆరోగ్య అధికారులను 2022 నాటికి నియమించనున్నారు. ఇదే సమయంలో 1.50 లక్షల మంది ఆరోగ్య, స్వాస్థ్య(వెల్‌నెస్) కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి అయిదు శాతంకన్నా తక్కువకు పడిపోయిన పరిస్థితుల్లో వీటికయ్యే వ్యయాల్ని సమకూర్చడం సవాలే. వృద్ధిరేటు ఏడు నుంచి ఎనిమిది శాతం దాకా ఉండి, జీడీపీలో సుమారు రెండు శాతం ఖర్చు పెడితే లక్ష్యసాధన తేలికవుతుంది.