'భారత్ కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టం ప్రిపేర్డ్‌నెస్' ప్యాకేజికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజికి అయ్యే ఖర్చు 100 శాతాన్ని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీని మూడుదశల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
మూడు దశల్లో...
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, అవసరమైన ఆరోగ్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చుకోవడం, ఔషధాలను తగినంత స్థాయిలో ఉత్పత్తి చేయడం, పరీక్షా కేంద్రాలు, బయో సెక్యూరిటీని తయారు చేయడం వంటి కార్యకలాపాలను చేపట్టాలి.
తక్షణ కట్టడి, కరోనా పూర్తి నివారణ, భవిష్యత్తులో వచ్చే వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఈ ప్యాకేజిని కేంద్రం ప్రకటించింది.
తొలిదశ.. 2020 జనవరి నుంచి 2020 జూన్ వరకు
రెండో దశ.. 2020 జులై నుంచి 2021 మార్చి వరకు
మూడో దశ 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు
తొలిదశ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్రాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వందన గుర్నాని. తొలిదశ కింద.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కొవిడ్ నియంత్రణ ఆసుప్రతుల ఏర్పాటు, ఐసోలేషన్ బ్లాక్స్, ఐసోలేషన్ రూములు, వెంటిలేటర్లతో కూడిన ఐసియులు, ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో వైద్య పరీక్షా కేంద్రాలను విస్తృత స్థాయిలో బలోపేతం చేయడం, అవసరం అయిన మానవ వనరులను సమకూర్చకోవడం, వైద్య సిబ్బంది.. వలంటీర్లలకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వ సరఫరాకు అదనంగా, రాష్ట్రాలు వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఎన్95 మాస్క్‌లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలి.
కొవిడ్ నియంత్రణలో భాగంగా సామాజిక బాధ్యతగా ఉండేలా సోషల్ మీడియా, పౌరసమాజాన్ని చైతన్య పరిచేలా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి.