తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య'పై సుప్రీం సయోధ్య తీర్పు - ayodhya verdict news

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. చరిత్ర, పురావస్తు శాఖ, మతం, న్యాయశాస్త్ర సమ్మిళితమైన వాస్తవాలు, సాక్ష్యాలు, వాదనల కలబోతగా, కోట్లాది జనబాహుళ్య మనోభావాల కలనేతగా ఇప్పటికే అనేక పీటముళ్లు పడిన వివాదం తాలూకు లోతులు ముట్టి, కీలక సందేహాలకు సమాధానాలు రాబట్టి న్యాయసమ్మత పరిష్కారంతో సుప్రీంకోర్టు.. జాతి నెత్తిన పాలుపోసింది.

'అయోధ్య'పై సుప్రీం సయోధ్య తీర్పు

By

Published : Nov 10, 2019, 5:24 AM IST

Updated : Nov 10, 2019, 7:29 AM IST

ప్రపంచ న్యాయవిచారణల చరిత్రలోనే కనీవినీ ఎరుగనిదిగా వినుతికెక్కిన అయోధ్య వివాదంలో రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పు సంస్తుతిపాత్రమైనది. స్వతంత్ర భారతావని గుండెలపై ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కుంపటిలా సెగలు పొగలు కక్కుతున్న మందిర్‌-మసీదు సంక్షోభానికి ఏకగ్రీవ తీర్పు ద్వారా ధర్మాసనం శాశ్వతంగా తెరదించింది. చరిత్ర, పురావస్తు శాఖ, మతం, న్యాయశాస్త్ర సమ్మిళితమైన వాస్తవాలు, సాక్ష్యాలు, వాదనల కలబోతగా, కోట్లాది జనబాహుళ్య మనోభావాల కలనేతగా ఇప్పటికే అనేక పీటముళ్లు పడిన వివాదం తాలూకు లోతులు ముట్టి, కీలక సందేహాలకు సమాధానాలు రాబట్టి న్యాయసమ్మత పరిష్కారంతో సుప్రీంకోర్టు.. జాతి నెత్తిన పాలుపోసింది.

సాక్ష్యాల ఆధారంగానే..

అయోధ్యలో కీలక స్థిరాస్తికి సంబంధించిన వ్యాజ్య విచారణలో, విశ్వాసం నమ్మకాల ప్రాతిపదికన కాకుండా సాక్ష్యాల ఆధారంగానే తుదితీర్పు లిఖించామన్న అయిదుగురు సభ్యుల ధర్మాసనం- వివాదాస్పద ఆస్తిపై గల హక్కును ముస్లిముల కంటే ఎక్కువగా హిందూ కక్షిదారులే రుజువు చేసుకొన్నారని స్పష్టీకరిస్తూ దాన్ని వారికే దఖలు పరచింది. మసీదు కట్టడాన్ని చట్టాన్ని అతిక్రమించి కూలగొట్టడం ద్వారా ముస్లిముల హక్కులకు భంగం వాటిల్లజేసిన అంశాన్ని విస్మరిస్తే న్యాయం చేసినట్లు కాదంటూ రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా సంక్రమించిన విశేషాధికారాలతో ధర్మాసనం కొత్త మసీదు నిర్మాణానికీ బాటలు పరచింది. ఆలయ నిర్మాణానికి అనువుగా 1993 నాటి అయోధ్య భూసేకరణ చట్టం నిబంధనలకు అనుగుణంగా మూడు నెలల కాలావధిలో ట్రస్టును ఏర్పరచాలని, మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయిదెకరాల స్థలం కేటాయించాలన్న చారిత్రక తీర్పుపై కొన్ని భిన్న గళాలు విన్నా.. పెద్దయెత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితిని స్వయంగా విచారించి, అందరి పక్షాన తీర్పు రాసిందెవరన్న సమాచారంలో గోప్యత పాటించి, రామజన్మభూమి నిర్ధరణ ప్రాతిపదికలపై 1045 పేజీలతో 116 అనుబంధాల్ని జతపరచి- ఇలా ఎన్నో విధాల విలక్షణత చాటుకొన్న న్యాయనిర్ణయం చారిత్రకమైనది!

దశాబ్దాల సమస్య..

సమస్యను రాజకీయాల నుంచి విముక్తం చేసినప్పుడు, అసలు దాన్ని రాజకీయ దృక్కోణం నుంచి చూడనప్పుడు మాత్రమే దానికో పరిష్కారం లభించగలదని రాజనీతిజ్ఞుడిగా వాజ్‌పేయీ లోగడ చేసిన వ్యాఖ్య అక్షరసత్యం. అయోధ్య వివాదంతో రాజకీయంగా చలి కాగాలని అన్ని పార్టీలూ అనుకోవడమే దశాబ్దాలుగా దేశాన్ని వెంటాడిన దురదృష్టం! 1992 డిసెంబరులో బాబ్రీ కట్టడం కూల్చివేత దరిమిలా- చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి వెంపర్లాడినట్లు, అప్పటి పీవీ ప్రభుత్వం అయోధ్యలో వివాదాస్పద స్థలం సహా మొత్తం 67 ఎకరాల భూమిని సేకరించింది. అందుకోసం 1993లో అయోధ్య భూసేకరణ చట్టాన్నీ చేసింది. పనిలో పనిగా- ‘పదహారో శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు ఆ స్థలంలో హిందూ దేవాలయం ఉండేదా?’ అన్న ప్రశ్నతో రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు ఏక వాక్య నివేదన చేసింది. ఆ నివేదన నిరర్థకమైనదంటూ నిష్కర్షగా తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, 1994 అక్టోబరులో కొద్దిపాటి మినహాయింపులతో 1993 నాటి అయోధ్య భూసేకరణ చట్టం చెల్లుబాటును సమర్ధించింది. అదే సమయంలో వివాదాస్పద భూమికి సంబంధించి కోర్టుల్లో ట్రైబ్యునళ్లలో పెండింగులో ఉన్న దావాలు, అప్పీళ్ల విచారణ కొనసాగాలని నిర్దేశించింది.

అయోధ్య స్థల వివాదానికి సంబంధించి 2010లో అలహాబాద్‌ హైకోర్టు లఖ్​నవూ ధర్మాసనం ఇచ్చిన విడ్డూర తీర్పు మీద అప్పీళ్ల విచారణే తాజాగా చారిత్రక న్యాయ నిర్ణయానికి బాటలు పరిచింది. పాతికేళ్ల క్రితం తాను సమర్థించిన అయోధ్య భూసేకరణ చట్టమే- క్షేత్రస్థాయిలో నేటి తీర్పు అమలుకు అక్కరకు వస్తోంది. ఏకగ్రీవంగా రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పును ప్రజానీకం అంతే పరిణత స్ఫూర్తితో స్వీకరించడం యావత్‌ భారతావనినీ విజేతగా నిలబెడుతోంది!

చరిత్రను మధించి..

అయోధ్య వివాదానికి సంబంధించి చరిత్ర లోతుల్లోకి వెళితే సత్యమనే నిధి లభిస్తుందో, గందరగోళమనే భూతం వెంటాడుతుందో చెప్పలేమని 2010లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తీకరించారు. రాముడి విగ్రహం ఉన్న ప్రాంతం హిందువులకు చెందుతుందంటూ నాడు ముగ్గురు న్యాయమూర్తుల మధ్య వ్యక్తమైన ఏకాభిప్రాయం- కక్షిదారులకు ‘సమాన వాటా’ల న్యాయానికి ప్రేరకమైంది. ఆ తీర్పే అసంబద్ధమని 2011 మే నెలలో నిలిపేసిన సుప్రీంకోర్టు- తాజా న్యాయ నిర్ణయం చేయడానికి చరిత్రను అక్షరాలా మధించింది.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి విచక్షణాధికారంతో మొన్న జనవరిలో కొలువుతీర్చిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం- హిందీ, ఉర్దూ, గురుముఖి, అరబిక్‌, సంస్కృతం, పర్షియన్‌ భాషల్లో 15 ట్రంకు పెట్టెల నిండా ఉన్న విలువైన సమాచార పత్రాల్ని తర్జుమా చేయించే మహా క్రతువు చేపట్టింది. అదే సమయంలో సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్‌, శ్రీరామ్‌ పంచు సభ్యులుగా మధ్యవర్తిత్వ మండలి ద్వారా సమాంతర పరిష్కారానికీ చొరవ చూపింది. దాదాపు తుది పరిష్కారానికి చేరువ అయ్యారంటూ మధ్యవర్తుల్ని న్యాయపాలిక తాజాగా అభినందించింది. రామ మందిర నిర్మాణానికి శంకరాచార్యులతో ట్రస్టు ఏర్పాటు, ఆలయ నిర్మాణ ప్రణాళికల్ని 1994 జులైలో ప్రధానిగా పీవీ ప్రస్తావించారు. పాతికేళ్ల తరవాత, తాజా తీర్పుతో వివాదం తెలిమబ్బులా తేలిపోగా రామాలయ నిర్మాణం కోసం మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. హిందూ ముస్లిం సమైక్యతా స్ఫూర్తిని చాటేలా మందిర్‌-మసీదు నిర్మాణాలు జాతి సమగ్రతా సూచికలై నిలవాలని యావజ్జాతీ అభిలషిస్తోంది!

ఇదీ చూడండి:'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం

Last Updated : Nov 10, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details