‘భారతదేశ వ్యూహాత్మక అవసరాలకు చౌకగా లభించే సంప్రదాయేతర ఇంధనం సరైనది. దేశ ఆర్థికాభివృద్ధికి ఇదొక ప్రధాన మార్గం. అందుకే 4.50 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం’- వాతావరణ మార్పులపై మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో భారత ప్రభుత్వ తాజా ప్రకటన ఇది.
నూతన, సంప్రదాయేతర ఇంధన (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి దేశంలో అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారులను ఆదుకునేందుకు తగినన్ని రక్షణ ఏర్పాట్లు కల్పిస్తామని భారత ప్రభుత్వం తాజాగా గట్టి హామీ ఇస్తోంది. అందుకోసం పెట్టుబడిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చేసుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రక్షణకు కొత్త చట్టం తేవాలని సంకల్పించింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దు చేసేందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నిస్తున్నందువల్ల దేశవ్యాప్తంగా పెట్టుబడులపై దీని ప్రభావం పడుతోందని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఒకసారి పీపీఏ కుదిరితే తరవాత వచ్చే ప్రభుత్వాలు రద్దుచేయకుండా కొత్త చట్టం తేవాలని భావిస్తోంది. వాతావరణ మార్పులపై మాడ్రిడ్‌లో జరిగిన ‘కాప్ 25’ సదస్సులో ఆర్‌ఈ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని దేశాలూ చర్చించాయి. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల వాతావరణం వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కాలుష్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ రంగానికి ఒడుదొడుకులు ఎదురవుతున్న వేళ సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని ఏకంగా 4.50 లక్షల మెగావాట్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడం పెద్ద సవాలుగానే చెప్పాలి.
పెట్టుబడులొచ్చేనా?
ప్రస్తుతం ప్రపంచంలో సంప్రదాయేతర ఇంధనం (ఆర్‌ఈ) అధికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి మూడు దేశాల్లో భారత్ ఉంది. నరేంద్ర మోదీ 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో 2022 నాటికి లక్షా 75 వేల మెగావాట్ల ఆర్‌ఈని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. అయిదేళ్లు గడచినా ఇప్పటికీ 83 వేల మెగావాట్ల ఉత్పత్తే సాధ్యమైంది. మిగిలిన లక్ష్య సాధనకు రూ.5.60 లక్షల కోట్లు అవసరం. 2030 నాటికి ఈ రంగంలో రూ.21.45 లక్షల కోట్ల పెట్టుబడులు పెడితేతప్ప 4.50 లక్షల మెగావాట్ల ఉత్పత్తి సాధ్యం కాదన్నది కేంద్ర ప్రభుత్వ అంచనా. ఇంత భారీ పెట్టుబడిని ఏ ప్రభుత్వం గాని, ప్రభుత్వ సంస్థలు గాని సొంతంగా పెట్టే అవకాశాలు లేవు. ఓ వైపు ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రైవేటు రంగం నుంచి ప్రధానంగా విదేశీ పెట్టుబడులు పుష్కలంగా వస్తేనే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాలు నెరవేరతాయి. అది జరగాలంటే పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం అన్ని రాష్ట్రాల్లో ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను సమీక్షిస్తామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా ఈ రంగంలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఇప్పటికే వందల కోట్ల రూపాయలు వెచ్చించి సౌరవిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసినవారికి నెలనెలా చెల్లింపులు సరిగ్గా లేవు. సౌర, పవన విద్యుత్ కొంటున్న ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా, ఆసక్తిగా పనిచేసే రాష్ట్రాల్లోనే ఆర్‌ఈ రంగం వెలుగులీనుతోంది. గుజరాత్‌లో తాజాగా రూ.30 వేలకోట్లను ఈ రంగంలో పెట్టుబడిగా పెట్టేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ముందుకొచ్చింది. ఇప్పటికే 8,885 మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తితో ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి పోటీపడుతోంది. అయినా అక్కడితో ఆగకుండా 2022నాటికి 30 వేల మెగావాట్ల ఉత్పత్తికి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ లక్ష్యం చేరితే అందులో 20 వేల మెగావాట్లు రాష్ట్ర అవసరాలకు వాడుకుని. మిగిలిన 10 వేలను ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్నది గుజరాత్ ప్రభుత్వ ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్‌లో సౌరవిద్యుత్ ఉత్పత్తి తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం పలుమార్లు ఆక్షేపించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా పలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ థర్మల్ విద్యుత్‌ను తగ్గిస్తూ సౌర, పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నాయి.
కాలుష్య కోరల నుంచి విముక్తి
దేశాన్ని కాలుష్య కోరల నుంచి విముక్తి చేయాలంటే అధికంగా కాలుష్యాన్ని వెదజల్లే థర్మల్ విద్యుత్కేంద్రాలను తగ్గించాలి. దేశం మొత్తమ్మీద థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తికి గతేడాది 65 కోట్ల టన్నుల బొగ్గును మండించి బూడిదగా మార్చి బయటికి వదిలారు. ఇది సమీప భవిష్యత్తులో వంద కోట్ల టన్నులకు వెళ్తుందని అంచనా. ఇకముందు థర్మల్ కేంద్రాలను నిర్మించేది లేదని, సౌర, పవన, జలవిద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికే ప్రాధాన్యమని ఇప్పటికే గుజరాత్ ప్రకటించింది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు సైతం గుజరాత్‌ను అనుసరిస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పెంపులో పోటీపడుతున్నాయి. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే దానికన్నా 30 శాతం తక్కువకే సంప్రదాయేతర ఇంధనం లభిస్తోంది. ఇంతకాలం థర్మల్ విద్యుత్తునే అధికంగా కొంటున్నందువల్ల అనేక రాష్ట్రాల డిస్కమ్‌లు వేల కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకున్నాయి. తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌ల అప్పులే దాదాపు రూ.20 వేలకోట్లున్నాయి. ప్రపంచం మొత్తమ్మీద గాలిలోకి వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 30 శాతం చైనాలోనే వస్తున్నాయి. ఏటా ప్రపంచమంతా వినియోగిస్తున్న బొగ్గులో సగానికి సగం చైనానే మండించి బూడిద చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన రంగంలో చైనా తీరు పరస్పర విరుద్ధంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సౌరఫలకాల్లో మూడింట రెండొంతులు చైనాలోనే తయారవుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక బొగ్గు వినియోగంలో, దానికి విరుద్ధంగా సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలోనూ చైనా ప్రపంచానికి పెద్దన్నగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో సంప్రదాయేతర ఇంధన రంగానికి రాయితీలు తగ్గించింది. ఈ ఇంధనంపై పెట్టుబడులు చైనాలో తొలి అర్ధభాగంలో ఏకంగా 40 శాతం తగ్గాయి. భారత్‌లోనూ సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడులు తగ్గినట్లు ఇటీవల కేంద్రం తెలిపింది. బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో చైనా నుంచి వెలువడే కర్బన ఉద్గారాల శాతం పెరిగిందని ప్రపంచమంతా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది 2015లో ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులపై పోరాడేందుకు చేసుకున్న పారిస్ ఒప్పందానికి విరుద్ధం. మరోవైపు జపాన్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాల స్థాపనకు ఆర్థిక సాయం మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం వాతావరణ మార్పులపై ప్రపంచం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేలా ఉంది. కాలుష్యాన్ని, దానివల్ల పెరుగుతున్న ఉష్ణతాపాన్ని తగ్గించడం ద్వారా భూగోళాన్ని, మానవాళిని రక్షించేందుకు ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై పోరాడేందుకు పారిస్ ఒప్పందాల్లాంటివి కుదుర్చుకుంటున్నాయి. వీటికి తూట్లు పొడిచే రీతిలో ఆంధ్రప్రదేశ్ మొదలుకుని చైనా దాకా పాలకుల విధానాలు ఉండటం వల్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పెంపు లక్ష్యాల సాధనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఆర్థిక దన్ను అవసరం
సౌర, పవన విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులకు నిధులు సమకూర్చేందుకు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ప్రత్యేకంగా ఆర్థిక సంస్థలున్నాయి. భారత్‌లోనూ ప్రత్యేకంగా ‘గ్రీన్ విండో’ పేరిట ఈ రంగానికి నిధులు సమకూర్చే ప్రత్యేక విధానం తేవాలని కేంద్రం సంకల్పించింది. ఇప్పటిదాకా సౌరవిద్యుత్ వినియోగం అంతగా లేని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దేశవ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు సరఫరా చేస్తున్న సాధారణ విద్యుత్తుకు రాయితీల కింద ఏటా లక్ష కోట్ల రూపాయల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. వీటికి సౌరవిద్యుత్ ఏర్పాటుచేస్తే ఈ సొమ్ములే కాకుండా విద్యుత్తూ మిగులుతుంది. దాని ఉత్పత్తికి వాడే బొగ్గు కలిసివస్తుంది. తద్వారా కాలుష్యం దిగివస్తుంది.
దేశంలోనే అత్యధికంగా 24 లక్షల బోర్లపై వ్యవసాయం చేస్తున్న తెలంగాణలో ఉచితంగా రోజంతా ఇస్తున్న విద్యుత్తుకు ఏటా రూ.10 వేల కోట్ల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉచితంగా లభించే సౌరవిద్యుత్ కల్పనకు ఈ సొమ్ము వెచ్చిస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంతో ఆదా అవుతుంది. పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా ఆ సొమ్ము పెట్టిన పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకునే ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాల’(పీపీఏ)కు తగిన రక్షణ తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడులకు రక్షణ లేదన్నట్లుగా ప్రస్తుత విధానాలు ఉన్నందునే ఇటీవల సంప్రదాయేతర ఇంధన రంగానికి నిధుల ప్రవాహం తగ్గిందనేది వాస్తవం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సౌరవిద్యుత్ కేంద్రాలను స్థాపించేవారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకుండా నెలలు, ఏళ్ల తరబడి రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేసే విధానాలను కేంద్రం మార్చాలి.
ఈ చెల్లింపులు సకాలంలో జరిగేలా కేంద్రం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం అనుసరిస్తున్న రాయితీ విధానాలు, తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాల వల్ల డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాలా అంచుల్లో పయనిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలు ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్కేంద్రాలను అడ్డగోలుగా ముంచే విధానాలు కొనసాగితే 4.50 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యం ఎండమావిగా మిగులుతుంది. అప్పుడు కాలుష్యం, ఉష్ణతాపం, వాతావరణ మార్పుల నుంచి మానవాళిని ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ నగరం మాదిరిగానే దేశమంతా మారడానికి ఇక ఎంతో కాలం పట్టదని గుర్తించాలి!
- మంగమూరి శ్రీనివాస్ (రచయిత)
ఇదీ చూడండి : పైరేట్స్ నుంచి 18 మంది భారతీయులు విడుదల