'ద బీస్ట్'... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారు. పేరుకు తగినట్టే అత్యంత శక్తిమంతమైనది ఆ వాహనం. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యమైనది. సౌకర్యాలపరంగా ఎంతో విలాసవంతమైనది.
ప్రఖ్యాత జనరల్ మోటర్స్ అనుబంధ సంస్థ అయిన క్యాడిలాక్... అధ్యక్షుడి ప్రత్యేక కారును తయారు చేస్తుంది. ఈనెల 24న భారత పర్యటనకు ట్రంప్ రానున్న సందర్భంగా ఇప్పటికే ప్రత్యేక విమానంలో భద్రతా సిబ్బంది సహా అధ్యక్షుడు ప్రయాణించే కారు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంది.
అధ్యక్షుడి కారు 'ద బీస్ట్'లో ప్రత్యేకతలెన్నో.. 'ద బీస్ట్' విశేషాలు:
- బోయింగ్ 757 విమానానికి ఉండే డోర్లు వంటివి 'ద బీస్ట్' కారుకు ఉంటాయి. వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. గ్యాస్, రసాయనాలు లోపలకు వెళ్లలేనంత పటిష్ఠంగా మూసుకొంటాయి.
- కారును నడిపే డ్రైవర్.. ఎప్పుడూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మాత్రమే ఉంటాడు. విపత్కర పరిస్థితుల్లో కారు ఏ వింధంగా నడపాలో ముందే శిక్షణ పొందుతాడు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగడం ఈ కారు ప్రత్యేకత.
- డ్రైవర్ కంపార్ట్మెంట్లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. అది సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తుంది.
- కారు బాడీ మొత్తం ఉక్కు, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్ మిశ్రమంతో తయారు చేస్తారు. బాంబ్ పేలుళ్లనూ తట్టుకునే శక్తి ఈ కారుకు ఉంది.
- ఈ కారు టైర్లను ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏ పరిస్థితుల్లోనూ పంక్చర్ కాదు. ఎప్పుడైనా టైర్ పేలిపోయినప్పటికీ రిమ్తోనూ కారు నడవగలుగుతుంది.
- అధ్యక్షుడి రక్త నమూనాకు సరిపోయే బ్లడ్ బ్యాగ్స్ కారులో అందుబాటులో ఉంచుతారు. చిన్నపాటి తుపాకులు, బాష్పవాయువు గోళాలు వంటివి ఉంటాయి.
- డీజిల్ ట్యాంకుకు ప్రత్యేకంగా తయారు చేసిన కవచం ఉంటుంది. అది ఏ పరిస్థితుల్లోనూ పేలదు. దాని లోపల నురగ వంటి రసాయనాలు ఉంటాయి. అవి మంటలు అంటుకోకుండా చూస్తాయి.
- అధ్యక్షుడు కూర్చునే సీటు వద్ద శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దాని ద్వారా నేరుగా అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్, ఉపాధ్యక్షుడితో మాట్లాడవచ్చు.
- కారులో అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. అందులో బాష్పవాయువు, పొగను తొలగించే పరికరాలు ఉంటాయి.
- అధ్యక్షుడు, ఇతర ప్రయాణికుల మధ్య క్లాస్ కంపార్ట్మెంట్ సౌకర్యం ఉంది. దానిని అధ్యక్షుడు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు. అందులో పానిక్ బటన్, ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి.
భారీ భద్రతా, నిఘా వ్యవస్థల మధ్య అధ్యక్షుడి పర్యటన సాగుతుంది. గడిచిన 3 దశాబ్దాల కాలంలో అధ్యక్షుడి కారుపై ఎలాంటి దాడి జరగలేదు. కానీ అంతకు ముందు 7 సార్లు దాడులు జరిగాయి. 1829-1989 వరకు జరిగిన దాడుల్లో ఏడుగురు అధ్యక్షులు గాయపడ్డారు. ఐదుగురు అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల అధ్యక్షుడి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...